Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Elections 2022: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో హిందుత్వ అంశానికే పెద్ద పీట వేస్తున్న బీజేపీ

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనుకున్నంత సులువు కాదన్న సంగతి భారతీయ జనతా పార్టీకి అర్థమైనట్టుగా ఉంది. ఇప్పటి వరకు జరిగిన...

UP Elections 2022: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో హిందుత్వ అంశానికే పెద్ద పీట వేస్తున్న బీజేపీ
Bjp
Follow us
Balu

| Edited By: Anil kumar poka

Updated on: Feb 28, 2022 | 2:18 PM

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనుకున్నంత సులువు కాదన్న సంగతి భారతీయ జనతా పార్టీకి అర్థమైనట్టుగా ఉంది. ఇప్పటి వరకు జరిగిన అయిదు విడతల పోలింగ్‌లో మూడింటిలో అయితే సమాజ్‌వాదీ పార్టీ ఆధిక్యంలో ఉందన్న వార్తలు వచ్చాయి. మిగతా రెండు విడతల పోలింగ్‌లో కూడా బీజేపీకి ఓట్లన్నీ గంపగుత్తగా ఏమీ పడలేదు.. అక్కడా హోరాహోరీగానే పోరు సాగింది. మొత్తం మీద విజయం కోసం బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది.. ఉత్తరప్రదేశ్‌లో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం కష్టమన్న రాజకీయ విశ్లేషకుల వాదన తప్పని రుజువు చేయాలనుకుంటోంది బీజేపీ. అధికారంలోకి మళ్లీ రావాలనే గట్టి సంకల్పంతో బీజేపీ ఉంది. ఇప్పటి వరకు యూపీ ప్రజలకు బోల్డన్నీ హామీలు ఇచ్చింది.. మేనిఫెస్టోను కూడా జనరంజకంగా రూపొందించింది. అయిదేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన గొప్ప పనులను ఏకరవు పెట్టుకుంది. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో కూడా చెప్పుకుంటోంది. ఇప్పుడు ఇంకాస్త ముందుకెళ్లింది. అటకెక్కించిన హిందుత్వను మళ్లీ దుమ్ముదులిపింది. హిందుత్వ అస్త్రాన్ని మరోసారి ప్రయోగించి ఓట్లు దండుకోవాలనుకుంటోంది. సమాజ్‌వాదీ పార్టీని హిందువుల వ్యతిరేక పార్టీగా చెబుతూ వస్తోంది. ఎన్నికల ప్రచారంలో మతపరమైన అంశాలకే పెద్ద పీట వేస్తోంది. ఎన్నికలు మొదలు కాకముందు సంక్షేమం, అభివృద్ధి నినాదాలతోనే ఎన్నికలకు వెళతామని చెప్పిన బీజేపీ ఇప్పుడు సడన్‌గా హిందుత్వను భుజానకెత్తుకుంది. అందుకు కారణం లేకపోలేదు. బీసీ సామాజికవర్గాలలో చాలా మంది సమాజ్‌వాదీ పార్టీవైపు మొగ్గు చూపడమే! వారిని తిరిగి తమవైపు తిప్పుకోవాలంటే హిందుత్వ ఒక్కటే మార్గమని బీజేపీ భావించింది. అందుకే హిందుత్వ స్వరాన్ని పెంచారు.

2017 ఎన్నికల్లో యాదవులలో కొందరిని మినహాయిస్తే మిగతా వెనుకబడిన సామాజికవర్గాలు, జాతవేతర దళితులు బీజేపీకి ఓటేశారు. వీరికి తోడు అగ్రవర్ణాలు ఎలాగూ బీజేపీవైపే ఉన్నారు. అందుకే ఆ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించగలిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బీజేపీకి ఎస్పీ కూటమి గట్టి పోటీనిస్తోంది. ఆర్‌ఎల్‌డీ, మహాన్‌దళ్‌, ఎస్‌బీఎస్‌పీ వంటి ఏడు చిన్న పార్టీలతో కలసి ఏర్పడిన కూటమిలో అన్ని సామాజికవర్గాలకు చెందిన నాయకులు ఉన్నారు. పైగా ఎన్నికలకు ముందు స్వామి ప్రసాద్‌ మౌర్య, దారాసింగ్‌ చౌహాన్‌ వంటి కీలక ఓబీసీ నేతలు బీజేపీని వదిలిపెట్టి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు.. ఇది బీజేపీకి ఊహించని దెబ్బ. బీజేపీ పాలనలో తమకు ఎలాంటి ప్రయోజనము కలగలేదన్న భావన వెనుకబడిన వర్గాలకు ఉంది. 2017లో బీజేపీ నుంచి గెలిచిన వారిలో 42 శాతం మంది అగ్రకులాలకు చెందిన వారే ఉన్నారు. ఓబీసీలు పాతికశాతం కంటే తక్కువే ఉన్నారు. పైగా యోగి కేబినెట్‌లో ఎక్కువగా ఉన్నది అగ్రవర్ణాలవారే! వీటికి తోడు కులగణన డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అణచివేస్తోందన్న ఆవేదన కూడా ఓబీసీలలో ఉంది. బీజేపీకి చెందిన ఓబీసీ ఎమ్మెల్యేలు కూడా ఇదే భావనతో ఉన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే బీజేపీ హిందుత్వను ప్రచారం చేస్తోంది.

సమాజ్‌వాదీ పార్టీని డ్యామేజ్‌ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. అందుకోసం ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. 2008 కిందటి అహ్మదాబాద్‌ వరుస పేలుళ్ల కేసులో మొన్న ప్రత్యేక కోర్టు 38 దోషులకు మరణశిక్ష విధించింది. శిక్షపడినవారిలో ఒకరి తండ్రి ఎస్పీ అధినేత అఖిలేశ్‌యాదవ్‌లో కలిసి ఉన్న ఫోటోను బీజేపీ బయటపెట్టింది. అప్పటి నుంచి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ఎస్పీపై అటాక్‌ చేయసాగారు. ఎస్పీ పార్టీ ఉగ్రవాదుల కొమ్ము కాస్తున్నదంటూ, ఉగ్రవాదులకు అండదండలు అందచేస్తున్నదంటూ యోగీ విమర్శించడం మొదలుపెట్టారు. ఉగ్రవాదంతో ఎస్పీ పార్టీకి ముడిపెడుతూ ఆరోపణలు చేస్తోంది బీజేపీ. తద్వారా ముస్లింలకు ఎస్పీ అనుకూలమని పరోక్షంగా చెబుతూ వస్తోంది. ఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు అనుకూలంగా వ్యవహరించిందని యోగీ పదే పదే విమర్శిస్తున్నారు. రంజాన్‌ వంటి పండుగలప్పుడు కరెంటు సరఫరా నిరంతరంగా ఉండేదని, హోలీ, దీపావళి వంటి పండుగలకు మాత్రం కరెంట్‌ కట్‌ ఉండేదని యోగి చెప్పుకొస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్యలో దీపోత్సవం, మధురలో రంగోత్సవం, కాశీలో దేవ దీపావళిని ఘనంగా నిర్వహిస్తున్నామని యోగి అంటున్నారు. తాము వచ్చాకే ఆలయాలకు కొత్త కాంతులు వచ్చాయని చెబుతున్నారు. ముస్లింల స్మశాన వాటికలకే ఎస్పీ అధికంగా నిధులు కేటాయించిందని, ఇప్పుడు ఓట్లను కూడా అక్కడికి వెళ్లి అడుక్కుంటేనే బాగుంటుందని ఎద్దేవా చేస్తున్నారు. కమలం గుర్తుపై పోటీ చేస్తున్న కొందరు కూడా వివాదాస్పదమైన కామెంట్లు చేస్తున్నారు. డుమరియాగంజ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నబీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర సింగ్‌ తాను గెలిస్తే ముస్లింలు తిలకం దిద్దుకునేలా చేస్తాననని అన్నారు. అమేథి నుంచి పోటీ చేస్తున్న మయాంకేశ్వర్‌ సింగ్‌ కూడా ఇంచుమించు ఇలాంటి మాటలే మాట్లాడారు. ముస్లింలందరూ రాధే రాధే అని జపించేలా చేస్తానని, అలా చేయనివారిని పాకిస్తాన్‌కు పంపిస్తానని అన్నారు.