
అమరావతి, నవంబర్ 24: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమైన సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ-2026 (AP DSC 2026) నోటిఫికేషన్‌కు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ నవంబర్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో కొన్ని కీలక విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా అప్లికేషన్లో తప్పులు దొర్లితే వాటిని సరిచేసుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి అవకాశం కల్పించిందో తెలుసుకోవడం ముఖ్యం. డీఎస్సీ-2026కు దరఖాస్తు చేసే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించే ముందు తమ వివరాలను ఎన్నిసార్లైనా మార్చుకునే అవకాశం ఉంటుంది. అయితే ఒకసారి ఫీజు చెల్లించిన తర్వాత మాత్రం నవంబర్ 30లోపు ఒక్కసారి మాత్రమే దరఖాస్తులో మార్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కాబట్టి అభ్యర్థులు ఫీజు చెల్లించే ముందు అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.
అభ్యర్థులు తమ విద్యార్హతలు, అర్హత ప్రమాణాలకు అనుగుణంగా పోస్టులు, మేనేజ్మెంట్లను ఎంపిక చేసుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా ప్రాధాన్యత క్రమాన్ని (Preference Order) ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఏ పోస్టుకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఏ పోస్టుకు తర్వాతి ప్రాధాన్యత ఇస్తున్నారు? అనే విషయాలను అప్లికేషన్లో స్పష్టంగా పేర్కొనాలి. మెరిట్ జాబితా విడుదలైన తర్వాత కూడా అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఏడు రోజుల సమయం కేటాయిస్తారు. అయితే ఈ అవకాశం ఒక్కసారి మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా ఈ దశలో పోస్టుల ప్రాధాన్యత క్రమాన్ని మాత్రమే మార్చుకోవచ్చు. అప్లికేషన్‌లోని ఇతర వివరాలను సవరించుకునేందుకు అవకాశం ఉండదు. కాబట్టి అభ్యర్థులు ముందుగానే సరైన ప్రాధాన్యత క్రమాన్ని ఎంపిక చేసుకోవడం మంచిది.
డీఎస్సీ-2026కు దరఖాస్తు చేసుకునే ప్రతి పోస్టుకు రూ.1,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ విద్యార్హతలకు అనుగుణంగా ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు లేదా వేర్వేరు మేనేజ్మెంట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ప్రతి పోస్టుకు విడివిడిగా రూ.1,000 చొప్పున ఫీజు చెల్లించాలి. ఉదాహరణకు రెండు పోస్టులకు దరఖాస్తు చేస్తే మొత్తం రూ.2,000, మూడు పోస్టులకు అప్లై చేస్తే రూ.3,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఏపీ డీఎస్సీ-2026కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే అప్లికేషన్ పూర్తి చేయడం మంచిది. విద్యార్హతలు, పోస్టుల ఎంపిక, ప్రాధాన్యత క్రమం, ఫీజు చెల్లింపు వంటి అంశాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలి.