JEE Advanced 2022 Revised Exam Schedule: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 పరీక్ష వాయిదాపడిన సంగతి తెలిసిందే! ఈ పరీక్షకు సంబంధించిన రీషెడ్యూల్‌ను ప్రకటిస్తూ ఐఐటీ బాంబే (IIT Bombay) గురువారం (ఏప్రిల్ 14) నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా ప్రకటన ప్రకారం ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి ఆగస్టు 28వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్ నిర్వహించనున్నారు. ఈ ఏడాది జులై 3వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను నిర్వహిస్తామని నెలన్నర క్రితం ప్రకటించినా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇటీవల జేఈఈ మెయిన్ తేదీలను మార్చడంతో అడ్వాన్స్‌డ్‌కు (JEE Advanced 2022 exam date) కొత్త తేదీని ప్రకటించాల్సి వచ్చింది. జేఈఈ మెయిన్ రెండో విడత జులై 30వ తేదీతో ముగుస్తుంది. ఎన్‌టీఏ అధికారులు మెయిన్ ర్యాంకులను ఆగస్టు 6వ తేదీన వెల్లడిస్తారని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దాంతో అందులో ఉత్తీర్ణులైన వారు అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు ఆగస్టు 7వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని ఐఐటీ బాంబే ప్రకటించింది. ఆగస్టు 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష కూడా అదే నెల 28వ తేదీన నిర్వహిస్తారు. ఫీజు చెల్లింపులు ఆగస్టు 12 వరకు ఉంటుంది. అడ్మిట్ కార్డులను ఆగస్టు 23 నుంచి 28 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తాత్కాలిక ఆన్సర్ కీ సెప్టెంబర్ 3న అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. ఫైనల్ ఆన్సర్ కీ సెప్టెంబర్ 11 అందుబాటులో ఉంటుంది.
అంటే జేఈఈ మెయిన్ ఫలితాల వెల్లడి తర్వాత అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధమయ్యే గడువు 20 రోజులు మాత్రమే ఇచ్చారు. గతంలో దాదాపు నెల రోజులు ఇచ్చేవారు. ఈసారి విద్యా సంవత్సరాన్ని త్వరగా ప్రారంభించేందుకు తక్కువ గడువు ఇస్తున్నట్లు భావిస్తున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకులను సెప్టెంబరు 11వ తేదీన వెల్లడిస్తారు. ఒకవేళ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైనవారు ఐఐటీల్లో బీఆర్క్ చదవాలనుకుంటే సెప్టెంబరు 14న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు(ఏఏటీ)ను జరుపుతారు. వాటి ఫలితాలు 17వ తేదీన విడుదలౌతాయి.
Also Read: