చిరంజీవి, టబుతో సింగీతం శ్రీనివాస రావు సినిమా.. మధ్యలోనే ఆగిపోయిన మూవీ.. కానీ పాటలు రిలీజ్ చేసిన మేకర్స్..

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో అధ్యాయం ముగిసింది. గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అయితే ఆయన మరణంతో చిరంజీవి చేయాల్సిన భూలోకవీరుడు సినిమా ఇప్పుడు వార్తలలో నిలించింది. నిజానికి ఈ మూవీ గురించి చాలా మందికి తెలియదు.

చిరంజీవి, టబుతో సింగీతం శ్రీనివాస రావు సినిమా.. మధ్యలోనే ఆగిపోయిన మూవీ.. కానీ పాటలు రిలీజ్ చేసిన మేకర్స్..
Bhuloka Veerudu Movie

Updated on: Oct 05, 2026 | 11:20 AM

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రయోగాలకు చిరునామాగా నిలిచిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన మృతి సినీలోకానికి తీరని లోటు. దాదాపు 95 ఏళ్ల వయసులోనూ సింగ్ గీతం పేరుతో సినిమాను తెరకెక్కించి సినిమా పట్ల తనకున్న అభిరుచిని చాటుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన కెరీర్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు మళ్లీ వార్తల్లోకి వచ్చాయి. అందులో ప్రధానంగా మెగాస్టార్ చిరంజీవితో ఆయన చేయాల్సిన ‘భూలోకవీరుడు’ ప్రాజెక్ట్ ఒకటి. అప్పట్లోనే ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ భారీ సోషియో ఫాంటసీ చిత్రం రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయ్యాక అనూహ్యంగా ఆగిపోయింది. 1996 ప్రాంతంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రసిద్ధ నిర్మాత సి. అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. అప్పటికే ‘ఆదిత్య 369’, ‘భైరవద్వీపం’ చిత్రాలతో సైన్స్ ఫిక్షన్, జానపద జోనర్లలో అద్భుతాలు సృష్టించిన సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు.

ఇందులో చిరంజీవి సరసన కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ టబును ఎంపిక చేశారు. సత్యానంద్ ఫాంటసీ కథను సిద్ధం చేయగా, ఇళయరాజాని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. చిరు – టబుల కాంబినేషన్‌లో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు అప్పట్లో భారీ అంచనాలను పెంచేశాయి. భారీ బడ్జెట్‌తో గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ రెండు షెడ్యూళ్ల పాటు వేగంగా జరిగింది. ప్రధాన తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఇళయరాజా స్వరపరిచిన రెండు పాటలను కూడా చిత్రీకరించారు. అయితే, కథా విస్తరణలో పూర్తిస్థాయి బలం కనిపించకపోవడం, గ్రాఫిక్స్-విజువల్ ఎఫెక్ట్స్ పరంగా అనుకున్న స్థాయి రాకపోవడం , బడ్జెట్ అంచనాలు పెరిగిపోవడంతో మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లలేకపోయారు. దీంతో చిరంజీవి, సింగీతం కాంబోలో రావలసిన ఈ మూవీ మధ్యలోనే నిలిచిపోయింది.

సినిమా నిలిచిపోయినా, ‘భూలోకవీరుడు’ కోసం ఇళయరాజా స్వరపరిచిన ఆ రెండు పాటలు వృథా పోలేదు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో చిరంజీవితో అశ్వినీ దత్ ప్రారంభించిన మరో ప్రాజెక్ట్ కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఆ సినిమా కోసం మణిశర్మ రికార్డ్ చేసిన పాటలను, ‘భూలోకవీరుడు’లోని ఇళయరాజా పాటలను కలిపి వైజయంతీ మూవీస్ ‘వినాలని ఉంది’ పేరుతో ఒక ప్రత్యేక ఆడియో క్యాసెట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. అనంతరం వైజయంతీ మూవీస్ నిర్మించిన ‘చూడాలని ఉంది’ చిత్రం థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ ప్రత్యేక పాటలను రీల్స్‌కు జత చేసి థియేటర్లలో ప్రదర్శించారు. ఈ సాంగ్స్ ప్రస్తుతం యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ‘భూలోకవీరుడు’ పూర్తయి ఉంటే, తెలుగు చిత్రసీమలో మరొక క్లాసిక్ సోషియో ఫాంటసీగా నిలిచిపోయేదని సినీ విశ్లేషకులు భావిస్తుంటారు.

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : షాలిని సేఫ్.. సృష్టి ఎలిమినేషన్.. స్టార్ ప్లేయర్‌గా ఝాన్సీ.. అన్న కోసం చెల్లెలి ఆర్డర్..

అశ్వినీదత్ పోస్ట్..

ఎక్కువమంది చదివినవి :  మాయాబజార్ సినిమాలో వాడని పాట.. మనవరాలితో కలిసి అద్భుతంగా పాడిన సింగీతం శ్రీనివాసరావు.. వీడియో ఇదిగో..

Loading...
Unable to load recommendations.
Follow Us