Chandrahass: తెలుగు సినిమాకు తెగులు పట్టింది.. మిస్టర్ ప్రభాకర్ ఇదేనా మీ కొడుక్కి నేర్పించింది..

నటుడు చంద్రహాస్ తన కొత్త చిత్రం "బరాబర్ ప్రేమిస్తా" ప్రమోషన్ ఈవెంట్‌లో అభ్యంతరకర పదజాలంతో కూడిన పాట పాడటం తీవ్ర వివాదానికి దారితీసింది. మహిళలు ఉన్నారని కూడా చూసుకోకుండా.. ఈ పాట పాడటంపై నెటిజన్లు, సినీ వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రమోషన్ కోసం ఇంతలా అతి చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

Chandrahass: తెలుగు సినిమాకు తెగులు పట్టింది.. మిస్టర్ ప్రభాకర్ ఇదేనా మీ కొడుక్కి నేర్పించింది..
Chandrahass

Updated on: Feb 03, 2026 | 3:05 PM

నటుడుగా నిలదొక్కుకోడానికి విచ్చలవిడితనం, అసభ్యతలను అర్హతలుగా భావిస్తున్నట్లు ఉన్నాడు యువ కథానాయకుడు చంద్రహాస్. రోజుకింత పైత్యం ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నాడు.  తన కొత్త చిత్రం “బరాబర్ ప్రేమిస్తా” ప్రమోషన్ ఈవెంట్‌లో అత్యంత అభ్యంతరకరమైన పాట పాడి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటన ప్రస్తుతం టాలీవుడ్‌లో, సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రహాస్ పచ్చి బూతులతో కూడిన పాటను మహిళలు, కుటుంబ సభ్యులు ఉన్న సభలో పాడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వేడుకకు సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి, డైరెక్టర్ జయంత్ సీ పరాన్జీ, హీరో ఆది సాయికుమార్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. వారితో పాటు పలువురు మహిళలు ఉండగా.. ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ అవుతుండగా.. చంద్రహాస్ ఇలాంటి పాటను ఆలపించడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. పాపులారిటీ కోసం తెలుగు సినిమా గౌరవాన్ని దిగజార్చి, పరిశ్రమను బి-గ్రేడ్ స్థాయికి తీసుకెళ్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సీరియల్ నటుడు ప్రభాకర్ తనయుడిగా సినిమా రంగంలోకి ప్రవేశించిన చంద్రహాస్, ఇలాంటి వివాదాస్పద పనులతో వార్తల్లో నిలవాలని చూస్తున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటలోని పదాలు అత్యంత దారుణంగా, డబుల్ మీనింగ్‌తో ఉన్నాయని, మహిళల ముందే అశ్లీల పాట పాడటం ఏమాత్రం సరికాదని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. వేదికపై ఉన్న పలువురు మహిళలు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఏమాత్రం సంకోచం లేకుండా చంద్రహాస్ ఈ పాటను పాడటం అందరినీ విస్మయానికి గురిచేసింది. అయితే లైవ్‌లో పాడేందుకు పాటలోని కొన్ని పంక్తులు మార్చామని..సెన్సార్ అభ్యంతరాల వల్ల సినిమాలో ఈ లిరిక్స్‌ ఉండబోవని చంద్రహాస్ చెప్పుకొచ్చాడు.

సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటి వికృత ప్రచారాలు చేయడం అవసరమా అని తెలుగు సినిమా ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. కొందరు నెటిజన్లు  “సినిమా హిట్ అవ్వాలంటే కంటెంట్ ఉండాలి కానీ ఇలాంటి కాంట్రవర్సీలు కాదు” అని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటనపై తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఇప్పటి వరకు ఎవరూ అధికారికంగా స్పందించలేదు. ప్రభాకర్ ఎంతో సీనియర్ నటుడు.. ఇండస్ట్రీలో రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి. అలాంటిది తనయుడు ఇలాంటి పాటను అందరి ముందు పాడుతుంటే ఆయన నవ్వుతూ ఆస్వాదించడం సిగ్గుచేటు. కనీసం అక్కడున్న గెస్టులు అన్నా.. వారించాల్సింది. ఏది ఏమైనా  ఒక సినిమా కోసం ఇంత దిగజారి, నీచమైన పదాలు వాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ పాటలో ఉన్న విపరీత బూతులు కారణంగా దాన్ని మీ ముందు పెట్టలేకపోతున్నాం.