
మూవీ రివ్యూ: మీర్జాపూర్ ది మూవీ
నటీనటులు: పంకజ్ త్రిపాఠి, దివ్యేందు, అలీ ఫాజిల్, జితేంద్ర కుమార్, రవికిషన్, శ్వేతా త్రిపాఠి, రసిక దుగ్గల్ తదితరులు
సినిమాటోగ్రఫీ: సంజయ్ కపూర్
ఎడిటింగ్: మనన్ అశ్విన్ మెహతా
సంగీతం: ఆశీష్ ఖండాల్, జునైద్ కుమార్, దండా నైలివాలా
నిర్మాతలు: రితేశ్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్
దర్శకుడు: గుర్మీత్ సింగ్
కథ:
మిర్జాపూర్ గద్దె కోసం జరిగే ఆధిపత్య పోరును కొత్త కోణంలో తెరపైకి తీసుకొచ్చారు. కాలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠి) తన పవర్‌ను నిలుపుకోవాలని చూస్తుండగా, తండ్రి మెప్పు పొంది ఆ కుర్చీ ఎక్కాలని మున్నా భయ్యా (దివ్యేందు శర్మ) ఆరాటపడుతుంటాడు. మరోవైపు గుడ్డు పండిట్ (అలీ ఫాజిల్), బబ్లూ పండిట్ (జితేంద్ర కుమార్) సోదరులు తమ కుటుంబం, పాత పగలు, అధికార దాహం మధ్య నలిగిపోతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మిర్జాపూర్ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి బబ్బన్ బబువా (రవి కిషన్) అనే సరికొత్త వ్యక్తి రంగంలోకి దిగుతాడు. దీంతో అక్కడి సమీకరణాలు ఒక్కసారిగా మారిపోతాయి. బీనా వదిన కూడా తనదైన శైలిలో పావులు కదుపుతుంది. ఈ పవర్ గేమ్‌లో చివరికి ఎవరు గెలిచారు, పాత శత్రుత్వాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అనేదే ప్రధానాంశం.
కథనం:
వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులకు అలవాటైన తుపాకుల మోతలు, రక్తపాతం, బూతులు, పగలు, ప్రతీకారాలు సినిమా వెండితెరపై మరింత భారీగా కనిపిస్తాయి. దర్శకుడు ఈ మిర్జాపూర్ ప్రపంచాన్ని థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌కు తగ్గట్లుగా భారీ కాన్వాస్‌పై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. అయితే ఓటీటీలో మాదిరిగా మూడు గంటల పాటు ప్రేక్షకులను థియేటర్లలో కట్టిపడేయడంలో కాస్త తడబడ్డారు. మొదటి సగంలో పాత పాత్రల మధ్య వైరం, కొత్త క్యారెక్టర్ల ఎంట్రీతో స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగానే సాగుతుంది. కానీ సెకండాఫ్‌కి వచ్చేసరికి అనవసరమైన ట్రాక్‌లు, రొమాంటిక్ పాటలు రావడం వల్ల అసలు కథ పక్కదారి పడుతుంది. ముఖ్యంగా చాలా మంది క్యారెక్టర్లను ఒకేసారి తెరపై చూపించాలనే అత్యాశ వల్ల ఏ ఒక్కరి కథకూ సరైన ముగింపు దొరకదు. దీనికి తోడు మున్నా భయ్యాను మళ్లీ మళ్లీ అవమానించే సన్నివేశాలు సిరీస్‌లో చూసినవే కావడంతో కాస్త విసుగు తెప్పిస్తాయి.
