
మూవీ రివ్యూ: కిల్లర్
నటీనటులు: జ్యోతి పూర్వజ్ అలియాస్ జ్యోతి రాయ్, సుక్కు పూర్వజ్, మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, టెలివిజన్ నటి అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్, దశరథ తదితరులు
సినిమాటోగ్రఫి: జగదీష్ బొమ్మిశెట్టి
సంగీతం: ఆశీర్వాద్, సుమన్ జీవా
ఎడిటర్: సుకు పూర్వజ్
దర్శకత్వం: సుక్కు పూర్వాజ్
నిర్మాతలు: పూర్వాజ్, ప్యాడీ, ఎ పద్మనాభరెడ్డి
సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న జ్యోతి పూర్వజ్ కీలక పాత్రలో సుక్కు పూర్వాజ్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ డ్రామా కిల్లర్. ఏలియన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సై ఫై థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతమేర మెప్పించిందో పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
రక్ష రాయ్ (జ్యోతి పూర్వజ్) అనే ఓ సామాన్య అమ్మాయిని కొందరు దుండగులు తీవ్రంగా గాయపరుస్తారు. దాంతో ఆమె స్పృహ కోల్పోయి రోడ్డుపై పడిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తమ్ముడు కార్తీక్ (చంద్రకాంత్) ఆమెను వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకెళ్తాడు. ఈ దాడి వెనుక ఉన్న నేరస్తులను పట్టుకునే బాధ్యతను ఓ పోలీస్ అధికారి (సుక్కు పూర్వజ్) తీసుకుంటాడు. అనుమానితులను విచారించేటప్పుడు వాళ్లు రక్ష గురించి ఒక్కొక్కరు ఒక్కో కొత్త విషయం చెబుతారు. కొందరు ఆమెను తీవ్రవాది అంటే, మరికొందరు గూఢచారి అంటారు. ఇంకొందరు సినిమా తార అని, వ్యాంపైర్ అని రకరకాల పేర్లు చెబుతారు. ఈ గందరగోళం మధ్యలో ఓ శాస్త్రవేత్త ఆమె బుర్రలో ఒక కృత్రిమ చిప్ అమర్చాలని చూస్తాడు. అసలు రక్ష గతం ఏంటి? ఆమెపై ఎందుకు దాడి జరిగింది? ఆమె కోలుకొని తనను గాయపరిచిన వారిపై ఎలా పగ తీర్చుకుంది? ఏఐ కమాండర్ పాత్ర ఏంటి? అన్నదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం.
కథనం:
ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల్లోపే కావడంతో దర్శకుడు కథలోకి వెళ్లడానికి ఎక్కువ టైమ్ తీసుకోలేదు.. ఎక్కడా సాగదీయకుండా నేరుగా అసలు పాయింట్‌తోనే మొదలుపెట్టాడు. అయితే ఇది మామూలు కమర్షియల్ చిత్రం కాదు. కాస్త ఆలోచించాల్సిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. సినిమా మొదలైనప్పటి నుంచి ఎన్నో ఊహించని మలుపులు, టెక్నాలజీకి సంబంధించిన విషయాలు తెరపై కనిపిస్తాయి. రక్ష పాత్రను నాలుగు విభిన్న కోణాల్లో చూపిస్తూ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. స్క్రిప్ట్ విషయంలో ఎక్కడా లాజిక్స్ మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే మొదటి భాగంలో పోలీస్ అధికారి పాత్ర కాస్త అతిగా ప్రవర్తించినట్లు అనిపిస్తుంది. దానివల్ల కథనం కాస్త నెమ్మదించిన భావన కలుగుతుంది. ఆ పాత్రను కాస్త తగ్గించి ఉంటే సినిమా ఇంకాస్త వేగంగా సాగేది. ఇన్ని చిక్కుముడులతో, ఎన్నో ప్రశ్నలతో తొలి సగం ముగుస్తుంది.
ఇక రెండవ భాగంలోకి వచ్చేసరికి మొదటి భాగంలో ఉన్న ప్రశ్నలన్నింటికీ ఒక్కొక్కటిగా సమాధానాలు దొరుకుతాయి. హీరోయిన్ గతాన్ని వివరించే సన్నివేశాలు కథపై పూర్తి పట్టును ఇస్తాయి. అప్పటి నుంచి ప్రేక్షకులకు సినిమా ఎటు వెళ్తుందో ఒక స్పష్టత వస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే రెండు ముఖ్యమైన మలుపులు ఈ చిత్రానికి ప్రాణం పోశాయి. సాంకేతికతను వాడుకున్న తీరు, విజువల్ ఎఫెక్ట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఏదో రొటీన్ సినిమా తీశామని కాకుండా, ఓ కొత్త ప్రయోగం చేశామన్న దర్శకుడి తపన తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి భాగం కాస్త గందరగోళంగా అనిపించినా, ద్వితీయార్థం మాత్రం బాగానే ఉంది. ఓవరాల్‌గా డిఫెరెంట్ సినిమా చూడాలనుకునే వాళ్లకు కిల్లర్ మంచి ఛాయిస్.
నటీనటులు:
ఈ చిత్రంలో జ్యోతి పూర్వజ్ నటన చాలా బాగుంది.. ఓవైపు గ్లామర్, మరోవైపు నటిగా సత్తా చూపించింది. ఆమె పోషించిన విభిన్న పాత్రలకు పూర్తి న్యాయం చేసింది. ఒక్కో క్యారెక్టర్‌కు చూపించిన వేరియేషన్స్ బాగా పండాయి. తమ్ముడి పాత్రలో నటించిన చంద్రకాంత్‌కు మంచి పాత్రే పడింది. భావోద్వేగ సన్నివేశాలతో పాటు ఫైట్స్ కూడా అదరగొట్టాడు. దర్శకుడు పూర్వజ్ రెండు పాత్రల్లో కనిపించాడు. అందులో సైంటిస్ట్ పాత్రలో చాలా సెటిల్డ్‌గా నటించి మెప్పించినా, పోలీస్ పాత్రలో మాత్రం కాస్త శృతి మించినట్లు అనిపించింది. ఇక మనీష్, అర్చన తదితరులు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.
టెక్నికల్ టీం:
సాంకేతికంగా ఈ చిత్రం పర్లేదు. తక్కువ బడ్జెట్‌తో తీసినా తెరపై మాత్రం బాగానే అనిపిస్తుంది. ముఖ్యంగా ఆశీర్వాద్, సుమన్ జీవా సంగీతం సినిమా మూడ్‌ను సెట్ చేస్తుంది. కెమెరామెన్ పనితనం, నేపథ్య సంగీతం, సెట్స్ అన్నీ ఓకే అనిపిస్తాయి. ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది, కానీ కొన్ని చోట్ల అనవసరమైన సన్నివేశాలను కత్తిరించి ఉంటే సినిమా ఇంకాస్త సాఫీగా సాగేది. నిర్మాణ విలువలు ఎక్కడా రాజీ పడకుండా చాలా బాగున్నాయి.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా కిల్లర్.. డిఫెరెంట్ సైన్స్ ఫిక్షన్ డ్రామా..!