శిఖర్‌ ధావన్‌ మెరుపులు.. గెలిచిన ఢిల్లీ..

యువ ఢిల్లీ మళ్లీ మెరిసింది. రాజస్థాన్‌కు మరో ఓటమి దక్కింది. దుబాయ్‌ వేదికగా బుధవారం ఢిల్లీ, రాజస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఈ మ్యాచ్‌లో 162 పరుగుల టార్గెట్‌తో దిగిన స్మిత్‌ సేనకు మంచి ఆరంభమే లభించినప్పటికీ ఉపయోగించుకోలేకపోయింది.

శిఖర్‌ ధావన్‌ మెరుపులు.. గెలిచిన ఢిల్లీ..
Follow us

|

Updated on: Oct 15, 2020 | 6:32 AM

యువ ఢిల్లీ మళ్లీ మెరిసింది. రాజస్థాన్‌కు మరో ఓటమి దక్కింది. దుబాయ్‌ వేదికగా బుధవారం ఢిల్లీ, రాజస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఈ మ్యాచ్‌లో 162 పరుగుల టార్గెట్‌తో దిగిన స్మిత్‌ సేనకు మంచి ఆరంభమే లభించినప్పటికీ ఉపయోగించుకోలేకపోయింది. ఈ క్రమంలో ఊపు మీదున్న బట్లర్‌ 22(9)ను నోర్జె పెవిలియన్‌కు పంపించాడు.

ఆ వెంటనే కెప్టెన్‌ స్మిత్‌(1)సైతం స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్ చేతికి చిక్కి ఔటయ్యాడు. దీంతో రాజస్థాన్‌ స్కోరుబోర్డు వేగం తగ్గింది. ఆ తర్వాత ఓపెనర్‌ స్టోక్స్‌ 41(35బంతుల్లో 6ఫోర్లు), శాంసన్ ‌25(18బంతుల్లో 2సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే.. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు. దీంతో స్మిత్‌ సేన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయింది.

చివరికి ఉతప్ప 32(27బంతుల్లో 3ఫోర్లు, సిక్సర్‌), తెవాతియా 14 (18బంతుల్లో) జట్టును గెలిపించేలా కనిపించారు. ఢిల్లీ బౌలర్లు రబాడ, నోర్జె క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో రాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు. ఆఖరి ఓవర్లో 22 పరుగులు అవసరమైన సమయంలో బౌలింగ్‌కు వచ్చిన కొత్త కుర్రాడు తుషార్‌ కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్‌ పడగొట్టాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్‌ 8వికెట్లు కోల్పోయి 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. 13 పరుగుల తేడాతో రాజస్థాన్‌ ఓడిపోయింది. ఢిల్లీ బౌలర్లు తుషార్‌, నోర్జె చెరో రెండేసి వికెట్లు తీయగా.. రబాడ, అశ్విన్‌, అక్షర్‌ పటేల్ ఒక్కో వికెట్‌ సొంతం చేసుకున్నారు.

అంతకుముందు టాస్‌ గెలిచిన ఢిల్లీ సారథి శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌  ఎంచుకున్నాడు. అయితే ఢిల్లీ జట్టు అనూహ్యంగా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. పృథ్వీషా (0), అజింక్యా రహానె 2(9) త్వరగా ఔటయ్యారు. శిఖర్‌ ధావన్‌ 57 (33బంతుల్లో 6ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ 53 (43బంతుల్లో 3ఫోర్లు, 2 సిక్సర్లు)తో రాణించారు. నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. రాజస్థాన్‌ బౌలర్లలో ఆర్చర్‌ (19/3) దిల్లీని దెబ్బ తీశాడు. ఆఖర్లో ఉనద్కత్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. కార్తిక్‌, శ్రేయస్‌ గోపాల్‌ చెరో వికెట్‌ తీశారు. ఛేదనలో రాజస్థాన్‌ చేతులెత్తేయడంతో బౌలర్ల శ్రమ వృథా అయింది. ఇదిలా ఉండగా. . ఆడిన ఎనిమిది మ్యాచుల్లో 6 విజయాలు సాధించిన ఢిల్లీ మళ్లీ అగ్రస్థానంలోకి ఎగబాకింది. 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీసిన నోర్జెను మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ వరించింది.