Telugu News Business UPI payments without internet, even with keypad phone also, UPI transactions details in telugu
UPI transactions: ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ పేమెంట్లు.. కీప్యాడ్ ఫోన్‌తో కూడా..!
దేశంలో డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యుల దగ్గర నుంచి సంపన్నుల వరకూ వీటిని నిర్వహిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ అందరికీ అందుబాటులోకి వచ్చాక ఈ లావాదేవీలు పెరిగాయి. ఫోన్లలోని పేమెంట్ యాప్ లను ఉపయోగించి యూనిఫైడ్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ద్వారా ఇలాంటి చెల్లింపులు జరుపుతున్నారు. రోడ్డు పక్కనే ఉండే ఇడ్లీల బండి నుంచి ఫైవ్ స్టార్ హోటళ్ల వరకూ అన్నిచోట్లా వీటికి అనుమతి ఉంది.
యూపీఐ చెల్లింపులకు ఇంటర్నెట్ చాలా అవసరం. మన ఫోన్ లో నెట్ అయిపోయినా, సిగ్నల్స్ లేకపోయినా జరగవనే విషయం అందరికీ తెలిసిందే. కానీ .. ఫోన్ లో ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐ ద్వారా చెల్లింపులు జరపవచ్చు. అలాగే సాధారణ కీప్యాడ్ ఫోన్ ద్వారా కూడా చేయవచ్చు. అత్యవసర సమయంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ) తీసుకువచ్చిన *99# అనే సర్వీస్ ద్వారా ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్లు చేేసే అవకాశం ఉంది. ఈ విధానంలో మీ బ్యాంకు ఖాతాకు డబ్బు పంపించుకోవచ్చు. అలాగే వేరొకరి నుంచి చెల్లింపులను స్వీకరించవచ్చు. బ్యాంకు ఖాతాలోని బ్యాలెన్స్ కూడా తనిఖీ చేసుకునే అవకాశం కూడా ఉంది. వీటితో పాటు యూపీఐ పిన్ సెట్ చేసుకోవడం, మార్చు కోవడం చేయవచ్చు. దాని కోసం ఈ కింద తెలిపిన పద్దతులు పాటించాలి.
కీ ప్యాడ్ ఫోన్‌లో పేమెంట్లు ఇలా
మీ బ్యాంకు ఖాతాకు లింక్ చేసిన రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి *99# కు డయల్ చేయాలి.
బ్యాంకింగ్ సేవలకు సంబంధించిన అన్ని వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. డబ్బు పంపండి, డబ్బును అభ్యర్థించండి, బ్యాలెన్స్ తనిఖీ, ప్రొఫైల్, పెండింగ్ అభ్యర్థన, లావాదేవీలు, యూపీఐ పిన్ అనే ఆప్షన్లు దానిలో ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన దాన్ని ఎంపిక చేసుకోవాలి.
వేరొకరికి డబ్బులు పంపాలంటే 1 అని టైప్ చేసి, సెండ్ బటన్ ను ప్రెస్ చేయాలి.
డబ్బును పంపే పద్ధతిని ఎంపిక చేసుకోవాలి. అంటే మొబైల్ నంబర్, యూపీఐ ఐడీ, బ్యాంకు ఖాతాను ఎంచుకోవాలి. అనంతరం సెండ్ బటన్ నొక్కాలి.
మొబైల్ నంబర్ ద్వారా లావాదేవీలు చేయాలంటే డబ్బు గ్రహీత యూపీఐకి లింక్ చేసిన మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయాలి.
అనంతరం నగదు మొత్తాన్ని సెండ్ చేయాలి.
చెల్లింపుతో పాటు మెసేజ్, వ్యాఖ్యను కూడా టైప్ చేయవచ్చు.
లావాదేవీని పూర్తి చేయడానికి మీ యూపీఐ పిన్ ను నమోదు చేయండి
దీంతో ఇంటర్నెట్ లేకుండానే మీ చెల్లింపులు పూర్తవుతాయి.
ఈ సేవను ఆపివేయాలనుకుంటే మళ్లీ *99# కు డయల్ చేసి, ఇచ్చిన సూచనలు పాటిస్తే సరిపోతుంది.