Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

మండలి రద్దు సరే… మరి కేంద్రం ఏం చేస్తుందో…?

council ball in center court, మండలి రద్దు సరే… మరి కేంద్రం ఏం చేస్తుందో…?

ఏపీ శాసనమండలి రద్దు తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మండలి రద్దు తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశ పెట్టగా…మిగతా సభ్యులు చర్చించి ఆమోదం తెలిపారు. పనిలో పనిగా 2004లో మాజీ సిఎం చంద్రబాబు నాయుడు మండలి రద్దు చేయాల్సిందేనంటూ చేసిన ప్రసంగాల వీడియోను సభలో ప్రదర్శించారు. అప్పుడు ఇప్పుడు యూ టర్న్ తీసుకుంది మేము కాదు చంద్రబాబునే అని చెప్పే ప్రయత్నం చేసింది. సభకు టీడీపీ దూరంగా ఉంది. ఫలితంగా వారు లేకుండానే శాసనసభలో మండలి రద్దు తీర్మానం ఆమోదం పొందింది. ఇక్కడ వరకు అధికార పార్టీ అనుకున్నట్లే జరిగింది. కానీ ఇప్పుడే అసలు గమ్మత్తు ఉంది. మండలి రద్దుకు కేంద్రం ఒప్పుకుంటుందా లేదా..పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొంది మండలి రద్దు అవుతుందా లేదా అనే చర్చ సాగుతోంది. పల్లె, పట్నం అనే తేడాలేదు. బజార్లో ఏ నలుగురు కూర్చున్నా దీని పైనే మాట్లాడుకుంటున్నారు. ఈ నేపధ్యంలో శాసనమండలి ఎలా రద్దు అవుతుంది..తిరిగి ఎలా పునరుద్దరిస్తారనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

చరిత్రలోకి వెళితే…

ఆంధ్రప్రదేశ్ శాసనసభను విధాన సభ అంటాం. అదే శాసనమండలిని విధాన పరిషత్ అని పిలుస్తాం. దీనికే ఎగువసభ అనే పేరు కూడ ఉంది. పార్లమెంటులో లోక్ సభ, రాజ్యసభలు ఇలానే ఉంటాయి. అక్కడ ఎగువసభ రాజ్యసభ అయితే..దిగువసభ లోక్ సభ. ఇక ఏపీ విషయానికి వస్తే ప్రస్తుత రాజధాని అమరావతిలో ఉన్న శాసనమండలిలో 58 మంది సభ్యులున్నారు. ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలి ఏర్పాటు చేయాలని 1956 డిసెంబరు 5న తీర్మానం చేసింది శాసనసభ. ఆ తర్వాత ఈ తీర్మానాన్ని పార్లమెంటుకు పంపింది. అక్కడ ఉభయ సభలు ఆమోదముద్ర వేసి తిరిగి పంపాయి. ఫలితంగా అధికారికంగా శాసనమండలి 1958 జూలై 1 న ఏర్పాటైంది. భారత రాజ్యాంగంలోని 168 అధికరణం మూలంగా ఇది జరిగింది. 1968 జూలై 8 న అప్పటి భారత రాష్ట్రపతి డా. రాజేంద్రప్రసాద్ మండలి ప్రారంభోత్సవం చేసాడు. 1958 నుండి 1985 వరకు శాసనమండలి కొనసాగింది.

కానీ 1980లో ఎగువ సభలను రద్దు చేయాలనే డిమాండ్ వచ్చింది. అలా కోరే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ముందు నిలిచింది. జనాభాలో ప్రాతినిధ్యం లేనిది. రాష్ట్ర బడ్జెట్ పై ఒక భారమైనది వద్దనే వాదన చేశాయి రాష్ట్రాలు. ఏపీలో శాసనమండలి నిర్వహరణకు రోజుకు కోటి రూపాయల ఖర్చు అవుతోంది. అందుకే రద్దు చేయాలని ఇటీవల ఏపీ సిఎం జగన్మోహనరెడ్డి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో శాసనసభలో ఆమోదించిన బిల్లులను చట్టంగా తీసుకురావడానికి మండలి అడ్డుగా నిలుస్తుందనే వాదనుంది. మెజార్టీ సభ్యుల నిర్ణయం మేరకే అది జరుగుతున్నా..తమకు అనుకూలంగా లేకపోతే మండలిని రద్దు చేయాలని అధికారంలో ఉన్న పార్టీలు ఆలోచిస్తున్నాయి. గతంలోను అదే జరిగింది. ఇప్పుడు అదే ఆలోచన చేస్తున్నాయి. చట్టం ఆమోదానికి ఆలస్యం అవుతుందనే కారణంతో జాప్యాన్ని నివారించడానికే ఈ పని చేస్తున్నట్లు చెబుతున్నాయి.

council ball in center court, మండలి రద్దు సరే… మరి కేంద్రం ఏం చేస్తుందో…?

