COVID-19 patient raped: భోపాల్‌లో సభ్యసమాజం తలదించుకునే ఘటన.. కోవిడ్ భాధితురాలిపై నర్సు లైంగికదాడి

|

May 14, 2021 | 2:13 PM

సిగ్గుమాలిన ఘటన ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ఆసుపత్రిలో జరిగింది. భోపాల్‌ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటరులో కరోనాతో బాధపడుతున్న రోగిపై ఓ నర్సు లైంగికదాడికి పాల్పడ్డాడు.

COVID-19 patient raped: భోపాల్‌లో సభ్యసమాజం తలదించుకునే ఘటన.. కోవిడ్ భాధితురాలిపై నర్సు లైంగికదాడి
Follow us on

COVID-19 patient raped: సిగ్గుమాలిన ఘటన ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ఆసుపత్రిలో జరిగింది. ఇన్నాళ్లూ కరోనా శవాలపై నగలు దోచుకోవడం చూశాం.. ట్రీట్మెంట్ పేరుతో లక్షల రూపాయలు దండుకోవడాన్ని చూశాం. కానీ ఇది అత్యంత దారుణమైన ఘటన. కరోనా మహావిపత్కర కాలంలో.. వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి చికిత్స అందిస్తున్నారు. అయిన వాళ్లు దూరంగా ఉన్నా.. అన్నీ తామై ఆదరించారు. లక్షలాది మంది కోవిడ్ రోగులను కాపాడుతున్నారు. వాళ్లను దేవుళ్లుగా భావించి మొక్కుతున్నాం. కానీ, భోపాల్‌లో సభ్యసమాజం తలదించుకునేలాంటి ఘటన చోటుచేసుకుంది. భోపాల్‌లోని మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటరులో కరోనాతో బాధపడుతున్న రోగిపై విధుల్లో ఉన్న ఓ నర్సు లైంగికదాడికి పాల్పడ్డాడు.

43 ఏళ్ల మహిళ కరోనాతో బాధపడుతూ.. ఏప్రిల్‌ 6న భోపాల్‌ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటరులో చేరింది. ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉండడంతో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతోంది. బాధితురాలు అన్న కనికరం లేని ఓ కసాయి ఆమెపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘాతుకానికి ఒడిగట్టింది 40 ఏళ్ల నర్సు సంతోష్ అహిర్ వార్‌గా పోలీసులు గుర్తించారు. కరోనా రోగిని ముట్టుకుంటే తనకూ అంటుకుంటుందన్న భయం లేదు. చావుబతుకులతో పోరాడుతోందనే కనికరం చూపలేదు. నిస్సిగ్గుగా.. ఒళ్లు తెలియని కామంతో.. ఆమెపై పడి పైశాచిక ఆనందం పొందాడు.

బాధితురాలి పరిస్థితి విషమించడంతో ఆమెను వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. కానీ 24 గంటల్లోనే బాధిత మహిళ ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు సంతోష్‌ అహిర్‌ వార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. భోపాల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. తన ఉనికిని రహస్యంగా ఉంచాలని బాధితురాలు చెప్పడంతో.. మరెవరితోనూ ఈ సమాచారం పంచుకోలేదని సీనియర్ పోలీసు అధికారి ఇర్షాద్ వాలి తెలిపారు.

చనిపోయిన మహిళ 1984 భోపాల్‌ గ్యాస్‌ విషాదంలోనూ చిక్కుకుని ప్రాణాలతో బయటపడింది. కానీ, ఇప్పుడు ఈ నర్సు చేతిలో బలైపోయింది. కరోనా పోరాడుతున్న ఆమెపై.. ఆ కఠోర రాక్షసత్వాన్ని భరించలేక ప్రాణాలు విడిచింది. గతంలోనూ ఈ నిందితుడు మద్యం సేవించి 24 ఏళ్ల స్టాఫ్‌ నర్సుపై అత్యాచారం చేసి.. సస్పెండ్‌ అయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సస్పెండైన నర్సును మళ్లీ విధుల్లోకి ఎందుకు తీసుకున్నారు? ఆ కేసులో శిక్ష ఎందుకు పడలేదో అర్ధం కావడం లేదు.

ఈ ఘటనతో ఆస్పత్రిలో అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపారు. అంతపెద్ద ఆస్పత్రిలో కనీసం సీసీ కెమెరాలు కూడా లేనట్టు తేలింది. అనేక భద్రతా పరమైన లోపాలున్నాయని గుర్తించారు. ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు. హాస్పిటల్‌ యాజమాన్యంపైనా కేసు నమోదు చేసింది దర్యాప్తు బృందం.

Read Also…. COVID 19 Vaccination: భారత్ ముమ్మరంగా కోవిడ్ వ్యాక్సినేషన్‌.. 18కోట్లకు చేరువలో టీకాల పంపిణీ.. !