
హైదరాబాద్, అక్టోబర్ 7: తెలంగాణ రాష్ట్రంలో 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యుటర్ పోస్టులకు రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్బీ) నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు కూడా మొదలైనాయి. అయితే అక్టోబర్ 5వ తేదీన సాయంత్రం 5 గంటలతో దరఖాస్తుల గడువు ముగిసింది. వరుసగా సెలవులు రావడం, భారీ వర్షాల నేపథ్యంలో దరఖాస్తు గడువు పొడిగించాలని కొందరు అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 11వ తేదీ వరకు దరఖాస్తుల గడువు పొడిగిస్తూ తాజాగా ప్రకటన జారీ చేసింది.
ఇప్పటి వరకు ఈ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7183 మంది రిజిస్ట్రర్ చేసుకోగా.. ఇందులో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు 2193 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. అంటే కేవలం 30 శాతం మంది తమ దరఖాస్తులను పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు దరఖాస్తు గడువు పొడిగిస్తూ టీఎస్ఎల్‌పీఆర్బీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇతర వివరాలకు www.tgprb.in వెబ్‌సైట్ సందర్శించాలని సూచించింది. కాగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు రాష్ట్రంలోని క్రిమినల్ కోర్టుల్లో మూడేళ్లకుపైగా ప్రాక్టీస్ చేసిన లాయర్లు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీఐసెట్ స్పెషల్ ఫేజ్ ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. కొత్తగా స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులు అక్టోబర్ 7వ తేదీ వరకు ఆప్షన్స్ ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించినట్లు అందులో పేర్కొంది. ఇక అక్టోబర్ 10వ తేదీలోపు ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు పూర్తవుతుందని కన్వీనర్ శ్రీదేవసేన ఓ ప్రకటనలో తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.