ఎన్టీఆర్ ఏం చేశారంటే…

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మండలిలో భారత జాతీయ కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లున్నాయి. ఫలితంగా శాసనసభలో ఆమోదం పొందిన బిల్లులు మండలిలో ఆగుతున్నాయి. ఇక లాభం లేదని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మండలి రద్దు వైపు మొగ్గు చూపాడు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మండలిరద్దు తీర్మానం ప్రవేశ పెట్టి ఆమోదించారు. ఆ తర్వాత పార్లమెంటుకు పంపారు. కానీ ఇందుకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఒప్పుకోలేదు. ఫలితంగా కొన్నాళ్ల పాటు ఆగాల్సి వచ్చింది. ఇందిరాగాంధీ హత్య తర్వాత ప్రధానిగా రాజీవ్ గాంధీ ఎన్నికయ్యారు. తర్వాత ఎన్టీఆర్ మరోసారి శాసనమండలి రద్దు తీర్మానాన్ని గుర్తు చేశారు. ఎన్టీఆర్ తో సఖ్యత కోరుకున్న రాజీవ్ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫలితంగా ఉభయసభలు ఆమోద ముద్ర వేశాయి. 1985 లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు అయింది. అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య లాంటి నేతలు ఆమండలిలోనే సభ్యులుగా ఉన్న సంగతి గుర్తు చేసుకోవాలి.

మండలి పునరుద్దరణ

1989లో రాష్ట్ర ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ (ఐ) కు చెందిన ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డిలో శాసన మండలిని పునరుద్ధరించడానికి తన వంతు ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆలోచనే కాదు. శాసన మండలిని పునరుద్ధరించడానికి శాసనసభలో ఒక తీర్మానం ప్రవేశ పెట్టాడు. 1990 జనవరి 22 న ఈ తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. ఆ తర్వాత 1990 మే 28న భారత పార్లమెంటులో రాజ్యసభలో శాసన మండలి పునరుద్ధరణ తీర్మానం పై చర్చ జరిగింది. ఆమోదించారు. కానీ లోక్ సభలో ఆ తీర్మానం ఆమోదం పొందలేదు. ఐదేళ్ల కాలానికి ముందే లోక్‌సభ రద్దు కావడమే ఇందుకు కారణం. ఆ తర్వాత వచ్చిన 1991–1996, 1996–1998, 1998–2004 లోక్ సభల్లోను ఈ తీర్మానం పై ఎలాంటి చర్య తీసుకోలేదు. అప్పటికే ఆ బిల్లు మురిగిపోయింది. ఫలితంగా మండలి పునరుద్దరణ తీర్మానం చాలా కాలం పాటు సభలోనే ఉండిపోవాల్సి వచ్చింది. చెన్నారెడ్డి తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో మండలి పునరుద్దరణ తీర్మానం సంగతి పట్టించుకోలేదు.

council ball in center court, మండలి రద్దు సరే… మరి కేంద్రం ఏం చేస్తుందో…?

