‘దంగల్’ తర్వాత జైరా వసీం మరోసారి అమీర్ ఖాన్ నిర్మాణంలో రూపొందిన ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ చిత్రంలో నటించింది. 2017లో విడుదలైన ఈ సినిమాలో ఇన్సియా అనే యువ గాయని పాత్రలో కనిపించింది. తన కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నించే అమ్మాయిగా ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో జైరా పేరు మరింతగా మారుమోగింది. వరుసగా విజయవంతమైన చిత్రాల్లో నటిస్తుండటంతో ఆమె బాలీవుడ్లో ఎక్కువ కాలం కొనసాగుతుందని చాలామంది భావించారు. సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జైరా వసీం 2019లో అనూహ్య నిర్ణయం తీసుకుంది. తన మత విశ్వాసాలకు, వ్యక్తిగత నమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తూ నటనకు దూరమవుతున్నట్లు ప్రకటించింది. సినిమా పరిశ్రమ తన మత విశ్వాసాలకు అనుగుణంగా జీవించడంలో ఇబ్బందులు కలిగిస్తోందని ఆమె తన ప్రకటనలో పేర్కొంది. ఈ నిర్ణయం అభిమానులతో పాటు సినీ పరిశ్రమను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పటికే ఆమెకు మంచి అవకాశాలు వస్తుండటం, నటిగా గుర్తింపు పెరుగుతుండటంతో ఈ ప్రకటన పెద్ద చర్చకు దారితీసింది.