Tollywood : స్టార్ హీరోల కంటే ఎక్కువ పారితోషికం.. ఇండస్ట్రీలోనే తిరుగులేని హీరోయిన్.. కళ్ల ముందే కొడుకు మరణంతో..

కష్టాలను, సవాళ్లను దాటుకుని విజయ తీరాలకు చేరిన కళాభినేత్రి వాణిశ్రీ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. హాస్య పాత్రల నుండి హీరోయిన్‌గా ఎదిగి, దశాబ్ద కాలం తెలుగు చిత్ర పరిశ్రమను ఏలిన ఆమె ప్రయాణం అద్వితీయం. ఆమె సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవిత విశేషాలను తెలుసుకుందాం.

Tollywood : స్టార్ హీరోల కంటే ఎక్కువ పారితోషికం.. ఇండస్ట్రీలోనే తిరుగులేని హీరోయిన్.. కళ్ల ముందే కొడుకు మరణంతో..
Vanisri

Updated on: Sep 17, 2026 | 12:13 PM

తెలుగు సినిమా ప్రపంచంలో ఒకప్పుడు తిరుగులేని హీరోయిన్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు వాణి శ్రీ. కష్టాలు, సవాళ్లు దాటి విజయ తీరాలకు చేరుకోవడం అంత సులభమైన విషయం కాదు. సాధించాలన్న పట్టుదల, సంకల్పబలం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని సినీ రంగంలో అద్భుతంగా నిరూపించిన కళాభినేత్రి వాణిశ్రీ. వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి. 1948 ఆగస్టు 3న నెల్లూరులో రాఘవయ్య నాయుడు, వెంకమ్మ దంపతులకు జన్మించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో, తల్లి వెంకమ్మ ఇద్దరు ఆడపిల్లలతో మద్రాసుకు చేరారు. అక్కడ ఆంధ్రా మహిళా సభలో మెట్రిక్యులేషన్ పూర్తిచేసిన రత్నకుమారి, నృత్యం, సంగీతం, చిత్రలేఖనం కూడా నేర్చుకున్నారు. అనంతరం భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించారు. ఈ సమయంలోనే ఆమెకు నటన పట్ల ఆసక్తి పెరిగింది. రత్నకుమారి మొదటగా “రక్తకన్నీరు” నాటకంలో నటించారు. నటుడు నాగభూషణంకు చెందిన రవి ఆర్ట్ థియేటర్స్‌లో సభ్యురాలిగా చేరి, నటి సీత వద్ద నటనలో ఓనమాలు నేర్చుకున్నారు. “దొంగ”, “రాగరాగిణి” వంటి నాటకాలలో నటించిన ఆమెకు, “చిల్లరకొట్టు చిట్టెమ్మ” నాటకం జీవితంలో కీలక మలుపు. మద్రాస్‌లోని ఆంధ్రా క్లబ్‌లో జరిగిన ఈ నాటక ప్రదర్శనకు చిత్తూరు నాగయ్య, కన్నడ దర్శకుడు హున్సూర్ కృష్ణమూర్తి హాజరయ్యారు. చిట్టెమ్మగా రత్నకుమారి నటనకు ఆకట్టుకున్న కృష్ణమూర్తి, తన కన్నడ చిత్రం “వీర సంకల్ప”లో ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అలా 1979లో పెళ్లి చేసుకునేంత వరకు ఆమె సినీ జీవితం అప్రతిహతంగా సాగింది.

