Ramayana Movie: బాక్సాఫీస్ వద్ద రణబీర్ రామాయణం జోరు.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో రూ.7 కోట్లకు పైగా వసూళ్లు!

నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణం’ చిత్రంపై విడుదలకు ముందే భారీ ఆసక్తి కనిపిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇండియాలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా బ్లాక్ చేసిన సీట్లతో కలిపి రూ.7.24 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దేశవ్యాప్తంగా సుమారు 3,707 షోల ద్వారా 1.28 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి.

Ramayana Movie: బాక్సాఫీస్ వద్ద రణబీర్ రామాయణం జోరు.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో రూ.7 కోట్లకు పైగా వసూళ్లు!
Ramayana

Updated on: Oct 23, 2026 | 10:25 AM

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో, దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారతీయ ఇతిహాసం ఆధారంగా రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్‌లో మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజా అడ్వాన్స్ బుకింగ్స్ వసూళ్లు రూ.7 కోట్ల మార్కును దాటగా, ఓవర్సీస్ ప్రీ-సేల్స్ కూడా 1.10 మిలియన్ డాలర్లను అందుకుందని తెలుస్తుంది. బ్లాక్ చేసిన సీట్లను మినహాయిస్తే అడ్వాన్స్ బుకింగ్స్ వసూళ్లు రూ.5.31 కోట్లుగా నమోదయ్యాయని తెలుస్తుంది. భాషల వారీగా చూస్తే హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో టాప్ లో ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, హిందీ వెర్షన్ ద్వారా రూ.6.63 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. కన్నడ వెర్షన్‌కు రూ.42.06 లక్షలు, తెలుగు వెర్షన్‌కు రూ.17.29 లక్షల అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం హిందీ మార్కెట్ ఈ సినిమా ప్రీ-సేల్స్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే, రామాయణం కథకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా తెలుగు, కన్నడతో పాటు ఇతర భాషల్లోనూ ప్రేక్షకుల నుంచి స్పందన వచ్చే అవకాశం ఉంది. సినిమా విడుదలకు దగ్గరయ్యే కొద్దీ ప్రాంతీయ మార్కెట్లలో బుకింగ్స్ ఎలా పెరుగుతాయనేది ఆసక్తికరంగా మారింది. భారీ విజువల్స్, అత్యాధునిక సాంకేతికతతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పెద్ద తెరపై వీక్షించేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నట్లు అడ్వాన్స్ బుకింగ్స్ రిపోర్ట్స్ సూచిస్తున్నాయి. నివేదిక ప్రకారం, ఐమాక్స్ 3D షోల ద్వారా రూ.1.70 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. 117 షోలలో 15,537 టికెట్లు అమ్ముడయ్యాయి. డాల్బీ  సినిమా ద్వారా రూ.22.74 లక్షలు, 4డి ఎక్స్ 3D షోల ద్వారా రూ.22.38 లక్షల వసూళ్లు వచ్చినట్లు సమాచారం. ఈ మూడు ప్రీమియం ఫార్మాట్లను కలిపి చూస్తే సుమారు రూ.2.20 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి. సాధారణ 3డి షోల ద్వారా రూ.4.80 కోట్ల వసూళ్లు వచ్చినట్లు తెలుస్తుంది.

దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాల్లోనూ ‘రామాయణం’కు మంచి స్పందన లభిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అన్ని షో తేదీలకు కలిపి ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ 1.10 మిలియన్ డాలర్లను దాటాయి. విడుదల రోజుకు సంబంధించిన ప్రీ-సేల్స్ 6 లక్షల డాలర్లకు మించినట్లు సమాచారం. ముఖ్యంగా ఉత్తర అమెరికా మార్కెట్ నుంచి గణనీయమైన వసూళ్లు వస్తున్నాయి. అక్కడ సుమారు 4.75 లక్షల డాలర్ల అడ్వాన్స్ బుకింగ్స్ నమోదవగా, ఇందులో ప్రీమియర్ షోల వాటా సుమారు 3.50 లక్షల డాలర్లుగా ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.  కాగా నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణం’ను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తొలి భాగం నవంబర్ 5, 2026న థియేటర్లలో విడుదల కానుంది. రెండో భాగాన్ని 2027 దీపావళి సందర్భంగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us