కానీ 2004 రాష్ట్ర ఎన్నికలలో విజయం సాధించిన కాంగ్రెస్ మరోసారి మండలి పునరుద్దరణ బిల్లును తెరపైకి తెచ్చింది. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యాక ఈ బిల్లు సంగతి చూశారు. మండలిని పునరుద్ధరించాలంటూ 2004 చివర్లో శాసనసభలో తీర్మానం చేశారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ శాసన సభలో మండలి పునరుద్దరణ బిల్లును పెట్టి జులై 8, 2004న ఆమోదించింది. ఆ తర్వాత గవర్నర్ కేంద్రానికి ఈ బిల్లును పంపారు. ఇది 2004 డిసెంబర్ 16 న ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ బిల్‌గా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. చర్చించారు. ఆ తర్వాత 2006 డిసెంబరు 15 న లోక్‌సభలో ఆమోదం పొందింది. ఆ తర్వాత వారం రోజులకే డిసెంబర్ 20న రాజ్యసభ కూడ మండలి ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది. ఉభయసభలు ఆమోదించడంతో 2007 జనవరి 10న రాష్ట్రపతి ఆమోదం పొందింది. చివరకు అది 2007 మార్చి 30న రెండోసారి ఏర్పాటు చేసినట్లుఅయింది. ఏప్రిల్ 2 న అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ అధికారికంగా శాసనమండలిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్ ఆదేశాల మేరకు అప్పటి కాంగ్రెస్ నేత కంతేటి సత్యనారాయణ మండలి పునరుద్దరణ పని చేయించారని చేశారని చెబుతారు.

ఎలా ఎన్నికవుతారంటే…

శాసన మండలి శాశ్వత సభగా పిలుస్తారు. దీన్ని రద్దు చేయడం అంత తేలిక కాదు. ఇందులో ఆరు సంవత్సరాల కాలానికి 58 మంది సభ్యులుఉంటారు. అందులో 1/3 వంతు మంది ప్రతీ రెండు సంవత్సరాలకు రొటేషన్ పద్ధతిలో ఎన్నికవుతారు. వీరిలో 8 మందిని ఆంధ్రప్రదేశ్ గవర్నరు నామినేట్ చేస్తారు. కవులు, కళాకారులు, విద్యావంతులు, వివిధ రంగాల్లో నిపుణులను ఇందుకు ఎంపిక చేయవచ్చు. 40 మంది సభ్యులు అసెంబ్లీ మరియు స్థానిక సంస్థల ఎలక్టోరల్ కొలేజ్ ద్వారా ఎన్నికవుతారు. మిగిలిన 10 మంది సభ్యులను కళాశాల గ్రాడ్యుయేట్లు మరియు ఉపాధ్యాయుల నుండి ఎన్నికవుతారు. ఇప్పుడు భారతదేశంలోని 6 రాష్ట్రాల్లో శాసన మండళ్లు ఉన్నాయి. జమ్మూ కశ్మీర్‌ శాసన మండలి పోయినేడు రద్దయింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 169లో పేర్కొన్న నియమాలు మండళ్లకు వర్తిస్తాయి. ఉత్తరప్రదేశ్‌ 100 మంది మండలి సభ్యులుండగా…మహారాష్ట్ర 78, కర్ణాటక 75, బిహార్‌ 75, ఆంధ్రప్రదేశ్‌ 58, తెలంగాణ 40 మంది సభ్యులున్నారు. గతంలో అసోం మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో శాసనమండలి ఉండేది. ఈ రాష్ట్రాల్లో మళ్లీ దాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్‌ ఉంది. ఇక ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్తాన్, ఉత్తరాఖండ్‌లో ఇంతవరకూ శాసనమండలి ఏర్పాటు జరగలేదు. రాజకీయ అవసరాల కోసం ఇక్కడ కూడ మండలిని ఏర్పాటు చేయాలనే ఆయా రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇలా చేస్తారు…

