రాజస్థాన్‌లో దారుణాతి దారుణ ఘటన వెలుగు చూసింది. తల్లి పక్కన నిద్రిస్తున్న ఎనిమిదేళ్ల బాలికను అపహరించి ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు గుర్తు తెలియని దుండగులు. అంతటితో ఆగని ఆ కిరాతకులు చిన్నారిని దారుణం చంపేసి.. ఆ తరువాత బాలిక ఇంటికి కొద్ది దూరంలో గల మురికి గుంటలో మృతదేహాన్ని పడేసి పైశాచికానందం పొందారు దుర్మార్గులు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్‌లోని ప్రతాప్‌ఘర్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలిక శుక్రవారం నాడు తన ఇంట్లో తల్లితో కలిసి నిద్రిస్తోంది. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బాలికను కిడ్నాప్ చేశారు. ఆ తరువాత బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగని దుర్మార్గులు బాలికను క్రూరంగా చంపేసి.. ఆమె ఇంటికి 300 మీటర్ల దూరంలో గల బురద గుంటలో శవాన్ని విసిరేశారు. బాలిక మృతదేహాన్ని గమనించిన స్థానికులు మృతురాలి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. గ్యాంగ్ రేప్ చేసి చంపేసినట్లుగా నిర్ధారించారు. హత్య, అత్యాచారం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంతటి కిరాతకానికి పాల్పడిన దుండగుల కోసం గాలింపు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.