పుస్తకం కొనుక్కునే డబ్బుల్లేక.. రోడ్డుమీద తెల్ల పేపర్లు ఏరుకుని వాటిపై రాసుకుని చదువుకున్నాడు.. ఇప్పుడు ఆయనెవరో తెలుసా?

కడుపు నింపుకోవడమే కష్టమైన పరిస్థితి.. చదువుకోవడానికి డబ్బులు లేవు.. ఇంగ్లీష్‌లో రాయడమూ ఓ సవాలే! అయినా లక్ష్యాన్ని వదులుకోలేదు. ఎన్నో కష్టాలను అధిగమించి ఐఐఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎదిగారు కేరళకు చెందిన రంజిత్ రామచంద్రన్. పూరి గుడిసెలో మొదలైన ఆయన ప్రయాణం దేశవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తినిస్తోంది..

పుస్తకం కొనుక్కునే డబ్బుల్లేక.. రోడ్డుమీద తెల్ల పేపర్లు ఏరుకుని వాటిపై రాసుకుని చదువుకున్నాడు.. ఇప్పుడు ఆయనెవరో తెలుసా?
IIM Professor Ranjith Ramachandran Inspiring Journey

Updated on: Oct 29, 2026 | 7:03 PM

సక్సెస్ కావాలంటే కష్టపడాలి. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే పట్టుదలతో ముందుకు సాగాలి. అయితే జీవితంలో కనీస అవసరాలు తీర్చుకోవడమే కష్టమైన పరిస్థితుల్లో ఉన్నవారికి పెద్ద కలలు కనడం కూడా సాహసమే. అలాంటి పరిస్థితుల్లోనూ తన కలను వదులుకోకుండా, ఎన్నో అడ్డంకులను దాటుకుని ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తి రంజిత్ రామచంద్రన్. కేరళలోని ఓ మారుమూల గ్రామంలో పూరి గుడిసెలో పుట్టిన ఆయన.. చివరకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM)లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎదిగారు. ఆయన జీవిత ప్రయాణం చూస్తే కష్టాలను ఎదుర్కొంటూ లక్ష్యం వైపు అడుగులు వేసేవారికి తప్పకుండా ప్రేరణ కలుగుతుంది. రంజిత్ రామచంద్రన్ కేరళలోని కాసరగోడ్ జిల్లాలో పనాదూర్ అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఆయనది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు దినసరి కూలీలు కావడంతో ప్రతిరోజూ పని చేస్తేనే కుటుంబానికి తిండి దొరికేది. ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా ఉన్నప్పటికీ రంజిత్ చదువులో మాత్రం ఎంతో చురుగ్గా ఉండేవారు. ఆయన ప్రతిభను గుర్తించిన ఉపాధ్యాయులు ప్రోత్సహించేవారు. రంజిత్ పాఠశాలలో మంచి మార్కులు సాధించినప్పుడల్లా తల్లిదండ్రులు సంతోషించేవారు. తినడానికి సరైన తిండి లేకపోయినా, కూలి పనులకు వెళ్లి సంపాదించిన డబ్బుతోనే కుమారుడిని ప్రభుత్వ పాఠశాలకు పంపించేవారు.

చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా, అవసరమైన సామగ్రి కొనుగోలు చేసే స్థోమత రంజిత్ కుటుంబానికి ఉండేది కాదు. ప్రభుత్వం అందించిన పుస్తకాలతో పాటు ఉపాధ్యాయులు ఇచ్చిన పాత నోట్‌బుక్స్‌ను ఉపయోగించుకునేవారు. ఎక్కడైనా తెల్ల కాగితం కనిపిస్తే దాన్ని భద్రంగా తీసుకొచ్చి చదువుకు ఉపయోగించేవారు. పదో తరగతి వరకు కేవలం రెండు రూపాయల పెన్నుతోనే చదువును కొనసాగించారు. ఆయన పట్టుదలను గమనించిన కొందరు ఉపాధ్యాయులు తమవంతుగా సహాయం చేసేవారు.

చదువు మధ్యలోనే కూలీ పనులకు..

పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్ చదివే సమయంలో రంజిత్ కుటుంబం మరిన్ని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. ఆయన తండ్రి అనారోగ్యానికి గురికావడంతో కూలి పనులకు వెళ్లలేకపోయారు. చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బు వైద్య ఖర్చులకు, ఆసుపత్రికి వెళ్లి రావడానికే సరిపోయేది. దీంతో కుటుంబాన్ని ఆదుకోవడానికి రంజిత్ కొంతకాలం చదువును పక్కనపెట్టి కూలి పనులకు వెళ్లాల్సి వచ్చింది. అయితే పరిస్థితులు కొంత మెరుగుపడిన తర్వాత మళ్లీ చదువుపై దృష్టి పెట్టారు. ఇంటర్మీడియట్‌లో ఏ కోర్సు ఎంచుకోవాలనే విషయంలో ఉపాధ్యాయులు ఆయనకు సలహా ఇచ్చారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న చదువులకు వెళ్లకుండా ఎకనామిక్స్‌ను ఎంచుకోవాలని సూచించారు. వారి సలహా మేరకు ఎకనామిక్స్ తీసుకున్న రంజిత్, కాలేజీకి క్రమం తప్పకుండా వెళ్లలేకపోయినా మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్ పూర్తయ్యాక డిగ్రీ చదవాలని రంజిత్ నిర్ణయించుకున్నారు. అయితే ఉన్నత చదువులకు అవసరమైన డబ్బును సమకూర్చడం తమ వల్ల కాదని తల్లిదండ్రులు నిస్సహాయత వ్యక్తం చేశారు. అయినప్పటికీ, చదువుకోవాలనే ఆయన కోరికను అడ్డుకోలేదు. ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ తన చదువుకు అయ్యే ఖర్చును తానే భరించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

