ఆ ఒక్క కారణం వల్లే రూ.1800 కోట్లు పోగొట్టుకున్న తెలుగు హీరో ఇతనే..!

తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు "శివాజీ". 2025లో విడుదలైన 'కోర్టు' సినిమాతో గట్టి కమ్ బ్యాక్ ఇచ్చిన ఆయన ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గతంలో తాను చేసిన భూమి కొనుగోళ్లు, అమ్మకాలు గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఆ ఒక్క కారణం వల్లే రూ.1800 కోట్లు పోగొట్టుకున్న తెలుగు హీరో ఇతనే..!
Actor Sivaji

Updated on: Nov 25, 2026 | 6:23 PM

తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు “శివాజీ”. తొలుత డబ్బింగ్ ఆర్టిస్టుగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి.. ఉదయ్ కిరణ్ నటించిన ‘చిత్రం’.. నితిన్ నటించిన ‘జయం’, ‘దిల్’, ‘సొంతం’ వంటి సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. అలానే ‘దిల్’ సినిమాకు ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా నంది అవార్డు కూడా అందుకున్నారు. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చారు. ‘ఖుషి’, ‘ఇంద్ర’ వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించారు. అనంతరం హీరోగా అవకాశాలు అందుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2003లో విడుదలైన ‘మిస్సమ్మ’ సినిమాతో హీరోగా శివాజీకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ‘అదిరిందయ్యా చంద్రం’, ‘సత్యభామ’, ‘మంత్ర’, ‘తాజ్‌మహల్’ వంటి చిత్రాల్లో నటించారు.

అయితే సినిమా అవకాశాలు తగ్గిన సమయంలో శివాజీ కొంతకాలం నటనకు విరామం ఇచ్చారు. ఆ సమయంలో రాజకీయల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో గతంలో ఆందోళనలు కూడా చేశారు. కానీ శివాజీకి ‘బిగ్‌బాస్ తెలుగు 7′ మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ షోలో తన మాటతీరు, ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ’90’s – A Middle Class Biopic’ వెబ్ సిరీస్‌లో చంద్రశేఖర్ పాత్ర పోషించారు. ఈ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఆయనకు మళ్లీ నటుడిగా అవకాశాలు పెరిగాయి.

‘కోర్టు’తో కమ్‌బ్యాక్..

2025లో విడుదలైన ‘కోర్టు’ సినిమాలో శివాజీ పోషించిన మంగపతి పాత్ర ఆయన కెరీర్‌లో కీలకంగా నిలిచింది. కథలో ప్రాధాన్యం ఉన్న ఈ పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. విలక్షణమైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో పాత్రకు ప్రత్యేకత తీసుకొచ్చారు. ఈ సినిమా తర్వాత ఆయనకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మరిన్ని అవకాశాలు వచ్చాయి. ఇటీవల ‘ధండోరా’, ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 18 ఎకరాలు అమ్మేశా!

హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోనూ తాను 18 ఎకరాల భూమిని కొనుగోలు చేసి విక్రయించినట్లు శివాజీ వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ ఎకరం విలువ సుమారు రూ.100 కోట్ల వరకు ఉందని తెలిపారు. ఆ లెక్కన తాను అమ్మిన 18 ఎకరాల భూమి విలువ ఇప్పుడు దాదాపు రూ.1,800 కోట్లకు చేరుతుందని చెప్పారు. కనీసం ఒక్క ఎకరమైనా తన దగ్గర ఉంచుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అయితే రియల్ ఎస్టేట్ ద్వారా తాను వేల కోట్ల ఆస్తులు సంపాదించాననే ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. సినిమాలు లేని సమయంలో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, వ్యాపారంలో డబ్బును తిప్పడానికి భూములు, ప్లాట్లు కొనుగోలు చేసి అమ్మేవాడినని తెలిపారు. భవిష్యత్తులో భూముల ధరలు ఇంతగా పెరుగుతాయని అప్పట్లో ఊహించలేకపోయానని చెప్పారు.

Loading...
Unable to load recommendations.
Follow Us