
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో విరాట్ కర్ణ విలేకరుల సమావేశంలో సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. విరాట్ కర్ణ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా నా అదృష్టంగా భావిస్తున్నాను. తొలి సినిమా పెదకాపు కూడా భారీ బడ్జెట్ సినిమానే. ఇప్పుడు నాగబంధం కూడా చాలా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. పెదకాపు ఫలితం ఎలా ఉన్నప్పటికీ, ఒక నటుడిగా 100 శాతం కష్టపడ్డాను. ఆ పాత్రకు కావాల్సిన ప్రతిదీ చేశాను. నటుడిగా మంచి ప్రసంశలు వచ్చాయి. ఆ సినిమా కంటే ఈ సినిమాకు రెట్టింపు కష్టపడ్డాను’
‘నాగబంధం కథ విన్నప్పుడే నా పాత్ర ఎలా ఉండాలో ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. ఈ కథ నా కోసమే రాసినట్టుగా అనిపించింది. రుద్ర, నాగసాధు పాత్రల గురించి చెప్పినప్పుడు చాలా ఉత్సాహంగా అనిపించింది. ఇలాంటి సినిమా కోసం ఎదురు చూస్తున్నానని అనిపించింది. వెంటనే పాత్రకు తగ్గట్టుగా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకున్నాను. హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను. డాన్స్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాను. పాత్రకు తగ్గట్టుగా నన్ను నేను పూర్తిగా మార్చుకున్నాను. ఇందులో నాగసాధు పాత్ర మేకప్ కి ఆరు గంటల సమయం పట్టేది. పరిశ్రమలో నాకంటూ ఒక గుర్తింపు రావాలని ఎప్పుడూ అనుకుంటుంటాను. ఒక నటుడికి ఇలాంటి పాత్ర రావడం గొప్ప అవకాశం. ఆ అవకాశం నాకు నాగబంధంతో వచ్చింది. ఈ సినిమా కోసం ఎంతగానో శ్రమించాను. షూటింగ్ సమయంలో నాకు జ్వరం ఉన్నా కూడా ఎక్కడా వెనకడుగు వేయలేదు. ప్రాణం పెట్టి పనిచేశాను’
‘సినిమా కథ విన్నప్పుడే రుద్ర పాత్ర ఎలా ఉండాలో పూర్తిగా అర్థమైంది. పాత్ర కోసం దాదాపు 20 కిలోల బరువు పెరిగాను. తర్వాత నాగసాధువుగా కనిపించడానికి మరో ఐదు కిలోలు తగ్గాను. బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నాను. షూటింగ్ సమయంలో ప్రతిరోజూ ఒక శివాలయానికి వెళ్లి అభిషేకం చేసేవాడిని. షూటింగ్ పూర్తయ్యాక శివమాల కూడా ధరించాను. ఆ ప్రయాణంలో ఎన్నో శివాలయాలు సందర్శించాను. ప్రతిరోజూ షూటింగ్‌లో 300 మంది జూనియర్ ఆర్టిస్టులు, భారీ సెట్లు ఉండేవి. నమోరే పాట కోసం దాదాపు 5,000 మంది పాల్గొన్నారు. అయితే ఆ ఒత్తిడిని మొత్తం మా దర్శకుడు అభిషేక్ నామా గారే తీసుకున్నారు. “మంచి సినిమా చేస్తున్నాం… ఇవేమీ ఆలోచించకు” అని ఎప్పుడూ ధైర్యం చెప్పేవారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇప్పటివరకు చూసిన వారందరూ చాలా మంచి రిపోర్ట్ ఇస్తున్నారు. అభిషేక్ నామా గారికి మాస్ పల్స్ బాగా తెలుసు. ఆయన తీసిన ప్రతి సన్నివేశం నాకు గూస్‌బంప్స్ కలిగించింది. ప్రేక్షకులు కూడా థియేటర్లలో విజువల్‌గా చాలా గ్రాండ్‌గా ఎంజాయ్ చేస్తారు. నభా పాత్ర ఇందులో కీలకం. ఇందులో కొన్ని సస్పెన్స్‌లు ఉన్నాయి. అవి మీరు తెరపై చూసినప్పుడే తెలుస్తాయి. ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. పాటలు విజువల్‌గా చాలా గ్రాండ్‌గా వుంటాయి. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ పాత్ర కోసం నా వైపు నుంచి 100 శాతం కష్టపడ్డాను. ఈ సినిమాలో ఒక్క యాక్షన్ సీన్‌కూ డూప్ ఉపయోగించలేదు. అన్ని యాక్షన్ సన్నివేశాలు నేనే స్వయంగా చేశాను అని తెలిపాడు విరాట్ కర్ణ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి