
ఇల్లు అనేది సమాజంలో మీకు గుర్తింపు ఇస్తుంది. మీ ఆర్థిక స్థిరత్వానికి, క్రమశిక్షణకు చిరునామాగా నిలుస్తుంది. సొంతిల్లు ఉంటే మీ జీవితానికి భద్రత లభిస్తుంది. చాలామంది తమ తండ్రి నుంచి లేదా వారసత్వంగా వచ్చిన ఇళ్లలో నివాసం ఉంటారు. వాటిని ఆధునిక శైలిలో మార్చుకోవాలని భావిస్తారు. లేకపోతే గతంలో ఉన్న ఇంటికి గదులు పెంచుకోవాలని, విశాలంగా విస్తరించాలని అనుకుంటారు. ఇలాంటి పునరుద్ధరణ పనులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి.
పాత ఇంటిని ఆధునికంగా మార్పులు చేసుకోవడం, నేటి కాలానికి అనుగుణంగా అందంగా మార్చుకోవడం, మరమ్మతులు చేసుకోవడం కోసం బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తాయి. వాటినే హౌస్ రినోవేషన్ లోన్లు అంటారు. వీటి ద్వారా ఇంటిని పునర్నిర్మాణం చేయడం, మరమ్మతులు చేసుకోవడం, కొత్తగా విస్తరించడం తదితర పనులు చేసుకోవచ్చు. దీనికోసం మీ ఆదాయానికి అనుగుణంగా ప్రణాళిక వేసుకోవాలి.
ఇంటిని పునర్నిర్మించుకోవడానికి వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రత్యేకంగా రుణాలను మంజూరు చేస్తాయి. వీటికి అనుకూలమైన వడ్డీ రేట్లు, సౌకర్యవంతమైన రీపేమెంట్ నిబంధనలు ఉంటాయి. మెటీరియల్స్, లేబర్ ఖర్చులు, కాంట్రాక్టర్ ఫీజులు, పునరుద్ధరణ ఖర్చులు ఇలా అన్నింటినీ కవర్ చేసేలా రుణ మొత్తాలను అందజేస్తాయి. అలాగే మరికొన్ని రకాల రుణాలను తీసుకుని ఇంటి పునరుద్దరణ పనులు చేపట్టవచ్చు.
వ్యక్తిగత రుణాలు.. ఇంటిని పునరుద్ధరణ చేసుకోవడానికి వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పూచీకత్తు అవసరం లేకుండా వీటిని మంజూరు చేస్తారు. అయితే గృహ మెరుగుదల రుణాలతో పోలిస్తే వీటికి వడ్డీరేటు అధికంగా ఉంటుంది.
ఆస్తిపై రుణం (ఎల్ఏపీ).. ఆస్తిపై రుణం తీసుకోవడం ద్వారా ఇంటి పునరుద్ధరణ పనులు చేపట్టవచ్చు. వ్యక్తిగత రుణాలతో పోలిస్తే వీటికి తక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి. అలాగే ఎక్కువ మొత్తంలో మంజూరు చేసే అవకాశం ఉంది.
టాప్ అప్ లోన్.. మీకు ఇప్పటికే ఉన్న హోమ్ లోన్ ఉంటే మీరు టాప్ అప్ లోన్ తీసుకునే అవకాశం ఉంది. ఈ నిధులను ఇంటి పునరుద్ధరణతో సహా వివిధ ప్రయోజనాల కోసం వాడుకోవచ్చు.
ముఖ్యమైన విషయాలు.. రుణాలను తీసుకునే ముందు కొన్ని ముఖ్యమైన అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. తద్వారా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటుంది.
ఖర్చులను అంచనా వేయండి.. ఎంత ఖర్చు అవుతుందో లెక్కించండి. మీ పునర్నిర్మాణ అవసరాలను అంచనా వేయండి. ఎక్కడ మార్పులు చేయాలో పక్కాగా నిర్ధారణ చేసుకోండి. మీ బడ్జెట్ కు అనుగుణంగా పనులు చేపట్టండి.
అన్ని ఖర్చులనూ లెక్కించండి.. మెటీరియల్స్, లేబర్ ఖర్చుతో పాటు పర్మిట్లు, ఇతర అదరపు ఖర్చులను కూడా కలుపుకోండి. దానికి అనుగుణంగా రుణాన్ని తీసుకోండి. అలాగే మీరు బ్యాంకుకు నెలవారీ వాయిదాలను సక్రమంగా చెల్లించడం చాలా అవసరం. కాబట్టి మీ ఆదాయం, ఖర్చులకు అనుగుణంగా ప్రణాళిక వేసుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..