చనిపోయిన వ్యక్తి ఏటీఎం కార్డు వాడితే ఏమవుతుందో తెలుసా..? ఇవి తెలుసుకోకపోతే జైలుకే..

ఇంట్లో అత్యవసరంగా డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు పెద్దవాళ్లు తమ ఏటీఎం కార్డు ఇచ్చి పిన్ నంబర్ చెప్పడం మన ఇళ్లల్లో చాలా కామన్. కానీ ఆ అకౌంట్ హోల్డర్ చనిపోయిన తర్వాత కూడా అదే ఏటీఎం కార్డును వాడితే అది మిమ్మల్ని నేరుగా జైలు ఊచలు లెక్కపెట్టేలా చేస్తుందని మీకు తెలుసా..?

చనిపోయిన వ్యక్తి ఏటీఎం కార్డు వాడితే ఏమవుతుందో తెలుసా..? ఇవి తెలుసుకోకపోతే జైలుకే..
Using Deceased Person Atm Card Legal Or Illegal

Updated on: Jun 01, 2026 | 1:53 PM

సాధారణంగా మన ఇళ్లల్లో తల్లిదండ్రులు లేదా కుటుంబంలోని పెద్దలు.. అత్యవసర సమయాల్లో డబ్బులు డ్రా చేసుకోవడానికి వీలుగా తమ ఏటీఎం కార్డులను, పిన్ నంబర్లను పిల్లలకు ఇస్తుంటారు. వారు బతికున్నంత కాలం ఈ ప్రక్రియ చాలా సాధారణంగానే సాగుతుంది. కానీ కుటుంబ సభ్యుడు మరణించిన తర్వాత.. చాలా మందికి తెలియని, తీవ్రమైన చట్టపరమైన ముప్పు ఒకటి పొంచి ఉంది. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వారి ఏటీఎం కార్డు వాడటం లేదా వారి ఫోన్ నుంచి యూపీఐ ద్వారా డబ్బులు విత్‌డ్రా చేయడం మిమ్మల్ని నేరుగా జైలుకు పంపగలదని మీకు తెలుసా? మీరు ఆ అకౌంట్‌కు నామినీ అయినప్పటికీ.. చట్టబద్ధమైన వారసులైనప్పటికీ.. బ్యాంకుకు సమాచారం ఇవ్వకుండా డబ్బులు తీయడం చట్టప్రకారం నేరం.

మరణం తర్వాత అకౌంట్ స్టేటస్ ఏంటి?

బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం.. ఏ వ్యక్తి అయినా మరణించిన వెంటనే అతని బ్యాంక్ ఖాతా చట్టబద్ధంగా ఇన్‌యాక్టివ్‌గా మారుతుంది. ఒక వ్యక్తి మరణంతోనే అతని డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ అకౌంట్ వాడే హక్కు పూర్తిగా ముగిసిపోతుంది. అందువల్ల సదరు వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ ఖాతా నుండి ఎలాంటి డిజిటల్ లావాదేవీలు చేసినా అది చట్టవిరుద్ధమే అవుతుంది.

నామినీ అయినా సరే.. డైరెక్ట్‌గా తీయకూడదు..

చాలా మంది తమ పేరు బ్యాంక్ ఖాతాలో నామినీగా నమోదై ఉంది కదా.. కాబట్టి ఏటీఎం కార్డు నుంచి నేరుగా డబ్బులు డ్రా చేసుకోవచ్చని పొరపాటు పడుతుంటారు. కానీ ఇది పూర్తిగా తప్పు. మీరు నామినీ అయినప్పటికీ చనిపోయిన వ్యక్తికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని, మరణ ధృవీకరణ పత్రాన్ని ముందుగా బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ లీగల్ ప్రాసెస్ ఏమీ లేకుండా నేరుగా ఏటీఎం కార్డుతో డబ్బులు విత్‌డ్రా చేయడం మోసం కిందకు వస్తుంది.

ఈ కఠినమైన నియమం ఎందుకు?

మరణించిన వ్యక్తి డబ్బులు సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతోనే బ్యాంకులు ఈ రూల్‌ను అమలు చేస్తాయి. ఉదాహరణకు.. చనిపోయిన వ్యక్తికి ఒకరి కంటే ఎక్కువ మంది చట్టబద్ధమైన వారసులు ఉండే అవకాశం ఉంది. అటువంటప్పుడు ఒకే వ్యక్తి బ్యాంకుకు తెలియకుండా అకౌంట్ లోని డబ్బు మొత్తాన్ని ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకుంటే, మిగతా వారసుల హక్కులను ఉల్లంఘించినట్లు అవుతుంది. అందుకే వారసులందరి వాదనలు, పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే బ్యాంక్ ఆ డబ్బును విడుదల చేస్తుంది.

ఫిర్యాదు చేస్తే జైలు శిక్షే..

ఎవరైనా బ్యాంకుకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా మరణించిన వ్యక్తి ఖాతా నుండి ఏటీఎం ద్వారా డబ్బు విత్‌డ్రా చేసినట్లయితే.. ఆ తర్వాత కుటుంబంలోని మరో సభ్యుడు లేదా ఇతర వారసులు దీనిపై బ్యాంకులో గానీ, పోలీస్ స్టేషన్‌లో గానీ ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. ఈ సందర్భంలో డబ్బు విత్‌డ్రా చేసిన వ్యక్తిపై మోసం, దొంగతనం ఆరోపణలతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. నేరం నిరూపితమైతే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడే ప్రమాదం ఉంది.

సేఫ్‌గా డబ్బులు క్లెయిమ్ చేయడం ఎలా?

మీ కుటుంబంలో ఎవరైనా మరణించినట్లయితే, కంగారు పడి ఏటీఎం కార్డులు వాడకుండా ఈ పద్ధతి ఫాలో అవ్వండి

బ్యాంకుకు సమాచారం: ముందుగా సంబంధిత బ్యాంకుకు వెళ్లి సదరు వ్యక్తి మరణించినట్లు రాతపూర్వకంగా తెలియజేయండి.

క్లెయిమ్ ఫామ్: బ్యాంక్ నుంచి డెత్ క్లెయిమ్ ఫారమ్ తీసుకోండి.

పత్రాల సమర్పణ: మరణించిన వారి డెత్ సర్టిఫికేట్, మీ గుర్తింపు పత్రాలు, నామినీగా ఉన్నట్లు రుజువులను బ్యాంకుకు అప్పగించండి.

వెరిఫికేషన్: బ్యాంక్ అధికారులు మీ పత్రాలన్నింటినీ ధృవీకరిస్తారు. అంతా కరెక్ట్‌గా ఉంటే కేవలం కొన్ని రోజుల్లోనే ఆ డబ్బు చట్టబద్ధంగా నామినీ లేదా వారసుల ఖాతాకు బదిలీ చేస్తారు.

Follow Us