Vice President Venkaiah Naidu: సైబర్ నేరగాళ్లు ఇంటర్నెట్ ప్రపంచంలో చాలా మందిని తమ బాధితులుగా చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ కేటుగాళ్ల ఆగడాలు ఎంతగా పెరిగిపోయాయి అంటే భారత ఉపరాష్ట్రపతి లాంటి వ్యక్తి పేరు చెప్పి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సామాజిక మాధ్యమాల నకిలీ సందేశాల బెడద ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకూ తప్పలేదు. ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పేరుతో ఒక వ్యక్తి వీఐపీలతో సహా వ్యక్తులకు వాట్సాప్ సందేశాలు పంపుతూ సహాయం, ఆర్థిక సహాయం కోరుతున్నారు. ఈ మేరకు శనివారం ఆయన కార్యాలయం వివరాలు వెల్లడించింది.
ఇటీవల కాలంలో ఫేస్‌బుక్, వాట్సప్‌లను దుర్వినియోగం చేస్తూ ఆర్థిక సహాయం కావాలంటూ కొందరు మోసాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. అదే రీతిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడినని చెప్పుకొంటూ.. ఆర్థిక సహాయం కావాలని కోరుతూ. ఓ వ్యక్తి పలువురికి వాట్సప్ సందేశాలు పంపడాన్ని గుర్తించారు. 94390-73183 మొబైల్ నంబరుతో ఈ సందేశాలు వెళ్లాయి. విషయం ఉప రాష్ట్రపతి దృష్టికి వెళ్లడంతో ఆయన తన సచివాలయం ద్వారా కేంద్ర హోం శాఖను అప్రమత్తం చేశారు. ఇటువంటి సందేశాలు మరిన్ని నంబర్ల నుంచి వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని దేశ ప్రజలకు సూచించారు.
గతంలో బెంగళూరుకు చెందిన సుకేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తి చాలా నగరాల్లో ధనవంతులను మోసం చేశాడు. ఉద్యోగాల పేరుతో పలువురిని మోసం చేశాడు. రాజకీయ నాయకుడికి బంధువుగా నటించి 100 మందికి పైగా రూ.75 కోట్ల మేర మోసం చేసినట్లు సమాచారం. ఇటీవల, ముంబైలోని మలాడ్‌లో నివసిస్తున్న 71 ఏళ్ల వ్యక్తికి సోమవారం మధ్యాహ్నం వచ్చిన ఫోన్ కాల్‌లో ఇలా ఉంది- ‘నేను ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా మాట్లాడుతున్నాను. మీ న్యూడ్ వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. వెంటనే తొలగించకుంటే అరెస్టు చేస్తామన్నారు. వృద్ధుడిని రాహుల్ శర్మ అనే వ్యక్తిని సంప్రదించమని అడిగారు. అతను వీడియోను తీసివేసి, ఇమెయిల్ ద్వారా నిర్ధారించడంలో సహాయం చేస్తాడు. దీని తర్వాత, ఈ వ్యక్తి వీడియోను తొలగించే పేరుతో వృద్ధుల నుండి 1.4 లక్షల రూపాయలు తీసుకుంటాడు. అప్పుడు అతను సైబర్ క్రైమ్ రూపంలో మోసపోయానని గుర్తించాడు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు.