Large cap MF: ఈ మ్యూచువల్ ఫండ్స్ తో కనకవర్షమే.. తక్కువ వ్యయం అధిక రాబడి..

ఆధునిక కాలంలో లాభదాయకమైన పెట్టుబడి మార్గాల వైపు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అధిక రాబడి వచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడుతున్నారు. వాటిలో మ్యూచువల్ ఫండ్స్ ముందు వరసలో ఉంటాయి. వీటి వల్ల కొంచెం రిస్క్ ఉన్నప్పటికీ ధీర్ఘకాలంలో అధిక ఆదాయం అందిస్తాయి. ఈ కారణంగా వీటిలో డబ్బులు ఇన్వెస్ట్ చేసేవారు రోజు రోజుకూ పెరుగుతున్నారు. అయితే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, పెట్టుబడి పెట్టే విధానంతో పాటు ఖర్చుల గురించి కూడా తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో 2025లో అత్యల్ప వ్యయ నిష్పత్తి కలిగిన ఐదు టాప్ రేటెడ్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం.

Large cap MF: ఈ మ్యూచువల్ ఫండ్స్ తో కనకవర్షమే.. తక్కువ వ్యయం అధిక రాబడి..
Mutual Funds

Updated on: Jun 01, 2025 | 5:15 PM

పెట్టుబడిదారుల ప్రధాన లక్ష్యం అధిక రాబడి సంపాదించడమే. దాని కోసం లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ చాలా బాగుంటాయి. ఇవి ఒక రకమైన ఈక్విటీ ఫండ్స్. తన డబ్బుల్లో సుమారు 80 శాతాన్ని పెద్ద క్యాప్ స్టాక్ లలో అంటే కనీసం రూ.2 వేల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. తక్కువ రిస్కుతో పాటు స్థిరమైన రాబడిని కోరుకునేవారికి చక్కగా సరిపోతాయి. మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువ కాలం మీ పెట్టుబడిని కొనసాగించడానికి రెండు ప్రధాన అంశాలు దోహదపడతాయి. అవి ఫండ్ రేటింగ్, దాని వ్యయ నిష్పత్తి. ఇవి లార్జ్ క్యాప్ ఫండ్లలో అతి కీలకంగా ఉంటాయి. దీనిలో వ్యయ నిష్పత్తి గురించి తెలుసుకుందాం. ఏటా ఫండ్ హౌస్ మీ నుంచి కొంత మొత్తాన్ని రుసుముగా వసూలు చేస్తుంది. ప్రారంభంలో ఇది చాలా తక్కువ మొత్తం అనిపిస్తుంది. కానీ మీ పెట్టుబడి సుమారు పది నుంచి పదిహేనేళ్లు కొనసాగినప్పుడు ఆ మొత్తం చాలా ఎక్కువగా మారుతుంది. ఉదాహరణకు మీరు రెండు రకాల ఫండ్ లలో డబ్బులు పెట్టారు. ఒకదానిలో 1శాతం, రెండో దానిలో 0.50 శాతం ఖర్చు వసూలు చేస్తున్నారనుకుందాం. 15 ఏళ్ల తర్వాత మీకు మొదటి ఫండ్ కన్నా రెండో ఫండ్స్ లో రాబడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దానికి ఖర్చు నిష్పత్తి చాలా తక్కువ ఉంది.

మ్యూచువల్ ఫండ్స్ విషయంలో రేటింగ్ చాలా కీలకంగా ఉంటుంది. వాటి పనితీరు, రిస్క్, ఫండ్ మేనేజర్ సామర్థ్యం తదితర అంశాల ఆధారంగా కేటాయిస్తారు. సాధారణంగా 4 లేదా 5 స్టార్ రేటింగ్ కలిగిన ఫండ్స్ బాగున్నాయని భావించవచ్చు. ఈ నేపథ్యంలో 5 స్టార్ రేటింగ్ తో పాటు తక్కువ వ్యయ నిష్పత్తి కలిగిన లార్జ్ క్యాప్ ఫండ్ లు వివరాలు తెలుసుకుందాం.

కెనరా రోబెకో బ్లూచిప్ ఈక్విటీ ఫండ్

ఈ ఫండ్ కు 4 స్టార్ ర్యాకింగ్ ఇచ్చారు. దీని ఖర్చు నిష్పత్తి కేవలం 0.48 శాతం మాత్రమే. ఈ లార్జ్ క్యాప్ ఫండ్ మూడేళ్లలో 19.63 శాతం వార్షిక రాబడిని, ఐదేళ్లలో 23.94 శాతం, పదేళ్లో 14.94 శాతం రాబడిని అందించింది.

ఇవి కూడా చదవండి

ఐటీఐ లార్జ్ క్యాప్ ఫండ్

ఈ ఫండ్ ను 2020 డిసెంబర్ లో ప్రారంభించారు. మొదటి మూడు సంవత్సరాల్లో 19.01 శాతం వార్షిక రాబడిని అందించింది. అప్పటి నుంచి 15.76 శాతం చొప్పున అందజేస్తుంది. ఈ ఫండ్ కు 4 స్టార్ రేటింగ్ ఉంది. ఖర్చు నిష్పత్తి కేవలం 0.61 శాతం మాత్రమే.

కోటక్ బ్లూచిప్ ఫండ్

ఈ ఫండ్ మూడేళ్లలో 19.50 శాతం, ఐదేళ్లలో 25.29 శాతం, పదేళ్లలో 13.96 శాతం వార్షిక రాబడిని అందజేసింది. 4 స్టార్ రేటింగ్ కలిగిన ఈ ఫండ్ ఖర్చు నిష్పత్తి 0.62 శాతంగా ఉంది.

ఎడెల్వీస్ లార్జ్ క్యాప్ ఫండ్

ఎడెల్వీస్ లార్జ్ క్యాప్ ఫండ్ ఖర్చు నిష్పత్తి 0.63 శాతంగా ఉంది. దీనికి 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఈ ఫండ్ తన పెట్టుబడిదారులకు మూడేళ్లలో 20.03 శాతం, ఐదేళ్లలో 25 శాతం, పదేళ్లలో 13.62 శాతం వార్షిక రాబడి అందజేసింది.

మహీంద్రా మాన్యులైఫ్

ఈ ఫండ్ నుంచి వార్షిక రాబడి మూడేళ్లలో 18.30 శాతం, ఐదేళ్లలో 24.56 శాతం అందించింది. దీనికి 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఖర్చు నిష్పత్తి 0.66 శాతం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..