అన్నాడీఎంకెలో దినకరన్ పార్టీ విలీనమయ్యేనా..?

టీటీవీ దినకరన్‌ సారధ్యం లోని అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం పార్టీని అన్నాడీఎంకేలో విలీనం అవుతుందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఇందుకు కేంద్ర అధికారపార్టీ నేతలు పెద్దన్న పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది.

  • Balaraju Goud
  • Publish Date - 7:35 pm, Thu, 2 July 20

తమిళనాడు వ్యాప్తంగా కరోనా వైరస్ ఒకవైపు విస్తరిస్తుంటే, మరోవైపు పార్టీల విలీనంపై వార్తలు కూడా అంతే వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. త్వరలో ఆర్కేనగర్‌ శాసనసభ్యుడు టీటీవీ దినకరన్‌ సారధ్యం లోని అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం పార్టీని అన్నాడీఎంకేలో విలీనం అవుతుందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఇందుకు కేంద్ర అధికారపార్టీ నేతలు పెద్దన్న పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది.

అక్రమార్జన కేసులో అరెస్టయి బెంగళూరు పరపన అగ్రహారం జైలులో ఉన్న శశికళ ఆగస్టు 14న విడుదల కానున్నారు. శశికళ బయటకు వచ్చిన మరుక్షణమే రెండు పార్టీల విలీనం ఖాయమని బీజేపీ వర్గాలు గట్టిగానే చెబుతున్నాయి. వాస్తవానికి శశికళ జైలుశిక్ష వచ్చే యేడాది ఫిబ్రవరి 14నాటితో ముగియనుంది. ఆ లోగా సత్ప్రవర్తన నియమాల కారణంగా ఆమె ముందుగానే విడుదలవుతారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. అయితే, బెంగళూరు జైలు శాఖ ఉన్నతాధికారులు మాత్రం శశికళ ముందుగా విడుదలయ్యే అవకాశమే లేదని స్పష్టం చేస్తున్నారు.

కాగా, అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి దినకరన్‌ వర్గానికి గతంలో అనర్హత వేటుపడిన 18 మంది మాజీ శాసనసభ్యులు అండగా నిలిచారు. ప్రస్తుతం నలుగురైదుగురు మాత్రమే దినకరన్‌ వెంట నడుస్తున్నారు. మిగతావారంతా ఎప్పుడో అన్నాడీఎంకే, డీఎంకేలలో చేరిపోయారు. ఈ పరిస్థితుల్లో పార్టీని నడపడం దినకరన్‌కు కత్తిమీద సాములా మారింది. ఇలాంటి సమయంలో ఏదో ఒక పార్టీలో విలీనం కావడమే శరణ్యంగా భావిస్తున్నారు.

మరోవైపు, అధికార అన్నాడీఎంకేకు చెందిన పలువురు శాసనసభ్యులు ఇంకా శశికళకు అనుకూలంగా కొనసాగుతున్నారన్న వార్తలు ఉన్నాయి. వీరు అధికారపక్షంలో ఉంటునే అధిష్టానంపై తరచూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వీరిలో కొందరు శశికళ జైలు నుంచి విడుదల కాగానే ఆమె వెంట వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలను విలీనం చేస్తే రాష్ట్రంలో పార్టీ ప్రతిష్ట మెరుగవుతుందని బీజేపీ స్థానిక నాయకులు భావిస్తున్నారు. ఇద్దర కలిస్తే తమకు ఎంతో కొంత అచ్చోస్తుందంటున్నారు. వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోగా శశికళ వర్గాన్ని ఎడప్పాడి, ఓపీఎస్‌ వర్గాలను సమైక్యపరిస్తే పార్టీ బలపడుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అదే అదునుగా ఆ పార్టీతో బలమైన పొత్తు కుదుర్చుకుని పోటీచేసి కొన్ని అసెంబ్లీ సీట్లు గెలుచుకోవచ్చునని బీజేపీ ఫ్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

అయితే, పార్టీ శ్రేణులు అంతగా లేని దినకరన్‌ పార్టీని చేర్చుకోవడం వల్లే అన్నా డీఎంకేకు పెద్దగా ఒరిగేదేమీ లేదని సీనియర్ నేతలు భావిస్తున్నారు. అయితే, జైలు నుంచి శశికళ బయటకు వస్తే తమ పార్టీ బలం ఎంటో తెలుస్తుందని దినకరన్‌ సన్నిహితులు చెబుతున్నారు. బీజేపీ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో లేదో శశికళ విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.