
5G Trial Causing Corona: దేశంలో కరోనా విజృంభణ ఓ రేంజ్లో పెరుగుతోంది. రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఓ వైపు కరోనా కేసులు పెరుగుతుంటే సమానంగా ఈ వ్యాధి చుట్టూ పుకార్లు చుట్టుముడుతున్నాయి. గతకొన్ని రోజుల నుంచి కోవిడ్ వ్యాధికి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌గా మారుతోంది. భారత్‌లో 5జీ నెట్వర్క్ ట్రయల్ టెస్ట్ నిర్వహించడం వల్లే కరోనా ఈ స్థాయిలో వ్యాప్తించెందుతుందనేది సదరు వార్త సారాంశం. అయితే దీనిపై ఇప్పటికే పలువురు నిపుణులు స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. అయినా పుకార్లు మాత్ర ఆగడం లేదు.
ఈ క్రమంలోనే తాజాగా హర్యాన ఛీఫ్ సెక్రటరీ విజయ్ వర్ధన్ జిల్లా మెజేస్ట్రేట్కు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఫేక్ వార్తలను ప్రచారం చేస్తోన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5జీ పరీక్షల వల్లే కరోనా మొదలైందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఈ పుకార్ల కారణంగా కొన్ని ప్రాంతాల్లో మొబైల్ టవర్స్‌ను ధ్వంసం చేసిన సంఘటలను చోటుచేసుకున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఈ వార్తలను ఇప్పటికే ఖండిచిందని వర్ధన్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఇలాంటి వార్తలను ప్రచారం చేసే వారిపై చర్యలను తీసుకోవాలని రాష్ట్రంలోని డీఎమ్, ఎస్పీ, ఎస్ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికీ భారత్‌లో 5జీ నెట్వర్క్ పరీక్షలను పూర్తి స్థాయిలో ప్రారంభించలేదు. ఇలాంటి నేపథ్యంలో ఈ పుకార్లు ఎవరు నమ్మొద్దని విజయ్ వర్ధన్ చెప్పుకొచ్చారు. మరి సోషల్ మీడియా విస్తృతి విపరీతంగా పెరుగుతోన్న ఈ రోజుల్లో ఇలాంటి ఫేక్ న్యూస్‌కు ఎప్పుడు ఫుల్స్టాప్ పడుతుందో చూడాలి.