దీంతో రంజిత్ ఉద్యోగం వెతుక్కుంటూ రాజాపురం వెళ్లారు. అక్కడ బస్టాండ్‌లోనే రెండు మూడు రోజులు గడిపారు. ఎన్నో కార్యాలయాల చుట్టూ తిరిగి ఉద్యోగం కోసం ప్రయత్నించారు. పగటిపూట పనిచేస్తే చదువుకోవడానికి సమయం ఉండదని భావించి, తక్కువ జీతమైనా రాత్రిపూట చేసే ఉద్యోగం కావాలని పట్టుబట్టారు. చివరకు బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో నైట్ వాచ్‌మన్‌గా పని చేసే అవకాశం లభించింది. నెలకు రూ.4,000 జీతం వచ్చేది. అక్కడే ఉండేందుకు చిన్న గది కూడా ఉండటంతో చదువును కొనసాగించడం కొంత సులభమైంది. భోజనానికి కొంత మొత్తం ఖర్చు చేసి, మిగిలిన డబ్బును పుస్తకాలు, ఇతర అవసరాల కోసం దాచుకునేవారు. వీలైనప్పుడు ఇంటికి కూడా డబ్బు పంపించేవారు. ఇలా ఉద్యోగం చేస్తూనే చదువును కొనసాగించి బీఏ ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేశారు.

పీజీ కోసం మరో పోరాటం

డిగ్రీ పూర్తయిన తర్వాత కూడా రంజిత్ ఆగిపోలేదు. పీజీ చదవాలని నిర్ణయించుకున్నారు. అందుకు ప్రధాన కారణం ఉన్నత విద్యతో పాటు హాస్టల్ వసతి, భోజనం వంటి సౌకర్యాలు లభిస్తే తన భవిష్యత్తు కోసం మరింత కష్టపడవచ్చని భావించడమే. ప్రవేశ పరీక్షకు సిద్ధమై కష్టపడి మంచి ఫలితం సాధించారు. కాసరగోడ్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చదివే అవకాశం పొందారు. అక్కడ ఆయనకు మంచి స్నేహితులు, ప్రోత్సహించే వ్యక్తులు పరిచయమయ్యారు. రంజిత్ కష్టపడే తత్వాన్ని చూసి చాలామంది స్ఫూర్తి పొందేవారు. అయితే ఆయన లక్ష్యం కేవలం పీజీతో ఆగిపోలేదు. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ అయిన ఐఐటీలో పీహెచ్‌డీ చేయాలని కలలు కన్నారు. ఆ దిశగా కృషి చేసి ఐఐటీలో పరిశోధన చేసే అవకాశాన్ని సంపాదించారు. ఐఐటీలో పీహెచ్‌డీ చేయడం రంజిత్‌కు మరో పరీక్షగా మారింది. తనకు సబ్జెక్టుపై మంచి అవగాహన ఉన్నప్పటికీ, పరిశోధనకు అవసరమైన స్థాయిలో ఇంగ్లీష్‌లో రాయడం కష్టంగా ఉండేది. తాను రాసిన పేజీల్లో వ్యాకరణ దోషాలు, పదాల ఎంపికలో పొరపాట్లు ఉన్నాయని ప్రొఫెసర్ ఎర్ర సిరాతో గుర్తించేవారు. ఎంత ప్రయత్నించినా ఇంగ్లీష్‌లో తప్పులు వస్తుండటంతో రంజిత్ నిరుత్సాహానికి గురయ్యారు. ఒక దశలో తన వల్ల పీహెచ్‌డీ పూర్తి చేయడం సాధ్యం కాదని భావించి, చదువును వదిలేయాలనుకున్నారు.

