TSPSC Group 1 Notification 2022 expected date: తెలంగాణ రాష్ట్రంలో 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో కీలకమైన పరీక్షల నిర్వహణలో సాంకేతిక అడ్డంకుల్ని అధిగమించేలా రిక్రూట్‌మెంట్ బోర్టుల మధ్య సమన్వయం చేసుకోనున్నాయి. ఏదేని నియామక సంస్థ పరిధిలోని పోస్టుల భర్తీకి ఖరారైన పరీక్షల తేదీకి, మరో నియామక సంస్థ పరిధిలోని పోస్టుల భర్తీకి ఖరారైన పరీక్షల తేదీకి మధ్య కొంత వ్యవధి ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నాయి. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల తేదీల్లో, రాష్ట్ర నోటిఫికేషన్ల పరీక్షలు లేకుండా జాగ్రత్తపడనున్నాయి. పోలీసు కానిస్టేబుల్ పోస్టులు (TS police jobs) మినహా మిగతా వాటికి డిగ్రీ కనీస అర్హత కావడంతో ఉద్యోగార్థులందరూ అన్ని పోస్టులకు పోటీపడేలా చేయడమే లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
సమన్వయం కీలకం..
ఒకసారి నోటిఫికేషన్ ప్రకటించిన తరువాత, ఆ షెడ్యూలులో మార్పులు లేకుండా నిర్ణీత గడువులోగా నియామకాలు పూర్తిచేయాలంటే నియామక సంస్థల మధ్య సమన్వయం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగార్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు, సన్నద్ధతకు సమయం ఇస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో గ్రూప్-1 ప్రకటన తరువాత సివిల్ సర్వీసెస్-2022 ప్రిలిమినరీ, గ్రూప్-1 ప్రిలిమినరీకి మధ్య వ్యవధి ఉండేలా చర్యలు తీసుకోవాలని నియామక సంస్థలకు తాజాగా మార్గదర్శనం చేసింది. ‘‘సివిల్స్ ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులు.. గ్రూప్-1 రాసేందుకు వీలు కల్పించేలా షెడ్యూలు ఉండాలి. తద్వారా రాష్ట్రంలో గ్రూప్-1పై నమ్మకం పెట్టుకున్న ఇతర అభ్యర్థులకు కొంత గడువు లభిస్తుంది. అలాగే గ్రూప్-1, 2, 3, 4 పోస్టుల రాత పరీక్షలకు మధ్య వ్యవధి ఉండేలా చూడాలి. అత్యధికంగా పోస్టులున్న పోలీసు ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు కూడా గ్రూప్స్ రాసేందుకు అవకాశముంది. ఈ క్రమంలో ఈ రెండు పరీక్షల మధ్య సాంకేతిక ఇబ్బందులు లేకుండా చూడాలని’’ ప్రభుత్వం నియామక సంస్థలకు సూచించింది. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం వన్‌టైం రిజిస్ట్రేషన్ (OTR)లో ఇప్పటివరకు టీఎస్‌పీఎస్సీ వద్ద 1.42 లక్షల ఓటీఆర్‌లు నమోదయ్యాయి. చివరి నిమిషం వరకు వేచి ఉండటం కన్నా.. ముందుగానే ఓటీఆర్‌ను సవరించుకోవాలని కమిషన్ సూచిస్తోంది.
ఉద్యోగాల ఎంపిక జాబితా వెల్లడి
రాష్ట్రంలోని పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జూనియర్/సీనియర్ అసిస్టెంట్, టైపిస్టు ఉద్యోగాలకు ఎంపికైన వారి ప్రాథమిక జాబితాను టీఎస్‌పీఎస్సీ సోమవారం ప్రకటించింది. ఈ జాబితాను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొంది.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1కు అంతా సిద్ధం
తొలి గ్రూప్-1 ప్రకటన జారీకి టీఎస్‌పీఎస్సీ సిద్ధమైంది. గ్రూప్-1లో 503 పోస్టుల భర్తీకి వీలైనంత త్వరగా ప్రకటన జారీ చేయాలని భావిస్తోంది. నాలుగైదు రకాల పోస్టులకు సవరణ ప్రతిపాదనలు రెండు మూడు రోజుల్లో అందే అవకాశముంది. ఈ ప్రతిపాదనలు వచ్చిన వెంటనే టీఎస్‌పీఎస్సీ బోర్డు సమావేశమై ప్రకటనపై నిర్ణయం తీసుకోనుంది.
Also Read: