మహారాష్ట్ర లోని పాల్గర్‌లో దారుణం జరిగింది. సూరజ్ కుమార్ దూబే అనే 26 ఏళ్ళ నేవీ సైలర్ ని దుండగులు సజీవదహనం చేశారు. గత నెల 30 న చెన్నై విమానాశ్రయం సమీపం నుంచి ఈ యువకుడిని ముగ్గురు వ్యక్తులు గన్ చూపి.. బెదిరించారని, చివరకు కిడ్నాప్ చేసి,, మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాకు తీసుకుపోయారని తెలిసింది. అక్కడ మూడు రోజులపాటు నిర్బంధంలో ఉంచి చిత్రహింసల పాల్జేశారని సమాచారం. రూ. 10 లక్షలు ఇవ్వాలని అతని కుటుంబాన్ని వారు డిమాండ్ చేశారని, చివరకు అతని కాళ్ళు, చేతులు కట్టివేసి నిప్పంటించారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో సూరజ్ కుమార్ కి 90 శాతం కాలిన గాయాలయ్యాయి. స్థానికులు ఇతడిని హుటాహుటిన ముంబైలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. రాంచీకి చెందిన ఇతడిని కోయంబత్తూరు సమీపంలోని ఐ ఎన్ ఎస్ అగ్రానీ కి పోస్ట్ చేశారని పోలీసులు తెలిపారు.
సూరజ్ కుమార్ సెలవులో ఉన్నట్టు నేవీ సిబ్బంది తెలిపారు. కాగా తన కుమారుడు మృతి చెందే ముందు మరణ వాంగ్మూలం ఇఛ్చాడని, ముగ్గురు వ్యక్తులే తనను హతమార్చారని చెప్పాడని సూరజ్ కుమార్ తండ్రి విలపిస్తూ చెప్పారు. తనకుమారుడికి న్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు ఈ దారుణ హత్యపై కేసు నమోదు చేసుకుని ముగ్గురు దుండగుల కోసం గాలిస్తున్నారు.
Read More: