అమరావతి, సెప్టెంబర్ 24: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తగా అక్టోబర్ 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2024) పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హాల్ టికెట్లను కూడా విద్యాశాఖ విడుదల చేసింది. మొత్తం 19 రోజులపాటు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్న టెట్ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ తాజాగా విడుదలైంది. అక్టోబరు 11, 12 తేదీలు మినహా 3 నుంచి 21 వరకు టెట్ నిర్వహించనున్నారు. రోజుకు రెండు విడతల చొప్పును ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. అలాగే టెట్ హాల్ టికెట్లలో ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించి పరీక్ష కేంద్రం దగ్గర నామినల్ రోల్స్ సరి చేయించుకోవచ్చని తెలిపారు. ఇందుకు పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తారని వెల్లడించారు. ఇతర సందేహాలు ఉంటే డైరెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు 9398810958, 6281704160, 8121947387, 8125046997, 7995789286, 9398822554, 7995649286, 9963069286, 9398822618 ఫోన్ నంబర్లకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫోన్ చేయవచ్చని సూచించారు.
కాగా టెట్ పరీక్షకు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిలోఇతర రాష్ట్రాల్లో సుమారు 24,396 మంది పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులందరూ తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది.