Andhra Pradesh: డాక్టర్‌కి కాల్‌చేసి జాబ్‌ అడిగిన ఐఏఎస్‌..! ఆరా తీస్తే అసలు బాగోతం తెలిసింది

AP Crime News: గుంటూరుకు చెందిన శ్రీనివాసరావు కొంత కాలం హైదరాబాద్‌లో ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత గుంటూరు తిరిగి వచ్చి ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. ఎక్కడా ఉద్యోగం రాలేదు. దీంతో ఓ కన్నింగ్‌ ప్లాన్ వేశాడు.‌

Andhra Pradesh: డాక్టర్‌కి కాల్‌చేసి జాబ్‌ అడిగిన ఐఏఎస్‌..! ఆరా తీస్తే అసలు బాగోతం తెలిసింది
Fake Ias

Updated on: Feb 14, 2022 | 3:11 PM

Guntur District: నకిలీ ఐఏఎస్​ అవతారమెత్తి నమ్మిన వారిని నిండాముంచాడు. కలెక్టర్​గా చలామణి అవుతూ ఉద్యోగాల పేరుతో వసూళ్లకు తెరలేపాడు. అనుమానం వచ్చిన బాధితులు పోలీసులను ఆశ్రయించగా, తీగ లాగితే సదరు ఆఫీసరుగారి డొంకంతా కదిలింది. గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది ఈ నకిలీ ఐఏఎస్‌(Fake IAS) ఆఫీసర్‌ బాగోతం. గుంటూరుకు చెందిన శ్రీనివాసరావు కొంత కాలం హైదరాబాద్‌(Hyderabad)లో ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత గుంటూరు తిరిగి వచ్చి ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. ఎక్కడా ఉద్యోగం రాలేదు. దీంతో ఓ కన్నింగ్‌ ప్లాన్ వేశాడు.‌ నగరంలోని బాలాజీ హాస్పిటల్(Balaji Hospital) ఎండి చంద్రశేఖర్ కి ఫోన్ చేశాడు. తనని తాను ఐఏఎస్ కృష్ణ బాబుగా పరిచయం చేసుకున్నాడు. తాను చెప్పిన వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలని బెదిరించాడు. ఉద్యోగం తో పాటు జీతం కూడా ఎంతో తానే చెప్పాడు. నెలకి నలభై వేల రూపాయలు ఇవ్వాలన్నాడు. అంతేకాదు. ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేసి మేనేజర్ హోదా ఇవ్వాలన్నాడు. తాను చెప్పినట్లు చేయకపోతే ఆసుపత్రి నే సీజ్ చేస్తానని హెచ్చరించాడు.

సరే అన్న డాక్టర్ ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆసుపత్రి మేనేజర్ చేత శ్రీనివాసరావుకి ఫోన్ చేయించారు. మీరు చెప్పినట్లు ఉద్యోగం ఏర్పాటు చేశామని ఆ ఉద్యోగిని పంపాలని చెప్పారు. కొద్ది సేపటి తర్వాత ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి ని పోలీసులు పట్టుకున్నారు. అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారించారు. పోలీసుల విచారణలో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. ఉద్యోగం కావాలని వచ్చిన వ్యక్తే శ్రీనివాస్ అని ఉద్యోగం కావాలని ఐఏఎస్ అధికారి పేరుతో ఫోన్ చేసింది కూడా తానేనని ఒప్పుకున్నాడు. అయితే, కేవలం బాలాజీ ఆసుపత్రి కే కాకుండా,…ఇంకా మరో రెండు మూడు ఆసుపత్రులకు ఇదేవిధంగా ఫోన్ చేసి ఉద్యోగం కావాలని బెదిరించినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు ఫేక్‌ కలెక్టర్‌ శ్రీనివాసరావు.

Also Read: పసికందును చంపి ఉరేసుకున్న తల్లి..! పోలీసులు సైతం కన్నీరు.. కానీ చివరి నిమిషంలో

Follow Us