
హైదరాబాద్, అక్టోబర్ 3: దేశ వ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత విద్యాసంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 నోటిఫికేషన్ ఈ నెలలోనే విడుదల కానుంది. జేఈఈ (మెయిన్) 2026 పరీక్షకు సంబంధించి షెడ్యూల్ త్వరలోనే ఎన్టీయే ప్రకటించనుంది. సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల తాత్కాలిక డేట్‌షీట్‌లు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్‌టీఏ (NTA) అధికారులు జేఈఈ మెయిన్ 2026 పరీక్షల షెడ్యూల్‌పై కసరత్తు చేస్తున్నారు. యేటా ఈ పరీక్షలకు దేశ వ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్ధులు హాజరవుతున్నారు.
జేఈఈ మెయిన్.. జాతీయస్థాయి ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యేటా జనవరి, ఏప్రిల్ రెండు విడతల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తుంది. ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు అభ్యసిస్తున్న విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జేఈఈ సెషన్ 1 పరీక్షకు అక్టోబర్‌లో ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయని ఇటీవల ఎన్టీయే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దరఖాస్తుల సమయంలో విద్యార్ధులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఆధార్ వంటి కీలక ధ్రువపత్రాలను ముందుగానే అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తూ ప్రకటన వెలువరించింది. ఇక జేఈఈ మెయిన్ సెషన్ 1 రాత పరీక్ష 2026 జనవరిలో, సెషన్ 2 పరీక్ష ఏప్రిల్‌లో జరుగుతుందని ఎన్‌టీఏ అందులో స్పష్టం చేసింది.
సీబీఎస్‌ఈ బోర్డు ఇటీవల ప్రకటించిన పరీక్షల టైం టేబుల్‌లో 10, 12వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. దీంతో జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షలు అంతకుముందే పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్ 9 తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతొ జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షకు అక్టోబరులో, సెషన్ 2 దరఖాస్తులు ఫిబ్రవరి ఆఖరు వారం నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. విద్యార్ధులు రెండు సెషన్లు లేదంటే ఏదైనా ఒక సెషన్ పరీక్షకు హాజరుకావచ్చు. రెండు సెషన్లకు హాజరైనవారిలో ఉత్తమ స్కోరును తుది ర్యాంకులుగా ప్రకటిస్తారు. ఇతర వివరాలు జేఈఈ మెయిన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.