JEEలో 99.5 పర్సంటైల్.. NEETలో టాప్‌ 2 ర్యాంక్‌.. ఈ కుర్రాడి సక్సెస్ వెనుక అసలు స్ట్రాటజీ ఇదే!

Academic Star Panshul Bansal Success Story: ఓ సైన్స్ విద్యార్థి మహా అయితే ఏం సాధించగలడు? ఫరీదాబాద్‌కు చెందిన పంషుల్ బన్సల్ ప్రయాణం చూస్తే సమాధానం దాదాపు అన్నీ సాధించవచ్చని చెప్పవచ్చు. జేఈఈ మెయిన్‌ 2026లో 99.5 పర్సంటైల్ సాధించిన పంషుల్.. తాజాగా నీట్‌ యూజీ 2026లో అఖిల భారత స్థాయిలో రెండో ర్యాంకు (AIR-2) సాధించాడు. మొత్తం 720 మార్కులకుగానూ 715 మార్కులు సాధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. నీట్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులలో పంషుల్ కూడా ఉన్నప్పటికీ, టై బ్రేకర్ నిబంధనల కారణంగా అతనికి రెండో ర్యాంకు లభించింది. 8వ తరగతిలోనే డాక్టర్ కావాలనే కలను ఏర్పరుచుకున్న పంషుల్ ప్రయాణం ఇప్పుడు లక్షలాది మంది వైద్య విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తోంది..

JEEలో 99.5 పర్సంటైల్.. NEETలో టాప్‌ 2 ర్యాంక్‌.. ఈ కుర్రాడి సక్సెస్ వెనుక అసలు స్ట్రాటజీ ఇదే!
JEE and NEET Topper Panshul Bansal

Updated on: Jul 19, 2026 | 11:31 AM

హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన పంషుల్ 8వ తరగతిలోనే వైద్య రంగంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. భవిష్యత్తులో మంచి సర్జన్ కావాలనే లక్ష్యంతో సైన్స్ విభాగాన్ని ఎంచుకున్నాడు. తక్షణ ఫలితాల కోసం కాకుండా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో ప్రాథమిక అంశాలను బలంగా అర్థం చేసుకోవడంపై దృష్టి పెట్టాడు. 10వ తరగతి, 12వ తరగతిలో పాఠశాల టాపర్ కాకపోయినా, పోటీ పరీక్షల్లో మాత్రం తన ప్రతిభను నిరూపించుకున్నాడు. జేఈఈ మెయిన్‌లో 99.5 పర్సంటైల్, నీట్‌లో 715/720 మార్కులు సాధించడం అతని క్రమశిక్షణకు నిదర్శనంగా నిలిచాయి.

రోజుకు 8 గంటల చదువు

తన విజయ రహస్యం గురించి పంషుల్ చెబుతూ.. ప్రతిరోజూ దాదాపు 8 గంటలు ఏకాగ్రతతో చదవడం తనకు ఎంతో ఉపయోగపడిందని తెలిపాడు. నీట్ వంటి పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే ఆత్మవిశ్వాసం ఎంతో ముఖ్యమని చెప్పాడు. క్రమబద్ధమైన టైమ్‌టేబుల్‌తో పాటు గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను సాధన చేయడం తనకు ఎంతో సహాయపడిందని వెల్లడించాడు. 11వ తరగతిలో లజ్‌పత్ నగర్‌లో కోచింగ్ ప్రారంభించిన పంషుల్, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం తనకు పరీక్ష ఒత్తిడిని ఎదుర్కోవడంలో, సందేహాలను నివృత్తి చేసుకోవడంలో ఎంతో ఉపయోగపడిందని చెప్పాడు. ఎక్కువ గంటలు చదవడం కంటే నాణ్యమైన చదువు ముఖ్యమని తాను నమ్ముతానన్నాడు. కేవలం థియరీ చదవడం కాకుండా ప్రశ్నలు సాధించడం, భావనలను బలపరచడంపై ఎక్కువ దృష్టి పెట్టానని పంషుల్ తెలిపాడు.

తల్లిదండ్రుల సహకారం

పంషుల్ విజయంలో అతని తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకంగా ఉంది. తన కెరీర్ విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని పంషుల్ తెలిపాడు. పదో తరగతి తర్వాత తనకు అనేక అవకాశాలు ఉన్నప్పటికీ, జీవశాస్త్రంపై ఆసక్తి కారణంగా బైపీసీని ఎంచుకున్నట్లు చెప్పాడు. చిన్న వయసులోనే స్పష్టమైన లక్ష్యం ఉండటం వల్ల సరైన ఆలోచనా విధానం ఏర్పడింది. నా ప్రాథమిక భావనలు బలపడేందుకు అది ఎంతగానో సహాయపడిందని పంషుల్ తెలిపాడు. ఇక పంషుల్ తండ్రి సంజీవ్ కుమార్ బన్సల్ స్టీల్ వ్యాపారవేత్త. దీంతో ఫిజిక్స్‌లో పంషుల్‌కు సహాయం చేసేవారు. తల్లి మోనికా బన్సల్ ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో కంపెనీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఇతర సబ్జెక్టుల్లో మార్గదర్శనం చేయడంతో పాటు, చదువు సమయంలో అతనికి పూర్తి సహకారం అందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, మార్గదర్శకత్వం తనను లక్ష్యంపై దృష్టి పెట్టేలా చేశాయని పంషుల్ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

చదువుతో పాటు ఇతర రంగాల్లోనూ ప్రతిభ

పుస్తకాలకే పరిమితం కాకుండా పంషుల్‌కు ఇతర రంగాల్లోనూ ఆసక్తి ఉంది. ఫైనాన్స్‌కు సంబంధించిన నవలలు చదవడం అతనికి ఇష్టం. సంగీతంపై ఆసక్తితో పియానోలో అంతర్జాతీయ సర్టిఫికేషన్లు కూడా సాధించాడు. రాక్ స్కూల్ నుంచి గ్రేడ్-4, ట్రినిటీ కాలేజ్ లండన్ నుంచి గ్రేడ్-2 సర్టిఫికేషన్ పొందాడు. బ్యాడ్మింటన్, స్కేటింగ్, స్విమ్మింగ్, చెస్ వంటి క్రీడల్లోనూ పాల్గొంటాడు. రూబిక్స్ క్యూబ్‌ను కళ్లకు గంతలు కట్టుకుని పరిష్కరించే నైపుణ్యం కూడా అతనికి ఉంది. అలాగే నిమిషాల్లోనే ప్రపంచంలోని 190కి పైగా దేశాలను ఖాళీ మ్యాప్‌లో గుర్తించే స్థాయిలో భూగోళ శాస్త్రంపై ఆసక్తి పెంచుకున్నాడు.

నా భవిష్యత్తు లక్ష్యం.. సర్జన్

రోజుకు 7 నుంచి 8 గంటల వరకు స్క్రీన్ టైమ్ ఉన్నప్పటికీ.. తాను చూసే కంటెంట్ విషయంలో జాగ్రత్తగా ఉంటానని పంషుల్ తెలిపాడు. విద్యకు సంబంధించిన వీడియోలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని చెప్పాడు. జేఈఈ, నీట్ వంటి రెండు అత్యంత కఠినమైన పోటీ పరీక్షల్లోనూ అద్భుత ప్రతిభ చూపించిన పంషుల్ బన్సల్ ప్రయాణం.. క్రమశిక్షణ, బలమైన ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని నిరూపిస్తోంది. భవిష్యత్తులో సర్జన్‌గా మారి వైద్య సేవలు అందించాలనే తన కలను సాకారం చేసుకునేందుకు పంషుల్ తన ప్రయాణం కొనసాగిస్తున్నాడు.

Follow Us