
మూవీ రివ్యూ: Mr. వర్క్ ఫ్రమ్ హోమ్
నటీనటులు: త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, వైవా హర్ష, సుధాకర్, అవినాష్ కురివిల్లా, సత్య కృష్ణణ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: రవికుమార్ వి
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: అరుణ్ చిలువేరు
నిర్మాత: అరవింద్ మందెం
దర్శకుడు: మధుదీప్ చెలికాని
కథ:
అరవింద్ (త్రిగుణ్) అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా నాలుగేళ్లు పని చేసిన తర్వాత ఇండియాకు వస్తాడు. ఉద్యోగం చేయడం అరవింద్‌కు అస్సలు ఇష్టం ఉండదు.. సొంతంగా ఏదైనా చేయాలి, జనాలకు ఉపయోగపడే పని చేయాలనుకుంటాడు. ఈ క్రమంలోనే రసాయన ఎరువుల కారణంగా భూములు నిస్సారమవుతున్నాయి.. ఇప్పటి జనరేషన్ కూడా అలాంటి అనారోగ్యకరమైన ఫుడ్ తిని త్వరగా ప్రాణాలు కోల్పోతున్నారని తెలుసుకుంటాడు అరవింద్. దానికోసం ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనుకుంటాడు అరవింద్. వ్యవసాయంలో కొత్త తరహా పద్దతులను ప్రవేశపెట్టడమే కాకుండా రైతులు ఆదాయం పెంచడానికి ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ అనే యాప్ తీసుకొస్తాడు.. అందులోనే మిల్లట్స్ పండిస్తాడు. ఈ మధ్యలో మహి (పాయల్ రాధాకృష్ణ)ని తొలిచూపులోనే చూసి ప్రేమలో పడతాడు. కానీ అతను ఉద్యోగం చేయడం లేదని ప్రేమను అంగీకరించదు. అయినా కూడా తన లక్ష్యం మరిచిపోకుండా వ్యవసాయం వైపు వెళ్తాడు అరవింద్.. ఆ తర్వాత ఏం జరిగింది.. చివరికి రైతులకు అరవింద్ ఏం చేసాడు.. తన జీవితంలో ప్రేమను సంపాదించాడా లేదా అనేది అసలు కథ..
కథనం:
తెలుగులో వ్యవసాయం కాన్సెప్టుతో చాలా సినిమాలు వచ్చాయి. గత పదేళ్లలో అంటే మహేష్ బాబు మహర్షి, నితిన్ భీష్మ సినిమాలు గుర్తుకొస్తాయి. ఈ రెండు మంచి విజయం సాధించాయి. ఇప్పుడు దర్శకుడు మధుదీప్ చెలికానీ కూడా ‘Mr వర్క్ ఫ్రమ్ హోమ్’ సినిమాలో ఇదే చెప్పాలనుకున్నాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే సాఫ్ట్ వేర్ జాబ్‌కు సంబంధించిన కథ అనుకుంటారు కానీ దర్శకుడు మాత్రం ఇందులో కొత్త పాయింట్ టచ్ చేసాడు. హీరో సాఫ్ట్ వేర్ ఉద్యోగం మానేసి.. వ్యవసాయం చేయాలనుకుంటాడు. మారుతున్న లైఫ్ స్టైల్‌ను ఇందులో చూపించాడు దర్శకుడు. నాసీరకం ఫుడ్ తినడం వల్లే ఈ రోజుల్లో చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నాం అనేది చూపించాడు. 40 యేళ్ల లోపు షుగర్, బీపీ సహా గుండె జబ్బుల బారిన పడటానికి కూడా ఈ ఫుడ్ అలవాట్లే అనేది ఇందులో చూపించిన ప్రధానమైన విషయం. అందుకే మన పూర్వీకులు తీసుకున్న ఆహారాన్ని మనం తీసుకోవడమే దీనికి పరిష్కారం అని హీరో నమ్ముతాడు. అక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుంది.. కాకపోతే దీన్ని ఇంకాస్త నేర్పుగా రాసుకుని ఉంటే బాగుండేది. మిల్లెట్ల ఆవశ్యకతను ఇంకా బాగా చూపించలేదు. వ్యవసాయంలో మళ్లీ సంప్రదాయ కొత్త పద్ధతులను ప్రవేశపెట్టి తక్కువ పెట్టుబడితో ఉన్న టెక్నాలజీతో ఎక్కువ దిగుబడులు వచ్చేలా చేసే ప్రక్రియ ఇంకాస్త లోతుగా చూపించాల్సింది. చిన్న సినిమా అంటే ఏదో అల్లాటప్పా కథ కాకుండా వ్యవసాయం, మిల్లట్స్ అంటూ మంచి కథనే చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు మధుదీప్. మహేష్ బాబు మహర్షి సినిమాలో కూడా రైతుల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సినిమా కూడా రైతుల గురించే ఆలోచింపజేస్తుంది..? కథ అంతా దాని చుట్టూనే తిరుగుతుంది.
నటీనటులు:
త్రిగుణ్ తన నటనతో మెప్పించాడు. మనోడిని స్క్రీన్ మీద చూస్తుంటే అప్పుడప్పుడూ హీరో రామ్ పోతినేని గుర్తుకొస్తాడు. కొన్ని యాంగిల్స్‌లో చూడ్డానికి అలాగే ఉన్నాడు. ఎమోషనల్ సీన్స్ పరంగా బాగానే యాక్ట్ చేసాడు. హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ అందంగా కనిపించింది. హీరో తండ్రి పాత్రలో నటించిన అవినాష్ కురువిల్లా, ఆర్గానిక్ వ్యవసాయం వైపు హీరోను టర్న్ చేసే పాత్రలో శివాజీ రాజా తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన నటీనటులు తమ పరిది మేర నటించి ఆకట్టుకున్నారు.
టెక్నికల్ టీం:
ఈ సినిమాకు అరుణ్ అందించిన మ్యూజిక్ పర్లేదు.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. రవికుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ మాత్రం అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు ట్రిమ్ చేసినా నష్టం లేదేమో..? నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగానే ఉంది. దర్శకుడు మధుదీప్ చెప్పాలనుకున్న పాయింట్ బాగుంది.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా ‘Mr వర్క్ ఫ్రమ్ హోమ్’.. వ్యవ‘సాయం’ గురించి చెప్పిన సినిమా..!