
కరోనా బాధితుల్లో మరణించే వారి సంఖ్యను 5 శాతం లోపే ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి 15వ ఆర్థిక సంఘం సూచించింది. మరణాలు 5శాతం దాటితే దాని ప్రభావం ఆర్థిక రంగంపై తీవ్రంగా పడుతుందని హెచ్చరించింది. ప్రస్తుతం దేశంలో కరోనా మరనాల రేటు 2.8 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో 15వ ఆర్థిక సంఘం సూచించిన పూర్తి వివరాలు పరిశీలించగా..
ప్రపంచ దేశాల మరణాల రేటుతో పోలిస్తే..భారత్‌లో తక్కువగా ఉన్నప్పటికీ క్రమంగా ఆ సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని కమిటీ స్పష్టం చేసింది. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అధ్యక్షత ఏర్పాటయిన ఉన్నతస్థాయి కమిటీ మహమ్మారిని ఎదుర్కోడానికి యంత్రాంగం అవసరాన్ని నొక్కిచెప్పింది. దీని ద్వారా సిబ్బంది, వైద్య పరికరాలు వంటి ఆరోగ్య వనరులను అవసరానికి అనుగుణంగా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి తరలించవచ్చని సూచించింది. భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో కరోనా వైరస్ మహమ్మారి వేర్వేరు సమయాల్లో తీవ్రం కావచ్చని 15వ ఆర్థిక కమిషన్ ఉన్నత స్థాయి కమిటీ అంచనా వేసింది.