
కేవలం వారసురాళ్లుగా పేరు కోసమే కాకుండా, తమ తండ్రుల కెరీర్‌ను మలుపు తిప్పే బాధ్యతను భుజాన వేసుకుంటున్నారు. ఒకరు తండ్రి కోసం బ్లాక్ బస్టర్ సినిమా నిర్మిస్తే, మరొకరు తండ్రి కమ్‌బ్యాక్ కోసం డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. ఇంకొకరు ఏకంగా తండ్రి దర్శకత్వంలోనే కథానాయికగా మెరవబోతున్నారు. నమ్మకం, వారసత్వం, కుటుంబ బంధం.. ఇలా అన్ని విలువల కలయికగా సాగుతున్న ఈ ‘తండ్రీకూతుళ్ల’ సినీ ప్రయాణం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ కొత్త ట్రెండ్‌లో అందరికంటే ముందుగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నిలిచింది. చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మాణ రంగంలో ఇప్పటికే తన సత్తా చాటుతున్నారు. తాజాగా ఆమె తన తండ్రి హీరోగా ‘మన శంకర వర ప్రసాద్’ అనే సినిమాను నిర్మించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. తండ్రి పేరు మీదనే ఉన్న ఈ సినిమాకు కుమార్తె నిర్మాతగా వ్యవహరించడం విశేషం. వినోదంతో పాటు కుటుంబ భావోద్వేగాలను పండించిన ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తండ్రి వారసత్వాన్ని కుమార్తె బాధ్యతగా ముందుకు తీసుకెళ్లిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
దర్శకుడు గుణశేఖర్ కూడా తన కెరీర్ లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన కుమార్తె నీలిమ గుణ నిర్మాతగా ‘యూఫోరియా’ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. గతంలో కొన్ని పరాజయాలు ఎదురైనప్పటికీ, తన కుమార్తె ఇచ్చిన ధైర్యంతో గుణశేఖర్ ఒక సరికొత్త జానర్ ను ఎంచుకున్నారు. సారా, భూమిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. కథనం ఎంతో కొత్తగా ఉందని, దర్శకుడిగా గుణశేఖర్ మళ్ళీ తన ఫామ్ లోకి వచ్చారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తండ్రి విజన్ ను నమ్మి నీలిమ గుణ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
మాస్ హీరో రవితేజ ప్రస్తుతం తన కెరీర్ లో వరుస ఫ్లాపులతో కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆయన కుమార్తె మోక్షధ రంగంలోకి దిగారు. రవితేజ కొత్త సినిమా ‘ఇరుముడి’ నిర్మాణ వ్యవహారాలను ఆమె స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తండ్రిని మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కించేందుకు మోక్షధ తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. తన తండ్రి కోసం కుమార్తె ఇంతగా శ్రమిస్తుండటం మాస్ రాజా అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ సినిమా రవితేజ కెరీర్ కు అత్యంత కీలకం కావడంతో అందరి దృష్టి ఈ ప్రాజెక్ట్ పైనే ఉంది.
యాక్షన్ కింగ్ అర్జున్ మరో అడుగు ముందుకేసి తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ ను తన దర్శకత్వంలోనే హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ‘సీతా పయనం’ ఈ వారం థియేటర్లలోకి రాబోతోంది. నిన్న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు సోషల్ మీడియాలో భారీ స్పందన లభించింది. తండ్రి దర్శకుడిగా, కుమార్తె హీరోయిన్ గా చేస్తున్న ఈ క్రేజీ ప్రయోగం ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2026లో కనిపిస్తున్న ఈ ట్రెండ్ తెలుగు సినిమా పరిశ్రమలో ఒక హెల్తీ వాతావరణాన్ని సృష్టిస్తోంది. తండ్రులకు తోడుగా కుమార్తెలు నిలబడటం వల్ల సినిమాల్లో కొత్త ఆలోచనలు, బాధ్యతాయుతమైన నిర్మాణం కనిపిస్తోంది.