
తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఎడ్‌సెట్-2026 ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కాన్ఫరెన్స్ హాల్‌లో టీజీసీహెచ్‌ఈ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిస్తా రెడ్డి, ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డిలతో కలిసి ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఈ పరీక్షను వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం విజయవంతంగా నిర్వహించింది. మే 12న రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతీయ కేంద్రాల పరిధిలోని 59 పరీక్షా కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో రెండు సెషన్లలో ఈ ప్రవేశ పరీక్ష జరిగింది.
ఈ ఏడాది ఎడ్‌సెట్ ఫలితాల్లో విద్యార్థులు భారీ స్థాయిలో ఉత్తీర్ణత సాధించారు. పరీక్షకు హాజరైన వారిలో మొత్తం 96.95 శాతం మంది అర్హత సాధించినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ బి. వెంకట్రామ్ రెడ్డి వెల్లడించారు. విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. పరీక్ష కోసం మొత్తం 35,600 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా, వారిలో 29,342 మంది పరీక్షకు హాజరయ్యారు.
చివరకు 28,446 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. కాగా, ఈ ఫలితాల్లో పురుషుల ఉత్తీర్ణత శాతం 98.85% (హాజరైన 4,858 మందిలో 4,802 మంది క్వాలిఫై) కాగా, మహిళలు 96.57% (హాజరైన 24,482 మందిలో 23,642 మంది క్వాలిఫై) ఉత్తీర్ణత సాధించారు. అలాగే పరీక్షకు హాజరైన ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు కూడా క్వాలిఫై అయి 100% ఉత్తీర్ణత నమోదు చేయడం విశేషం.
ఫిబ్రవరి 20న ఈ పరీక్ష నోటిఫికేషన్ విడుదలవగా.. మే 15న ప్రిలిమినరీ కీని అందుబాటులో ఉంచి మే 17 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. అనంతరం నిపుణుల కమిటీ ఆమోదంతో ఫైనల్ కీ ఆధారంగా శనివారం తుది ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.
మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.