AIతో పని గంటలు తగ్గుతాయా? వారానికి 3 రోజుల ఉద్యోగంపై జెఫ్ బెజోస్ ఆసక్తికర వ్యాఖ్యలు

కృత్రిమ మేధస్సు (AI) వల్ల భవిష్యత్తులో ఉద్యోగుల పని విధానం పూర్తిగా మారిపోవచ్చని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అభిప్రాయపడ్డారు. ఏఐ సాయంతో ఉత్పాదకత పెరిగితే.. వారానికి కేవలం మూడు రోజులు పనిచేస్తూనే కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితులు రావచ్చని పేర్కొన్నారు. ఇటీవల ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సంస్థకు చెందిన బ్రెట్ బేయర్‌తో మాట్లాడుతూ.. ఏఐ వల్ల తక్కువ సమయంలో ఎక్కువ పని పూర్తి చేసే అవకాశం ఏర్పడుతుందని వివరించారు..

AIతో పని గంటలు తగ్గుతాయా? వారానికి 3 రోజుల ఉద్యోగంపై జెఫ్ బెజోస్ ఆసక్తికర వ్యాఖ్యలు
Jeff Bezos Explains His Three Day Workweek Prediction

Updated on: Oct 09, 2026 | 12:02 PM

భవిష్యత్తులో ఏఐ అందించే ఉత్పాదకత ప్రయోజనాలతో కొంతమంది ఉద్యోగులు వారానికి మూడు రోజులు పనిచేస్తే సరిపోతుందని నిర్ణయించుకునే అవకాశం ఉందని బెజోస్ అన్నారు. కుటుంబాన్ని పోషించడానికి ఎక్కువ గంటలు పనిచేయాల్సిన అవసరం తగ్గవచ్చని అభిప్రాయపడ్డారు. కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న సందర్భాల్లో.. రెండో ఆదాయం అవసరం లేకపోతే వారిలో ఒకరు ఉద్యోగం మానేసే నిర్ణయం తీసుకోవచ్చని కూడా పేర్కొన్నారు. అయితే ఈ మార్పు ఎలా సాధ్యమవుతుందనే విషయంపై బెజోస్ నిర్దిష్టమైన వివరాలు వెల్లడించలేదు. ఏఐ కారణంగా భారీగా ఉద్యోగాలు తగ్గిపోతాయని చాలామంది అంచనా వేస్తున్నప్పటికీ.. భవిష్యత్తులో కార్మికుల కొరత ఏర్పడే అవకాశమూ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

కృత్రిమ మేధస్సు కారణంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు పోతాయనే అంచనాలతో తాను ఏకీభవించడం లేదని బెజోస్ స్పష్టం చేశారు. ఏఐ వల్ల ఉద్యోగ నష్టాలు తప్పవని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారని ఇంటర్వ్యూలో ప్రస్తావించగా.. వారి అభిప్రాయంతో తాను విభేదిస్తున్నట్లు చెప్పారు. అమెజాన్‌లో గత 12 నెలల్లో దాదాపు 30 వేల ఉద్యోగాల కోత గురించి ప్రశ్నించగా.. కొవిడ్‌-19 మహమ్మారి సమయంలో సంస్థ భారీగా ఉద్యోగులను నియమించుకోవడమే ఇందుకు కారణమని ఆయన వివరించారు. మహమ్మారి తర్వాత కంపెనీ ఉద్యోగుల సంఖ్య వేగంగా పెరిగిందని, ఇటీవలి ఉద్యోగ కోతలను ఏఐ ప్రభావంతో మాత్రమే ముడిపెట్టడం సరికాదని ఆయన వ్యాఖ్యల సారాంశం. కృత్రిమ మేధస్సు రంగంలో పెట్టుబడుల పెరుగుదలను పారిశ్రామిక బబుల్‌తో పోల్చిన బెజోస్.. అలాంటి బబుల్‌ ఏర్పడటం సమాజానికి కొన్ని ప్రయోజనాలను అందించవచ్చని పేర్కొన్నారు. పెట్టుబడిదారులు నష్టపోయే అవకాశం ఉన్నప్పటికీ.. ఆ సమయంలో అభివృద్ధి చేసిన ఆవిష్కరణలు మాత్రం అంతరించిపోవని వివరించారు.

ప్రస్తుతం ప్రపంచం ఏఐ బబుల్‌ను ఎదుర్కొంటోందా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. దాన్ని కచ్చితంగా అంచనా వేయడం కష్టమని చెప్పారు. అయితే, ఏఐ సాంకేతికత వాస్తవమైనదని, దాని సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయకూడదని అభిప్రాయపడ్డారు. పెట్టుబడుల విషయంలో బబుల్‌ ఏర్పడితే కొంతమంది నష్టపోవచ్చని, అదే సమయంలో అనేక కొత్త ఆలోచనలకు నిధులు లభించి ఆవిష్కరణలు వేగవంతమయ్యే అవకాశం ఉంటుందని బెజోస్ వివరించారు. అందువల్ల పెట్టుబడిదారులకు నష్టాలు ఎదురైనా సమాజానికి మాత్రం దీర్ఘకాలిక ప్రయోజనాలు కలగవచ్చని ఆయన వాదించారు.

ఇవి కూడా చదవండి

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కాదు.. సూపర్‌ ఇంటెలిజెన్స్‌!

కృత్రిమ మేధస్సును ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌’ (AI) అని కాకుండా ‘సూపర్‌ ఇంటెలిజెన్స్‌’ (SI) అని పిలవడంపై కూడా బెజోస్ స్పందించారు. ‘ఆర్టిఫిషియల్‌’ అనే పదం వినడానికి అంత ఆకర్షణీయంగా లేదని వ్యాఖ్యానించారు. సాధారణంగా కృత్రిమంగా తయారుచేసిన పదార్థాలను ప్రస్తావించేటప్పుడు ఆ పదం సహజమైనది కాదనే భావనను కలిగిస్తుందని చెప్పారు. అయితే, ఏఐ సాంకేతికత మాత్రం వాస్తవమైనదని, దాని వల్ల అనేక రంగాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని బెజోస్ అభిప్రాయపడ్డారు. ఏఐ వల్ల ఉద్యోగాలు తగ్గుతాయా? పని గంటలు తగ్గుతాయా? అనే చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో బెజోస్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే వారానికి మూడు రోజుల పని విధానం అందరికీ సాధ్యమవుతుందా? ఏఐ వల్ల ఏర్పడే ఉత్పాదకత ప్రయోజనాలు ఉద్యోగులకు ఎంతవరకు అందుతాయి? అనేది భవిష్యత్తులో కంపెనీలు తీసుకునే నిర్ణయాలు, ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us