హోంశాఖలో ఉద్యోగాల జాతర.. 7,437 పోలీస్ కొలువుల భర్తీ కసరత్తు ఆరంభం
elangana Home Department Recruitment 2026: రాష్ట్రంలో పోలీస్, అగ్నిమాపక, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్) విభాగాల్లో మొత్తం 7,437 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో పోలీస్ శాఖలోనే 5,000 పోస్టులు ఉండగా, మిగతా ఖాళీలను ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖ, ఎస్‌పీఎఫ్‌లో భర్తీ చేయనున్నారు. స్థానిక కేడర్ల వారీగా వివరాలు అందిన వెంటనే టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, వేలాది మంది నిరుద్యోగ యువతకు ఇది భారీ అవకాశంగా మారనుంది..

హైదరాబాద్, జులై 6: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు మరో భారీ శుభవార్త వచ్చేసింది. రాష్ట్ర హోంశాఖలో భారీగా కొలువుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. మొత్తం 7,437 పోస్టులను భర్తీ చేసే ప్రక్రియపై ప్రస్తుతం ముమ్మర కసరత్తు జరుగుతోంది. ఈ పోస్టులన్నింటినీ పోలీసు శాఖతో పాటు అగ్నిమాపక, విపత్తు నిర్వహణ, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్) విభాగాల్లో భర్తీ చేయనున్నారు. ఇందులో ఒక్క పోలీస్ శాఖలోనే ఏకంగా 5 వేల ఉద్యోగాలు ఉన్నాయి. కొలువు భర్తీకి రేవంత్ సర్కార్ తాజాగా గ్రీన్‌సిగ్నల్ రావడంతో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.
పోలీస్‌శాఖలో ఎస్సైలు, ఏఎస్సైలు, కానిస్టేబుళ్ల ఖాళీలతోపాటు అగ్నిమాపక విపత్తు ప్రతిస్పందన, అత్యవసర, పౌర రక్షణ శాఖ (ఫైర్), జైళ్లు, దిద్దుబాటు సేవల శాఖ, ప్రత్యేక రక్షణ దళం (ఎస్‌పీఎఫ్)లోని ఇతర సమానమైన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు బోర్డుకు అనుమతి ఇచ్చింది. స్థానిక కేడర్ల వారీగా విభజన, రోస్టర్ పాయింట్లు, అర్హతలు మొదలైన వివరాలను ఆయా విభాగాలు పంపించిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని బోర్డు ఛైర్మన్ వివి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడించారు. పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, పరీక్షల సిలబస్, పరీక్షల షెడ్యూల్‌ను అధికారిక నోటిఫికేషన్‌లో విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇవే..
- పోలీస్ శాఖలో పోస్టుల సంఖ్య: 5000
- అగ్నిమాపక శాఖలో పోస్టుల సంఖ్య: 790
- జైళ్ల శాఖలో పోస్టుల సంఖ్య: 223
- ఎస్పీఎఫ్‌లో పోస్టుల సంఖ్య: 1,424