అయితే ఆయన ప్రొఫెసర్ సుభాష్ పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ఇంగ్లీష్‌లో ఇబ్బంది ఉన్నంత మాత్రాన తన పరిశోధనను వదులుకోవద్దని ధైర్యం చెప్పారు. సబ్జెక్టుపై అవగాహన ఉన్నప్పుడు భాషపై పట్టు సాధించడం సాధ్యమేనని నమ్మకం కల్పించారు. రంజిత్ ఇంగ్లీష్ మెరుగుపరుచుకునేందుకు ప్రొఫెసర్ సుభాష్ ప్రత్యేకంగా మార్గనిర్దేశం చేశారు. వ్యాకరణం నేర్చుకోవాలని, ప్రతిరోజూ ఇంగ్లీష్ వార్తాపత్రిక చదవాలని సూచించారు. అలాగే ఒక నవలలో రోజుకు పది పేజీలు చదివి, వాటి సారాంశాన్ని తిరిగి ఇంగ్లీష్‌లో రాయాలని చెప్పారు. అంతేకాదు, రంజిత్ రాసిన విషయాలను పరిశీలిస్తూ తప్పులను సరిదిద్దేవారు. ప్రతిరోజూ కొంత సమయం కేటాయించి సబ్జెక్టుకు సంబంధించిన అంశాలపై ఇంగ్లీష్‌లో మాట్లాడేలా ప్రోత్సహించారు. ప్రారంభంలో కష్టంగా అనిపించినా, రంజిత్ పట్టుదలతో సాధన కొనసాగించారు. రోజువారీ చదువు, రాత, మాట్లాడే అభ్యాసం ఫలితంగా క్రమంగా ఇంగ్లీష్‌పై పట్టు పెరిగింది. ఏడాది తిరిగేసరికి తనలో వచ్చిన మార్పును చూసి ఆయనే ఆశ్చర్యపోయారు. చివరకు పీహెచ్‌డీని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన గురువు సుభాష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి, వారికి సరైన దిశ చూపించడమే గురువు బాధ్యత అని ప్రొఫెసర్ చెప్పిన మాటలు రంజిత్‌కు మరింత ప్రేరణనిచ్చాయి.

పీహెచ్‌డీ పూర్తి చేసిన తర్వాత రంజిత్ వివిధ విద్యాసంస్థల్లో పనిచేశారు. అనంతరం ఐఐఎంలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం ప్రయత్నించారు. తన విద్యార్హతలు, పరిశోధన, ప్రతిభ ఆధారంగా ఇంటర్వ్యూలో పాల్గొని ఎంపికయ్యారు. ఒకప్పుడు చదువుకోవడానికి పాత నోట్‌బుక్స్‌పై ఆధారపడిన రంజిత్.. ఇప్పుడు ఉన్నత విద్యాసంస్థలో విద్యార్థులకు పాఠాలు బోధించే స్థాయికి చేరుకున్నారు. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, భాషా సమస్యలు, ఆత్మవిశ్వాసం కోల్పోయే పరిస్థితులు.. ఇలా ఎన్నో సవాళ్లను అధిగమించి తన కలను నిజం చేసుకున్నారు. రంజిత్ రామచంద్రన్ తన పూరి గుడిసె ఇంటి ఫొటోను ఫేస్‌బుక్‌లో పంచుకుంటూ, అక్కడి నుంచే ఐఐఎం ప్రొఫెసర్‌గా ఎదిగిన తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. జీవితంలో పెద్ద కలలు కనాలని, వాటిని నిజం చేసుకునేందుకు పట్టుదలతో పోరాడాలని సందేశమిచ్చారు. ఆయన జీవిత కథ సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చింది. సాధారణ కుటుంబంలో పుట్టి, కనీస సౌకర్యాలు కూడా లేని పరిస్థితుల్లో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవడం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. రంజిత్ విజయం వెనుక ఆయన కృషితో పాటు, చిన్నప్పటి ఉపాధ్యాయుల ప్రోత్సాహం, తల్లిదండ్రుల త్యాగం, ఐఐటీలో ప్రొఫెసర్ సుభాష్ ఇచ్చిన మార్గదర్శకత్వం కూడా కీలక పాత్ర పోషించాయి.

యువతకు రంజిత్ జీవితం చెప్పే పాఠం

రంజిత్ రామచంద్రన్ ప్రయాణం ఒక విషయం స్పష్టం చేస్తుంది. పేదరికం మన ప్రయాణాన్ని కష్టతరం చేయవచ్చు. సరైన అవకాశాలు లేకపోవడం మన వేగాన్ని తగ్గించవచ్చు. కానీ లక్ష్యంపై నమ్మకం, నేర్చుకోవాలనే ఆసక్తి, నిరంతర సాధన ఉంటే ముందుకు వెళ్లే మార్గాలు తెరుచుకుంటాయి. జీవితంలో ఎదురయ్యే సమస్యలను చూసి కలలను వదులుకోవడంరెండు రూపాయల పెన్నుతో చదువుకున్న ఆయన, నేడు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో ప్రొఫెసర్‌గా ఎదిగారు. కష్టాలు మనల్ని ఆపడానికి వచ్చిన అడ్డంకులు మాత్రమే.. మన కలలను వదులుకోవడానికి కారణాలు కావు. పట్టుదలతో ప్రయత్నిస్తే పూరి గుడిసె నుంచి కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని రంజిత్ రామచంద్రన్ జీవితం నిరూపిస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us