Lock Down in India: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారా? అనే ప్రశ్న అందరి మదిని తొలచివేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశగా పయనిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కూడా లాక్‌డౌన్ విధిస్తారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లాక్‌డౌన్ విధింపుపై క్లారిటీ ఇచ్చారు. పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎక్కడైతే కరోనా కేసులు అధికంగా ఉంటాయో.. ఆ ప్రాంతాల్లో మాత్రమే స్థానిక నిబంధనల ప్రకారం ఆంక్షలు మాత్రమే విధించడం జరుగుతుందని, దీనిపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని ఆమె స్పష్టం చేశారు.
‘కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నప్పటికీ.. పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించాలనుకోవడం లేదు. దీనిపై పక్కా క్లారిటీతో ఉన్నాము. లాక్‌డౌన్ విధించి దేశ ఆర్థిక వ్యవస్థను స్థంభింపజేయాలనుకోవడం లేదు. కరోనా వ్యాప్తి, రోగుల సంఖ్య.. కరోనా తీవ్రతను బట్టి ఆయా ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఆంక్షలు విధించడం జరుగుతుంది. కరోనా నియంత్రణకు టెస్ట్, ట్రాక్, ట్రీట్, టీకా విధానాలను అమలు చేయడం జరుగుతుంది. లాక్‌డౌన్ అయితే విధించేది ఛాన్స్ లేదు.’ అని నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పారు.
ఇక కరోనా ఉధృతి నేపథ్యంలో ట్వీట్ చేసిన నిర్మలా సీతారామన్.. ‘‘టెస్ట్-ట్రాక్-ట్రీట్-టీకా-కోవిడ్ నిబంధనలు పాటించడం’ వంటి ఫార్ములాలతో వ్యూహాత్మక విధానాలు అనుసరించి కరోనా సెకండ్ వేవ్‌ను నిలువరించడానికి భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.’ అని పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. గత వారం రోజుల నుంచి దేశ వ్యాప్తంగా రోజువారీగా నమోదు అయ్యే సగటు కరోనా కేసులు 1.5 లక్షలు దాటాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఒక్క రోజులో 1,84,372 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదై కేసులను కలుపుకుని దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,38,73,825కి చేరింది.
Also read:
NATA 2021 Result Date: ఎన్‌ఏటీఏ పరీక్షా ఫలితాల తేదీ ఖరారు.. ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా..?