Vaala 2 Review: వాలా 2 సినిమా రివ్యూ.. మలయాళ బ్లాక్ బస్టర్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా..?

మలయాళంలో ఏకంగా రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించిన యూత్‌ఫుల్ డ్రామా వాలా 2 (Vaazha 2: Biopic of a Billion Bros). ఏప్రిల్ 24న తెలుగులో విడుదలైన ఈ సినిమా మోడరన్ యూత్‌ను, ముఖ్యంగా మిడిల్ క్లాస్ కుర్రాళ్లను ఏ స్థాయిలో మెప్పించిందో ఇక్కడ డీటెయిల్‌గా చూద్దాం.

Vaala 2 Review: వాలా 2 సినిమా రివ్యూ.. మలయాళ బ్లాక్ బస్టర్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా..?
Vaazha 2

Edited By:

Updated on: Apr 24, 2026 | 7:22 AM

మూవీ రివ్యూ: వాలా 2

నటీనటులు : హషీర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, వినాయక్ వి, అజిన్ జాయ్ తదితరులు

సంగీతం : ఏ టీమ్

సినిమాటోగ్రఫీ : అఖిల్ లైలాసురన్

ఎడిటర్ : కన్నన్ మోహన్

దర్శకుడు : సావిన్ ఎస్ఏ

నిర్మాత : విపిన్ దాస్

కథ:

హాషిర్, అలెన్, అజిన్, వినాయక్.. ఈ నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్లు స్కూల్, కాలేజీ రోజుల్లో చదువు మీద కంటే అల్లరి, తుంటరి పనుల మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. పేరెంట్స్, టీచర్స్ దృష్టిలో వీళ్లొక వేస్ట్ బ్యాచ్ లేదా లూజర్స్. అయితే క్లాస్‌లో అమ్మాయిలతో ఎఫైర్స్, మొబైల్స్ తేవడం లాంటి చిన్న చిన్న విషయాలతో మొదలైన వీళ్ల అల్లరి.. అనుకోకుండా ఓ డ్రగ్స్ వ్యవహారం, ఒక టీచర్‌పై చేయి చేసుకోవడం దాకా వెళ్తుంది. దీనివల్ల పోలీసు కేసులవుతాయి. సమాజంతో పాటు సొంత కుటుంబ సభ్యులు కూడా వీళ్లని దూరం పెడతారు. ఆ లూజర్ ముద్రను చెరిపేసుకుని, తమని తాము ప్రూవ్ చేసుకోవడానికి వీరు యూకే, దుబాయ్ లాంటి దేశాలకు వెళ్లి సెటిల్ అవ్వాలని నిర్ణయించుకుంటారు. ఆ ప్రయాణంలో వాళ్లు పడ్డ కష్టాలు ఏంటి..? వాళ్ళ కలలు నెరవేరాయా..? చివరికి వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళను అర్థం చేసుకున్నాయా..? అన్నదే ఈ సినిమా కథ.

కథనం:

ఈ సినిమాకు అసలైన బలం, ప్రాణం.. దీని కథనం. ఒక సింపుల్ పాయింట్‌ను తీసుకొని, ఆడియన్స్‌ను ఎమోషనల్ రోలర్ కోస్టర్‌ ఎక్కించడంలో డైరెక్టర్ సావిన్ ఎస్.ఏ, రచయిత విపిన్ దాస్ 100 శాతం సక్సెస్ అయ్యారు. ఫస్టాఫ్ మొత్తం పక్కా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లా పరుగులు పెడుతుంది. కథనం చాలా నేచురల్ అండ్ గ్రౌండెడ్ అప్రోచ్‌తో సాగుతుంది. కుర్రాళ్ల స్కూల్, కాలేజీ లైఫ్, ఫస్ట్ లవ్, బ్రేకప్స్, వాళ్ల మధ్య ఉండే ఆ చిలిపి గొడవలు.. ఇవన్నీ చూస్తుంటే ప్రతి ఒక్కరికీ వాళ్ళ కాలేజీ రోజులు గుర్తొస్తాయి. ఎక్కడా సీన్స్ బోర్ కొట్టకుండా, ఒక హై-ఎనర్జీతో ఫాస్ట్‌గా కట్ అవుతూ వెళ్తాయి. ముఖ్యంగా స్ట్రిక్ట్ గా ఉండే ముజీబ్ సార్ ఎపిసోడ్, థియేటర్లో కుర్రాళ్లు చేసే అల్లరి కడుపుబ్బా నవ్విస్తాయి. హాస్యం అనేది ఎక్కడా ఇరికించినట్లు లేకుండా, ఆ సిట్యువేషన్స్ లోంచే పుడుతూ ఆడియన్స్‌ను ఎంగేజ్ చేస్తుంది. డబ్బింగ్ సినిమా అనే ఫీల్ రానివ్వకుండా కథనంలో మన తెలుగు మీమ్స్, ట్రెండ్స్ బాగా వాడారు. అనిల్ రావిపూడి రిఫరెన్సులు, జయ జానకి నాయక టైప్ హైపర్ ఎలివేషన్ డైలాగ్స్, క్యాష్ అనుదీప్ మార్క్ కామెడీ ట్రాక్స్.. తెలుగు ఆడియన్స్‌కు పిచ్చ పిచ్చగా కనెక్ట్ అవుతాయి.

ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ అయితే ఒక కమర్షియల్ హై ఇస్తుంది. ఇక ఇంటర్వెల్ తర్వాత కథనం టోన్ కంప్లీట్‌గా మారుతుంది. డైరెక్టర్ ఇక్కడే అసలు సిసలైన ఎమోషన్స్‌ను ప్లే చేశాడు. సెకండాఫ్ అంతా మిడిల్ క్లాస్ అబ్బాయిల స్ట్రగుల్స్, కెరీర్ టెన్షన్స్, పేరెంట్స్ పడే వేదన చుట్టూ తిరుగుతుంది. స్నేహితులంతా విదేశాలకు వెళ్లిన తర్వాత అక్కడ పడే ఇబ్బందులను ఒకవైపు నవ్విస్తూనే, మరోవైపు మనసును పిండేసేలా చూపించారు. అయితే ఇది ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ జానర్ కావడంతో, లైఫ్‌లోని సీరియస్ ప్రాబ్లమ్స్ డీల్ చేసేటప్పుడు కథనం కొద్దిగా స్లో అయినట్లు అనిపిస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్స్‌పెక్ట్ చేసేవాళ్ళకు ఈ స్లో నేరేషన్ కాస్త ల్యాగ్ అనిపించొచ్చు. క్లైమాక్స్‌కు వచ్చేసరికి ఒక ఎమోషనల్ పీక్‌కు చేరుకుంటుంది. తోబుట్టువుల మధ్య ఉండే రిలేషన్, ఫ్యామిలీ బాండింగ్ చుట్టూ సాగే పతాక సన్నివేశాలు కచ్చితంగా ప్రతి ఆడియన్‌తో కంటతడి పెట్టిస్తాయి. ఫస్టాఫ్‌లో నవ్వించి, సెకండాఫ్‌లో ఏడిపించి, ఓవరాల్‌గా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక బరువైన, మంచి అనుభూతిని ఇచ్చేలా స్క్రీన్‌ప్లేను బాగా డిజైన్ చేశారు.

నటీనటులు:

ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్ ఈ నలుగురు కుర్రాళ్లే. హాషిర్, అలెన్, అజిన్, వినాయక్ పాత్రల్లో నటించిన వాళ్లంతా మలయాళంలో సోషల్ మీడియా స్టార్లు. వాళ్లకు ఇది నిజజీవితానికి దగ్గరగా ఉండే క్యారెక్టర్స్ కావడంతో కెమెరా ముందు యాక్ట్ చేసినట్లు అస్సలు అనిపించదు, క్యారెక్టర్లలో పరకాయ ప్రవేశం చేశారు. వాళ్ల మధ్య ఆన్-స్క్రీన్ కెమెస్ట్రీ, కామెడీ టైమింగ్ సినిమాకు హైలైట్. ఇక గెస్ట్ రోల్‌లో పోలీస్ ఆఫీసర్‌గా ఎంట్రీ ఇచ్చిన టాలెంటెడ్ డైరెక్టర్ ఆల్ఫోన్స్ పుత్రెన్ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అదరగొట్టాడు. మిగిలిన వాళ్ళందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు..

టెక్నికల్ టీం:

ఏ టీమ్ (అంకిత్ మీనన్) అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం. సీన్‌లోని మూడ్‌ను పర్ఫెక్ట్‌గా ఎలివేట్ చేసింది. అఖిల్ లైలాసురన్ విజువల్స్ చాలా ఫ్రెష్‌గా, కేరళ బ్యూటీని రియలిస్టిక్‌గా చూపించాయి. కన్నన్ మోహన్ ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్‌గా ఉంటే బాగుండేది. రెండు గంటల 42 నిమిషాల సినిమా అంటే కాస్త నిడివి ఎక్కువైనట్టు అనిపించింది. తెలుగులో ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. డబ్బింగ్ క్వాలిటీ, లోకలైజేషన్ చాలా నీట్‌గా ఉన్నాయి. విపిన్ దాస్ రైటింగ్ చాలా షార్ప్ అండ్ రిలేటబుల్. దర్శకుడు సావిన్ ఎస్.ఏ తన ఫస్ట్ సినిమా అయినా కూడా, యూత్ పల్స్ పట్టుకొని ఎక్కడా డీవియేట్ అవ్వకుండా సినిమాను ప్రెజెంట్ చేశాడు.

పంచ్ లైన్:

ఓవరాల్ గా వాలా 2.. సగటు మిడిల్ క్లాస్ కుర్రాడి బయోపిక్..!

Follow Us