Actor Jayaprakash Reddy: ఆ ఒక్క సినిమాతో నా అప్పులన్నీ తీరిపోయాయి.. ఆయన తిట్టి మరీ అవకాశం ఇచ్చారు..

తెలుగులో అనేక హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు జయప్రకాష్ రెడ్డి. అయితే ఒకానొక సమయంలో ఆర్థిక ఇబ్బందులతో పరిశ్రమకు దూరమైన ఆయనకు టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ తో అనుకోకుండా జరిగిన భేటీ తన జీవితాన్ని మార్చిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఆ ఒక్క సినిమాతో అప్పులన్నీ తీర్చుకున్నట్లు తెలిపారు.

Actor Jayaprakash Reddy: ఆ ఒక్క సినిమాతో నా అప్పులన్నీ తీరిపోయాయి.. ఆయన తిట్టి మరీ అవకాశం ఇచ్చారు..
Jayaprakash Reddy

Updated on: Nov 16, 2026 | 8:42 PM

సినీ పరిశ్రమలో అనేక పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుడు జయప్రకాష్ రెడ్డి, తన కెరీర్‌లో అత్యంత కీలకమైన మలుపును, దాని వెనుక ఉన్న దిగ్గజ నిర్మాత డి. రామానాయుడు పాత్రను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సినీ రంగంలోకి ప్రవేశించిన తొలినాళ్లలో సుమారు 15-20 సినిమాలు చేసినా ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో నిరాశకు గురైనట్లు ఆయన తెలిపారు. తన సర్వీస్‌లో తొమ్మిదేళ్లపాటు లాస్ ఆఫ్ పే లీవు తీసుకొని, జీతం లేకుండానే తన భార్యాబిడ్డలను పోషించాల్సి వచ్చిందని, ఈ క్రమంలో ఎంతో మంది దగ్గర అప్పులు చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు తీర్చడం కోసం, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం జయప్రకాష్ రెడ్డి ఐదు సంవత్సరాల పాటు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిదిన్నర వరకు ట్యూషన్లు చెప్పి, పది నుండి సాయంత్రం ఐదు వరకు స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేసి, తిరిగి సాయంత్రం ఐదున్నర నుండి రాత్రి తొమ్మిదిన్నర వరకు మళ్ళీ ట్యూషన్లు చెబుతూ ఎంతో కష్టపడ్డారట. ఈ కఠినమైన రోజుల్లో రామానాయుడు గారు, సురేష్ ప్రొడక్షన్స్ నుండి మూడుసార్లు ఫోన్‌లు వచ్చినా, మళ్ళీ పరిశ్రమలోకి వెళ్ళి ఇబ్బందులు పడకూడదని ఉద్దేశంతో ఆయన వాటిని పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో సుమారు 40-45 శాతం అప్పులను తీర్చగలిగినట్లు తెలిపారు.

ఆ ఐదు సంవత్సరాల చివరలో, ఒకానొక రోజు తన స్నేహితుడితో కలిసి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి ఫుల్ బాడీ చెకప్ కోసం వెళ్లినప్పుడు, ఊహించని సంఘటన జరిగింది. ఆసుపత్రిలో ఫారాలు నింపుతుండగా, వెనుక నుండి ఏయ్ జయప్రకాష్ అంటూ రామానాయుడు గారు పిలిచారు. ఆయన్ని చూసి పరుగున వెళ్లిన జయప్రకాష్ రెడ్డి, ఏమైపోయావయ్యా? అంతు లేకుండా పోయావ్, బుద్ధి జ్ఞానం లేదా నీకు? మంచి ఆర్టిస్ట్‌వి అని రామానాయుడు గారు ప్రశ్నించినట్లు చెప్పారు. తన ఆర్థిక కష్టాలను, అప్పులను వివరించగా, రామానాయుడు గారు సరే, వదిలేసేయ్ గానీ, కొత్త పిక్చర్ స్టార్ట్ చేస్తున్నాము. సురేష్ బాబు చూసుకుంటున్నాడు. వెళ్లి ఒకసారి కలు. సాయంత్రం కలు. ఒక క్యారెక్టర్ ఉందయ్యా, చాలా మంచి క్యారెక్టర్ అది. నువ్వేస్తే చాలా బాగుంటుంది అని చెప్పారు. అక్కడ బాడీ చెకప్ కోసం వచ్చానని చెప్పగా, అయిపోయిందా? అయితే వెళ్ళు. నువ్వు ఒక కలవకుండా వెళ్లావంటే ఊరుకోను నేను, చంపేస్తా అని రామానాయుడు గారు సరదాగా హెచ్చరించినట్లు జయప్రకాష్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.