2007 నుండి ప్రస్తుతం వరకు రెండు పర్యాయాలు శాసనమండలి ఏర్పాటైంది. ఇప్పుడు మరోసారి శాసనమండలిని రద్దు చేసేందుకు ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఫలితంగా ఎలా ఇది రద్దు అవుతుందనే చర్చ సాగుతోంది. మండలిని రద్దు చేయడం లేదా కొనసాగించడం అనేది ఆ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ ఇష్టమనేది వాస్తవం. కేబినెట్ నిర్ణయం మేరకు మండలి రద్దుకు శాసనసభలో తీర్మానం ప్రవేశపెడతారు. దాన్ని మూడింట రెండొంతుల మెజార్టీతో ఆమోదించాలి. ఆ తర్వాత ఆ తీర్మానాన్ని గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపుతారు. నోడల్ ఏజెన్సీ అయిన హోం మంత్రిత్వ శాఖ లోక్ సభ, రాజ్యసభల్లో దాన్ని ప్రవేశపెట్టేలా చూస్తోంది. ఉభయ సభలు సాధారణ మెజార్టీతో ఆ బిల్లును ఆమోదించాలి. అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో శాసన మండలి రద్దు అవుతుంది. హోం మంత్రిత్వ శాఖ దగ్గరకు వెళ్లాక శాసన మండలి రద్దుకు ఎంత సమయం పడుతుందనేది చెప్పలేం. ఎందుకంటే లోక్ సభలో, రాజ్యసభలో ఈ బిల్లును ఎప్పుడు ప్రవేశపెట్టాలనేది కేంద్రం అభీష్టంపై ఆధారపడి ఉంటుంది. శాసన మండలిని రద్దు చేయాలన్న నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో సవాల్ చేయలేం. గతంలో అలా సుప్రీంకోర్టుకు వెళ్లినా పక్కనపెట్టింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసన మండలి రద్దుకు సిఫారసు చేశారు. ఆ సమయంలో ఏపీలో ప్రతిపక్షంలో ఉంది కాంగ్రెస్. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉంది హస్తం పార్టీ. కానీ రాష్ట్రం వద్దంటోన్న సమయంలో.. మండలిని కొనసాగించడం బాగోదని కౌన్సిల్ రద్దుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది.

కేంద్రం కోర్టులో బంతి

శాసన మండలిని వద్దనుకున్నా, కావాలనుకున్నా అందుకు రాజకీయ అవసరాలే ప్రధాన కారణమయ్యాయి. మండలిని రద్దు చేయాలని రాజ్యంగంలోని 169వ నిబంధన ప్రకారం శాసన సభలో అధికారపక్షం తీర్మానం చేయవచ్చు. ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. దీనిపై కేంద్రం స్పందించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలి. పార్లమెంటులో లోక్ సభ, రాజ్యసభల్లో సాధారణ మెజార్టీ బిల్లు ఆమోదం పొందాక రాష్ట్రపతికి వెళుతోంది. రాష్ట్రపతి సంతకం చేస్తే మండలి రద్దు నిర్ణయం అమలులోకి వస్తుంది. ఇందుకు కేంద్రం ఎంత వరకు సహకరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

రద్దు ఎలా అంటే?

మరోసారి మండలి రద్దుకు ఏపీ శాసనసభ తీర్మానం చేసింది. ఇప్పుడీ తీర్మానాన్ని రాష్ట్ర గవర్నర్ కేంద్రానికి పంపాలి. ఇందుకు కేంద్రం ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి. మోదీ, అమిత్‌షాలను ఒప్పించి లోక్‌సభలో ఆమోదం పొందినా… రాజ్యసభలో ఇబ్బంది వస్తుందంటున్నారు. రాజ్యసభలో ఇప్పటికీ విపక్షానిదే పైచేయి. రద్దుకు కాంగ్రెస్ ఒప్పుకుంటే జగన్ సర్కార్ పని సులువు అవుతోంది. లేకపోతే ఆలస్యం కావడం లేక మురిగిపోవడం తప్పదు. శాసనమండలిని రద్దు చేయాలంటే ముందుగా న్యాయనిపుణుల సలహా తీసుకోవాలి. రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ అభిప్రాయం తెలుసుకోవాలి. ఆ తర్వాత కేబినెట్‌లో తీర్మానం ఆమోదించాలి. కౌన్సిల్‌ను రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టాలి. ఈ సమయంలో అక్కడ పెండింగ్‌లో ఉన్న బిల్లులను ప్రస్తావించాల్సి ఉంటోంది. మండలి రద్దు తీర్మానాన్ని పార్లమెంటు కార్యదర్శికి పంపించాలి. అక్కడి నుంచి ఇది కేంద్ర హోం శాఖకు వెళుతుంది. కేంద్ర హోం శాఖ దీని పై స్పందించి రద్దు బిల్లును పార్లమెంటు ఉభయ సభలకు పంపించాలి. ఉభయ సభల ఆమోదం పొందితే…రాష్ట్రపతి సంతకంతో నోటిఫికేషన్‌ వెలువడుతుంది. అప్పుడు మండలి రద్దు నిర్ణయం అమలులోకి వస్తుంది.

-కొండవీటి శివనాగరాజు
సీనియర్ జర్నలిస్టు, టీవీ9.

Related Tags