కరోనాతో మన జీవన విధానంలో ఎన్నో మార్పులొచ్చాయి. వృత్తిపరంగా సరికొత్త పని విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో భాగంగా ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమం కోసం చాలా సంస్థలు వర్క్ ప్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేశాయి. కరోనా ప్రభావం తగ్గినా ఇంటి నుంచే పనిచేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఈక్రమంలో అమెరికాకు చెందిన ఓ సంస్థ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సంస్థ ప్రయోజనాల నిమిత్తం ప్రపంచంలోని ఏమూల నుంచైనా పని చేసుకునే వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ స్వేచ్ఛను కల్పించింది. కొంతమంది సిబ్బంది ఆఫీసుకు వస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. శాన్‌ఫ్రాన్సిక్సో వేదికగా పనిచేసే ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb) అనే సంస్థ ఈ వెరైటీ ఆఫర్‌ను ప్రకటించింది. పర్యాటకులకు అవసరమైన హోటల్, బస, పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన బుకింగ్, ఇతర సేవలను ఈ సంస్థ అందిస్తోంది. కాగా నేటి ట్రెండ్‌కు అనుగుణంగా ఉద్యోగులు తమకు నచ్చిన ప్రాంతంలో ఉండేందుకు ఎక్కడి నుంచైనా పని చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఎయిర్‌బీఎన్‌బీ తెలిపింది. ఈ పని విధానంలో ఉద్యోగుల వేతనాలపై ఎలాంటి ప్రభావం ఉండదని కంపెనీ పేర్కొంది. మరికొద్ది నెలల్లోనే ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు సంస్థ సీఈఓ బ్రియాన్ చెస్కీ తమ ఉద్యోగులందరికి తాజాగా సమాచారం పంపారు.
170 దేశాల్లో ఎక్కడైనా..
‘కరోనాతో రెండేళ్ల క్రితం ప్రపంచమంతా తలకిందులైంది. ఆఫీసులన్నీ మూత పడ్డాయి. ఇంట్లో నుంచి పనిచేశాం. పని విషయంలో ఎన్నో అడ్డంకులు ఏర్పడినప్పటికీ మన చరిత్రలోనే అత్యంత ఉత్పాదక కాలంగా ఈ రెండేళ్లు నిలిచింది’ అని చెస్కీ పేర్కొన్నారు. కాగా విదేశాల్లో పనిచేయాలనుకునే వారికి మాత్రం కొన్ని షరతులు, నిబంధనలు విధించారు సీఈఓ. అవేంటంటే.. ఉద్యోగులు ఎక్కడినుంచైతే ఉత్తమ పనితనం చూపించగలరో, అధిక ఉత్పాదకత రాబట్టగలరో అక్కడి నుంచే పని చేసేందుకు సంస్థ వెసులుబాటును కల్పించింది. అయితే ఆఫీస్ కార్యకలాపాలు చూసుకునేందుకు కొద్దిమంది మాత్రం కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. ‘ఇక ఉద్యోగులు దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా మరో ప్రాంతానికి మారిపోవచ్చు. కుటుంబానికి దగ్గరగానైనా, లేదా కోరుకున్న మరో ప్రాంతానికైనా. ఇది శాలరీలపై ఎలాంటి ప్రభావం చూపదు. జూన్ నుంచి జీతం, ఈక్విటీ రెండింటికీ ఒకే తరహాలో చెల్లింపులు జరుగుతాయి. సెప్టెంబర్ నుంచి ఉద్యోగులు 170 దేశాల్లోని ఏ ప్రాంతం నుంచైనా పనిచేసుకోవచ్చు. అయతే పన్నులు తదితర కారణాల వల్ల 90 రోజులు ఒకే ప్రాంతంలో ఉండాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉద్యోగులు తమ వర్క్ పర్మిట్లను పొందాల్సి ఉంటుంది. ఉద్యోగుల సౌలభ్యం కోసం స్థానిక ప్రభుత్వాలతో సంస్థ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. కరోనా మహమ్మారి ఇంకా కొనసాగుతున్న కారణంగా ఈ సంవత్సరం పరిమిత ఆఫ్-సైట్ ఈవెంట్‌లు ఉంటాయి’ అని సీఈఓ బ్రియాన్ స్కీ చెప్పుకొచ్చారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: