మరో రెండు రోజుల్లోనే APPSC గ్రూప్‌ 1 నోటిఫికేషన్ 2026 విడుదల.. భారీగా పెరిగిన పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. జాబ్‌ క్యాలెండర్‌లో ప్రకటించిన ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) సెప్టెంబర్ 15న ప్రాథమిక (షార్ట్‌) నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఇందులో పోస్టుల సంఖ్య, దరఖాస్తుల స్వీకరణ తేదీలు, పరీక్షల షెడ్యూల్ వంటి వివరాలను వెల్లడించనున్నారు. అనంతరం అక్టోబర్‌ మొదటి వారంలో పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ విడుదల చేసి సిలబస్, రిజర్వేషన్ రోస్టర్, ఇతర నిబంధనలను ప్రకటించనున్నారు..

మరో రెండు రోజుల్లోనే APPSC గ్రూప్‌ 1 నోటిఫికేషన్ 2026 విడుదల.. భారీగా పెరిగిన పోస్టులు
APPSC Group 1 Notification

Updated on: Sep 13, 2026 | 9:40 AM

అమరావతి, సెప్టెంబర్‌ 13:  గ్రూప్‌ 1లో తొలుత 149 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. అయితే వయోజన విద్య సహాయ సంచాలకులు/ప్రాజెక్టు అధికారి పోస్టులు 4, జిల్లా విద్యాధికారి (DEO) పోస్టులు 14 ఆ జాబితాలో లేవు. వీటిని కూడా కలిపి నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉండటంతో గ్రూప్‌ 1 పోస్టుల సంఖ్య 167కు చేరే అవకాశం ఉంది. ఇటీవల గ్రూప్‌-1 పోస్టుల జాబితాలో కొన్ని మార్పులు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోస్టుల కేడర్, జోన్లకు సంబంధించిన సాంకేతిక సమస్యలు దాదాపుగా పరిష్కారమైనట్లు తెలుస్తోంది. గ్రూప్‌ 1 సర్వీసుల పోస్టుల జాబితాలో పలు మార్పులు చేశారు.

గ్రూప్‌ 1లో కొత్తగా చేరిన పోస్టులు ఇవే..

  • మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (MPDO) పోస్టును గ్రూప్‌-1 జాబితా నుంచి తొలగించారు.
  • జిల్లా పంచాయతీ అధికారి (DPO) స్థానంలో డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (DLDO) పోస్టును చేర్చారు.
  • డివిజనల్‌ అగ్నిమాపక అధికారి పోస్టును జిల్లా అగ్నిమాపక అధికారి (DFO- Fire Services)గా మార్చారు.
  • వయోజన విద్య అసిస్టెంట్‌ డైరెక్టర్‌/ప్రాజెక్టు అధికారి పోస్టులను కొత్తగా చేర్చారు.
  • డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (DSP-Communications) పోస్టును చేర్చారు.
  • జిల్లా విద్యాధికారి (DEO) పోస్టును కూడా గ్రూప్‌-1 జాబితాలో చేర్చారు.
  • డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ పోస్టుల్లో మార్పులు
  • రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా ఆయా విభాగాల్లో పోస్టుల కేడర్లను మార్చారు. ఇందులో భాగంగా డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ పోస్టులను మల్టీజోన్‌ పోస్టులుగా మార్చినట్లు సమాచారం.

జూలై 1 నాటి వయస్సే ప్రామాణికం

గ్రూప్‌-1తో పాటు ఇతర ఉద్యోగాల భర్తీలో 2026 జూలై 1 నాటికి ఉన్న వయస్సును పరిగణనలోకి తీసుకోనున్నారు. కొత్తగా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ (OTR) చేసుకోవచ్చు. ఇప్పటికే OTR ఉన్నవారు కొత్తగా సాధించిన అదనపు అర్హతలను అప్‌డేట్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1, 2 పరీక్షలు ఆఫ్‌లైన్‌లోనే..

గ్రూప్‌-1, గ్రూప్‌-2 నియామక పరీక్షలను మాన్యువల్‌ విధానంలో నిర్వహించాలని APPSC నిర్ణయించినట్లు సమాచారం. మిగతా నియామక పరీక్షలను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఆన్‌లైన్‌ పరీక్షల్లో నార్మలైజేషన్‌ అమలుపై నిపుణులతో అధ్యయనం చేయిస్తోంది. ఆన్‌లైన్‌ విధానంతో ప్రశ్నపత్రాల లీకేజీ వంటి సమస్యలకు అవకాశం తగ్గుతుందని కమిషన్‌ భావిస్తోంది. రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 ప్రకారం 26 జిల్లాల ప్రాతిపదికన ఆరు జోన్లు, రెండు మల్టీజోన్ల విధానం అమల్లోకి వచ్చింది. ప్రత్యక్ష నియామకాల్లో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు, మిగిలిన 5 శాతం ఓపెన్‌ కేటగిరీకి కేటాయించే విధానం అమల్లో ఉంటుంది. పోలీసు నియామకాలను మినహాయించి APPSC ద్వారా భర్తీ చేయనున్న ఇతర ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలను కూడా సెప్టెంబర్‌ 15న విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ (VAS) క్లాస్‌-ఏ పోస్టులను కూడా APPSC ద్వారానే భర్తీ చేయనున్నట్లు సమాచారం. అభ్యర్థులు సెప్టెంబర్‌ 15న విడుదలయ్యే షార్ట్‌ నోటిఫికేషన్‌ ఆధారంగా పోస్టుల సంఖ్య, దరఖాస్తు తేదీలు, పరీక్షల షెడ్యూల్‌ తదితర వివరాలను తెలుసుకోవచ్చు.
గ్రూప్-1లో భర్తీ చేసే ఉద్యోగాలు

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 పోస్టులు ఇవే..

  • డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ పోస్టుల సంఖ్య: 10
  • అసిస్టెంట్ ఆడిట్ అధికారి పోస్టుల సంఖ్య: 14
  • అసిస్టెంట్ ట్రెజరీ/ అకౌంట్స్ అధికారి పోస్టుల సంఖ్య: 1
  • సఅసిస్టెంట్ కమిషనర్ (పాత పేరు సీటీఓ) పోస్టుల సంఖ్య: 14
  • డీఎఫ్‌ఓ (కమ్యూనికేషన్స్) పోస్టుల సంఖ్య: 3
  • డీఎఫ్‌ఓ కేటగిరీ-2 (సివిల్) పోస్టుల సంఖ్య: 36
  • మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2 పోస్టుల సంఖ్య: 12
  • డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి పోస్టుల సంఖ్య: 35
  • డిప్యూటీ కలెక్టర్ పోస్టుల సంఖ్య: 11
  • జిల్లా ఉపాధి కల్పన అధికారి పోస్టుల సంఖ్య: 3
  • జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి పోస్టుల సంఖ్య: 4
  • ప్రాంతీయ రవాణా అధికారి (ఆర్టీఓ) పోస్టుల సంఖ్య: 3
  • జిల్లా గిరిజన సంక్షేమ అధికారి పోస్టుల సంఖ్య: 3
  • వయోజన విద్య అసిస్టెంట్ డైరెక్టర్/ ప్రాజెక్ట్ అధికారి పోస్టుల సంఖ్య: 4
  • జిల్లా విద్యాధికారి (డీఈఓ) పోస్టుల సంఖ్య: 14
Loading...
Unable to load recommendations.
Follow Us