
ఈ రోజుల్లో ప్రతీఒక్కరూ స్మార్ట్‌ఫోన్ అనేది తప్పనిసరిగా వాడుతున్నారు. ప్రతీఒక్కరి చేతుల్లో ఏదోక ఫోన్ ఉంటుంది. సాధారణ ఫోన్ అయినా లేదా స్మార్ట్‌ఫోన్ అయినా ఉపయోగించుకోవాలంటే సిమ్ కార్డు అనేది తప్పనిసరి. సిమ్ కార్డు ఉంటేనే మొబైల్ డేటా యూజ్ చేయడం, కాల్స్ వంటివి చేసుకోవడానికి వీలవుతుంది. అయితే కొత్త ఫోన్ కొనుగోలు చేసినప్పుడు మీరు మీ ఫోన్లో సిమ్ కార్డును అమర్చి ఉంటారు. అయితే మీరు ఏ టెలికాం కంపెనీ సిమ్ కార్డు చూసినా సరే ఒక మూల కత్తిరించి ఉంటుంది. దీనిని ప్రతీఒక్కరూ గమనించే ఉంటారు.
సిమ్ కార్డు ఒక మూల కత్తిరించి ఉండటం చూటి ఇది ఏదో సాధారణంగా చేస్తారని, దానికి ప్రత్యేక ఏమీ లేదని భావిస్తారు. ఫోన్ సిమ్ స్లాట్‌లో సరిగ్గా సెట్ అవ్వడానికి ఇలా కట్ చేస్తారేమోనని అందరూ అనుకుంటారు. కానీ సిమ్ కార్డును అలా కట్ చేయడం కేవలం ఒక డిజైన్ మాత్రమే కాదట. దాని వెనుక ఒక బలమైన సాంకేతిక కారణం ఉందని నిపుణులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్లు వచ్చిన తొలినాళ్లల్లో సిమ్ కార్డుల డిజైన్ ఇలా కత్తిరించి ఉండేది కాదు. పూర్తిగా చతురస్రాకారంలో ఉండేవట. కానీ నాలుగు మూలలా ఒకేలా ఉండటం వల్ల సిమ్ కార్డును మొబైల్లో ఎలా అమర్చాలో చాలామందికి తెలిసేది కాదు. దీని వల్ల చాలామంది ఫోన్లో సిమ్‌ను తప్పుడు దిశలో అమర్చడం లేదా తలక్రిందులుగా పెట్టడం లాంటివి చేసేవారు. ఇలా సరిగ్గా అమర్చకపోవడం వల్ల ఫోన్‌కు సిగ్నల్స్ వచ్చేవి కాదు. దీంతో పాటు సిమ్‌కు ఉండే మెటల్ చిప్ కూడా దెబ్బతిని పనికిరాకుండా పోయేది.
ఈ క్రమంలో మొబైల్ వినియోగదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సిమ్ కార్డు డిజైన్లలో మార్పులు చేశారు. సిమ్ కార్డును ఒక మూలలో కత్తిరించడం, ఫోన్లోని సిమ్ స్లాటును కూడా అదే డిజైన్‌లో రూపొందించడంతో సామాన్యులకు కూడా సులువుగా సిమ్ ఎలా పెట్టాలో అర్ధమైంది. దీని వెనుక ఉన్న పెద్ద సాంకేతిక కారణం ఇదేనట. సిమ్‌ను తప్పుడు దిశలో పెట్టడం వల్ల షార్ట్ సర్క్యూట్ కూడా జరిగే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రమాదాలను నివారించేందుకు సిమ్ కార్డును ఒక మూల కత్తిరించేలా డిజైన్ తీసుకొచ్చారు. దీని వల్ల సిమ్ కార్డును ఫోన్ లోపల స్లాట్‌లో పెట్టడంలో ఎదురయ్యే సమస్యలు తొలగిపోయాయి. సిమ్ కార్డు దెబ్బతినడం లాంటి సమస్యలు కూడా లేకుండా పోయాయి. సిమ్ కార్డును ఒక మూలలో కత్తరించడం వెనుక అసలు కారణం ఇదే.