
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగిన 28 ఏళ్ల కేఫ్ వ్యాపారి శివశర్మ అనుమానాస్పద మృతి కేసు రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. అక్టోబర్ 9న హజ్రత్గంజ్ ప్రాంతంలోని అవధ్ గ్రీన్ అపార్ట్మెంట్ నాలుగో అంతస్తు నుంచి కిందపడి శివశర్మ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ ఘటన కేవలం ప్రమాదం కాదని, తన కుమారుడిని లివ్-ఇన్ పార్ట్నర్, మోడల్ అయిన శ్రద్ధా దూబేయే పథకం ప్రకారం హత్య చేసిందని శివశర్మ తల్లి రంజనా శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని నెలలుగా శ్రద్ధా తన కొడుకును సోషల్ మీడియా వీడియోలు, తప్పుడు కేసుల పేరుతో బ్లాక్మెయిల్ చేస్తూ తీవ్రంగా వేధించిందని ఆమె ఆరోపించారు.
ఇక బాధితుడి పేరెంట్స్ ఫిర్యాదుతో మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. దర్యాప్తులో భాగంగా ఘటనా స్థలంలోని సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు.. ఘటన సమయంలో సెక్రటేరియట్ లేబుల్ ఉన్న ఒక తెల్లటి ఆడీ కారు అక్కడకు వచ్చినట్లు గుర్తించారు. అయితే పోలీసులు శ్రద్దా ఫోన్ ఛాట్ను చెక్ చేసినప్పుడు.. తనకు రాజకీయ నాయకులు, పలువురు ప్రభావవంతమైన వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయంటూ శ్రద్ధా దూబే శివను బెదిరించినట్లు చాట్స్ ద్వారా తెలిసింది. దీంతో ఆమెపై అనుమానాలు మరింత బలపడ్డాయి.
అంతేకాదు పోస్ట్ మార్టమ్ నివేదికలో తీవ్రమైన రక్తస్రావం, ఊపిరితిత్తులు దెబ్బతినడం కారణంగానే శివశర్మ చనిపోయినట్లు తేలింది. దీంతో కేసు మరింత సీరియస్గా తీసుకున్న పోలీసులు.. ప్రస్తుతం పరారీలో ఉన్న శ్రద్ధా దూబేతో పాటు ఆమె సోదరి, డ్రైవర్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. వారిని పట్టుకున్న తర్వాత ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.