
హైదరాబాద్, జులై 2: దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలో CEN 01/2025 కింద CBT 1 పరీక్షలు ఇప్పటికే పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సీబీటీ 2 పరీక్ష త్వరలోనే నిర్వహించనున్నారు. ఈ మేరకు RRB ALP CBT 2 పరీక్ష తేదీని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) తాజాగా ప్రకటించింది. తాజా షెడ్యూల్ ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాలలో జూలై 28, 2026న CBT 2 పరీక్ష జరగనుంది. ఎంపిక ప్రక్రియలోని మొదటి దశలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 28 జూలై 2026న నిర్వహించే CBT 2 పరీక్షకు తప్పనిసరిగా హాజరవవల్సి ఉంటుంది. అభ్యర్థులకు కేటాయించిన పరీక్ష నగరం, షిఫ్ట్, రిపోర్టింగ్ సమయం, పరీక్షా కేంద్రం వివరాలను తెలుసుకోవడానికి పరీక్షకు 10 రోజుల ముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్, 4 రోజుల అడ్మిట్ కార్డ్ జారీ చేయనున్నారు.
RRB ALP సీబీటీ 1లో అర్హత సాధించిన వారికి షెడ్యూల్ ప్రకారం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 18 జూలై 2026న CBT 2 సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ను జారీ చేస్తుంది. అభ్యర్థులు దీని ద్వారా తమకు కేటాయించిన పరీక్ష నగరం, పరీక్ష తేదీ, షిఫ్ట్ వివరాలను తనిఖీ చేసుకోవచ్చు. RRB ALP CBT 2 అడ్మిట్ కార్డ్ 24 జులై 2026న విడుదల చేస్తారు. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్ధులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీని నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులో పరీక్షా కేంద్రం, రిపోర్టింగ్ సమయం, పరీక్ష రోజు సూచనలు వంటి ముఖ్యమైన వివరాలు ఉంటాయి. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడానికి అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డుతో పాటు చెల్లుబాటు అయ్యే ఏదైనా ఒక ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డును తీసుకువెళ్లాల్సి ఉంటుంది.
RRB ALP సీబీటీ 2 పరీక్ష మొత్తం 175 ప్రశ్నలకు 175 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి 150 నిమిషాలు. ఈ పరీక్ష పార్ట్ ఎ, పార్ట్ బి అనే రెండు విభాగాలుగా ఉంటుంది. పార్ట్ ఎలో గణితం, జనరల్ ఇంటెలిజన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్, ఇంజనీరింగ్ విభాగాల నుంచి 100 ప్రశ్నలకు 90 నిమిషాల వ్యవధిలో రాయవల్సి ఉంటుంది. పార్ట్ బిలో ట్రేడ్ టెస్ట్ లేదా ప్రొఫెషనల్ నాలెడ్జ్‌కు సంబంధించిన 75 ప్రశ్నలు 60 నిమిషాల వ్యవధిలో ఉంటుంది. మొత్తంగా 175 ప్రశ్నలకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.