“వీర సంకల్ప” షూటింగ్‌ సమయంలోనే నిర్మాత ఎస్. భావనారాయణ తన “బంగారు తిమ్మరాజు” చిత్రంలో హాస్య పాత్రకు, దర్శకుడు విఠలాచార్య “నవగ్రహ పూజా మహిమ” చిత్రంలో చిన్న పాత్రకు రత్నకుమారిని ఎంపిక చేశారు. కన్నడ చిత్రాల్లో రత్నకుమారిగా, తెలుగులో వాణిశ్రీగా ఆమెకు గుర్తింపు లభించింది. “నాది ఆడజన్మే” చిత్రంలో నటిస్తున్నప్పుడు మహానటుడు ఎస్వీ రంగారావు ఆమె పేరుని వాణిశ్రీగా మార్చారు. తొలుత తెలుగులో హాస్య, సహాయ పాత్రలకే పరిమితమైన వాణిశ్రీ, కన్నడలో రాజ్ కుమార్, తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేషన్ వంటి అగ్ర హీరోలతో నాయికగా నటించారు. “ఉమ్మడి కుటుంబం” చిత్రంలోని “సతీ సావిత్రి” అంతర నాటకంలో ఎన్టీఆర్ యముడిగా, వాణిశ్రీ సావిత్రిగా నటించి మెప్పించారు.

హాస్య పాత్రలకే పరిమితం కాకుండా కథానాయికగా ఎదగాలనే తపనతో వాణిశ్రీ ఎంతో కృషి చేశారు. తన సీనియర్ల నుండి నేర్చుకుంటూ, నిజ జీవితంలోని మనుషులను పరిశీలిస్తూ నటనకు మెరుగులు దిద్దుకున్నారు. దర్శకుడు బి.ఎన్.రెడ్డి తన “బంగారు పంజరం” చిత్రంలో శోభన్ బాబు సరసన వాణిశ్రీకి హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. అయితే ఈ చిత్రం ఆలస్యం కావడంతో, వచ్చిన ప్రతి చిన్న పాత్రనూ స్వీకరించారు. ఆమె కృషికి “సుఖదుఃఖాలు” చిత్రం, ముఖ్యంగా “ఇది మల్లెల వేళయనీ” పాట మంచి గుర్తింపును తెచ్చాయి. “మరపురాని కథ” చిత్రంలో కృష్ణ సరసన తొలిసారిగా పూర్తి స్థాయి హీరోయిన్‌గా నటించారు. “ఆత్మీయులు” చిత్రంతో అక్కినేని సరసన నటించి పెద్ద విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ సరసన “నిండు హృదయాలు” చిత్రంలో నటించి అగ్రతారగా నిలిచారు.

1970వ దశకం వాణిశ్రీ శకంగా మారింది. కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి హీరోలతో ఆమె అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. “ఇద్దరు అమ్మాయిలు” చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి స్టార్ హోదాను పొందారు. “దసరా బుల్లోడు”, “ప్రేమ్ నగర్”, “దేశోద్ధారకులు”, “బంగారు బాబు” వంటి చిత్రాలతో తిరుగులేని నాయికగా ఎదిగారు. వ్యాపార చిత్రాలతో పాటు శ్యామ్ బెనెగల్ “అనుగ్రహం”, బాపు “గోరంత దీపం” వంటి కళాత్మక చిత్రాల్లోనూ నటించి, తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. హిందీలో అవకాశాలు వచ్చినా, డేట్స్ కుదరక చేయలేకపోయారు.

16 ఏళ్ల సినీ ప్రస్థానం తర్వాత, నటన తనకు చిత్రహింసగా అనిపించడంతో 1979 ఫిబ్రవరి 28న డాక్టర్ కరుణాకరన్‌ను వివాహం చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. వారికి అనుపమ, అభినయ వెంకటేష్ కార్తీక్ అనే ఇద్దరు పిల్లలు. అయితే, కొడుకు అభినయ వెంకటేష్ కార్తీక్ ఆత్మహత్య చేసుకోవడం, కుమార్తె అనుపమ పెళ్లి చేసుకోకుండా ఉండటం ఆమె జీవితంలో తీరని విషాదాలను మిగిల్చాయి. ఆ తర్వాత చిరంజీవి నటించిన “అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు” చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. బాలకృష్ణ, నాగార్జున వంటి మూడో తరం హీరోల చిత్రాల్లో అత్త పాత్రలు పోషించారు. ప్రస్తుతం చెన్నైలో విశ్రాంత జీవితం గడుపుతున్నారు కళాభినేత్రి వాణిశ్రీ.

సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us