క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా లాజిక్‌కు దూరంగా సాగాయి. ఓ భయంకరమైన గ్యాంగ్ వార్ సీన్‌లో చనిపోయాడనుకున్న గుడ్డు పండిట్.. ఒంటెకు ఇచ్చే ఇంజెక్షన్ తీసుకుని హల్క్‌లా మారిపోయి శత్రువుల మీద విరుచుకుపడటం సిల్లీగా అనిపిస్తుంది. అలాగే సినిమా అంతా మోస్ట్ పవర్ ఫుల్‌గా, భయంకరంగా కనిపించిన బబ్బన్ బబువా పాత్రను క్లైమాక్స్‌లో చాలా సింపుల్‌గా తేల్చేయడం ఫ్యాన్స్‌కు ఏమాత్రం రుచించదు. బిర్జు పాత్ర ముగింపు కూడా నిరాశపరుస్తుంది. ఓటీటీలో ఉన్నంత స్వేచ్ఛ లేకపోవడం వల్ల సెన్సార్ కత్తెరకు భయపడి హింసను, బూతులను బాగా తగ్గించేశారు. కథను ముందుకు తీసుకెళ్లని ఎన్నో సన్నివేశాలను ఎడిటింగ్ టేబుల్ దగ్గర నిర్దాక్షిణ్యంగా కత్తిరించి ఉంటే ఫలితం కచ్చితంగా మరోలా ఉండేది.
నటీనటులు:
కాలీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి మరోసారి అదరగొట్టినా, ఆయనకు స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ దక్కింది. గుడ్డు, మున్నా పాత్రల్లో అలీ ఫజల్, దివ్యేందు శర్మ పాత వైబ్‌ను బాగానే క్రియేట్ చేశారు. అయితే బబ్లూ పండిట్‌గా జీతేంద్ర కుమార్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. గతంలో ఆ పాత్ర చేసిన విక్రాంత్ మెస్సీ నీడ నుంచి అతను బయటపడలేకపోయాడు. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన మోహిత్ మాలిక్ తన నటనతో ఆకట్టుకున్నాడు. బబ్బన్ బబువాగా రవికిషన్ నటన హైలైట్‌గా నిలుస్తుంది. తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో మిగతా స్టార్లందరినీ డామినేట్ చేశాడు. బీనా వదినగా రసిక దుగల్ క్లైమాక్స్‌లో తన మార్క్ చూపించింది. సోనాలి చౌహాన్ పరిమిత పాత్రలో అందంతో కట్టిపడేసింది. మిగిలిన వాళ్లలో సుశాంత్ సింగ్ లాంటి ప్రతిభావంతుడిని సరిగ్గా వాడుకోలేదు కానీ, షీబా చద్దా, రాజేష్ తైలాంగ్, కుల్‌భూషణ్ ఖర్బందా తమ పరిధి మేర మెప్పించారు.
టెక్నికల్ టీం:
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ర్యాప్ సాంగ్స్ సినిమా లోకల్ థీమ్‌కు సరిగ్గా సింక్ అయ్యాయి. కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. రాజస్థాన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్స్ విజువల్‌గా చాలా రిచ్‌గా ఉన్నాయి. యాక్షన్ కొరియోగ్రఫీ భారీ స్థాయిలో ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయ్యింది. ముఖ్యంగా ఎడిటింగ్ విభాగం పూర్తిగా విఫలమైంది. సినిమా నిడివిని బాగా తగ్గించి ఉంటే ఈ సాంకేతిక హంగులు సినిమాకు మరింత ప్లస్ అయ్యేవి. దర్శకుడు గుర్మీత్ సింగ్ పాత మిర్జాపూర్ ఫ్లేవర్‌ను చెడగొట్టకుండా థియేట్రికల్ వాతావరణానికి తగ్గట్లుగా సినిమాను తీర్చిదిద్దారు. పాత క్యారెక్టర్లు ఎదురుపడే సీన్స్, వాళ్ల మధ్య డైలాగ్స్ చాలా బాగా డిజైన్ చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా మీర్జాపూర్ ది మూవీ.. బోల్డ్ ఫ్రాంచైజీకి మాస్ థియెట్రికల్ ఎక్స్‌పీరియన్స్..!