అలా రామానాయుడు గారి మాటతో సురేష్ గెస్ట్ హౌస్‌కి వెళ్లగా, మరుసటి రోజు రామానాయుడు స్టూడియోలో ఫోటో సెషన్ ఏర్పాటు చేశారు. సుమారు 50 ఫోటోలు తీసిన తర్వాత మూడో రోజు రాత్రి దర్శకుడు జయంత్ ఫోన్ చేసి, కంగ్రాచులేషన్స్, హీరోయిన్ ఫాదర్, మెయిన్ విలన్ నువ్వు సెలెక్ట్ అయ్యావు అని చెప్పినప్పుడు షాకయ్యానని జయప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. అది ప్రేమించుకుందాం రా చిత్రం. ఈ చిత్రం ద్వారా ఆయనకు రెండవ ఇన్నింగ్స్ లభించింది. విలన్ పాత్రకు అవుట్ అండ్ అవుట్ సీరియస్‌నెస్ కావాలని దర్శకుడు కోరగా, సురేష్ బాబు గారు ఏదైనా మ్యానరిజం పెట్టుకోమని సూచించారు. అయితే, ఫ్యాక్షనిస్ట్ సబ్జెక్ట్ కాబట్టి రాయలసీమ యాసను ప్రయత్నిస్తే బాగుంటుందని జయప్రకాష్ రెడ్డికి తట్టింది. పరచూరి వెంకటేశ్వర రావు వంటి వారు కూడా దీనికి మద్దతు తెలిపారు.

రాయలసీమ యాసను పూర్తిగా నేర్చుకోవడం కోసం ప్రొడ్యూసర్‌తో కలిసి పది రోజుల పాటు కర్నూలు జిల్లా నంద్యాలలో బస చేసి, స్థానికులతో మాట్లాడి, టేప్ రికార్డర్‌తో వారి యాసను రికార్డు చేసుకుని, పదజాలాన్ని సేకరించారు. చిన్నతనం నుంచే కడప, అనంతపురం వంటి ప్రాంతాల్లో పెరిగిన అనుభవం, కాలేజీ నాటకాల్లో యాసను ఉపయోగించిన అనుభవం తనకు కలిసివచ్చాయని జయప్రకాష్ రెడ్డి తెలిపారు. టీచర్‌గా పని చేసిన అనుభవం ఈ నోట్స్ తయారీలో, యాసను మెరుగుపరచడంలో సహాయపడిందని ఆయన పేర్కొన్నారు. ఈ మలుపుకు రెండేళ్ళ ముందు నుండే తాను శివ దీక్ష చేసి ప్రతి సంవత్సరం శ్రీశైలం వెళ్లి వచ్చేవాడినని, శివయ్య దయ వల్లే ఈ అవకాశం లభించిందని జయప్రకాష్ రెడ్డి భావిస్తారు. ప్రేమించుకుందాం రా చిత్రం ఆయన సినీ ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచి, ఆయనను ఒక సుప్రసిద్ధ నటుడిగా నిలబెట్టింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : నన్ను అహాంకారి అనుకున్నారు.. 1500 సినిమాలు చేసినా ఏమీ మిగల్లేదు.. సీనియర్ నటుడు..

 

Loading...
Unable to load recommendations.
Follow Us