మరో గుడ్ న్యూస్ వినిపించింది కేంద్ర ప్రభుత్వం. త్వరలోనే దేశంలో 12 నుంచి 18 ఏళ్ల వయసు వారి కోసం జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టుకు శుక్రవారం సమర్పించిన ప్రమాణపత్రంలో కేంద్రం నివేదించింది. జైడస్ క్యాడిలా టీకా ఈ వయస్సువారిపై క్లినికల్ పరీక్షలను పూర్తి చేసుకుందని పేర్కొంది. పిల్లలపై ఈ టీకా వినియోగానికి త్వరలోనే అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పింది.
అయితే.. డీసీజీఐ కొన్నిరోజుల క్రితమే జైడస్ క్యాడిలా టీకాకు అత్యవసర అనుమతులు ఇచ్చిందని సమాచారం. మరోవైపు.. దేశవ్యాప్తంగా తక్కువ వ్యవధిలో 100 శాతం మేర టీకా పంపిణీ చేసేందుకు తాము చర్యలు తీసుకుంటున్నామని కేంద్రంపేర్కొంది. చిన్నారులపై టీకా ప్రయోగాలు నిర్వహించేందుకు మే 12న భారత్ బయోటక్ సంస్థకు కూడా అనుమతులు ఇచ్చినట్లు కేంద్రం చెప్పింది.