SSY: సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌ నుంచి ముందుగానే డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చా? రూల్స్‌ ఇవే!

కూతురి భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి యోజన (SSY) అత్యంత ప్రజాదరణ పొందింది. మెచ్యూరిటీకి ముందే డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చా అనేది ప్రధాన సందేహం. బాలికకు 18 ఏళ్లు నిండాక, ఉన్నత విద్య కోసం ఖాతాలోని 50 శాతం వరకు పాక్షికంగా తీసుకోవచ్చు. వివాహం లేదా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఖాతా ముందస్తుగా మూసివేయవచ్చు.

SSY: సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌ నుంచి ముందుగానే డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చా? రూల్స్‌ ఇవే!
Sukanya Samriddhi Yojana

Updated on: May 16, 2026 | 8:30 AM

కూతురి భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనుకునే కుటుంబాల్లో సుకన్య సమృద్ధి యోజన (SSY) అత్యంత ప్రజాదరణ పొందిన ప్రభుత్వ పథకాలలో ఒకటిగా కొనసాగుతోంది. అధిక వడ్డీ రేట్లు, పన్ను మినహాయింపులు, దీర్ఘకాలిక భద్రత కారణంగా చాలా మంది తల్లిదండ్రులు ఈ పథకాన్ని ఎంచుకుంటున్నారు. అయితే చాలామందికి ఉండే ప్రధాన సందేహం, మెచ్యూరిటీకి ముందే డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చా? అంటే అవును చేసుకోవచ్చు. కానీ కొన్ని ప్రత్యేక నిబంధనలకు లోబడి మాత్రమే చేసుకోవడానికి అనుమతి ఉంది. సాధారణంగా SSY ఖాతా 21 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది. ఈ కాలానికి ముందు పూర్తిగా డబ్బు తీసుకోవడానికి అనుమతి ఉండదు. ఎందుకంటే ఈ పథకం దీర్ఘకాలిక పొదుపును ప్రోత్సహించేలా రూపొందించబడింది.

అయితే బాలికకు 18 ఏళ్లు పూర్తైన తర్వాత, ఖాతాలోని మొత్తం బ్యాలెన్స్‌లో 50 శాతం వరకు పాక్షిక ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. ఇది ప్రధానంగా ఉన్నత విద్య ఖర్చుల కోసం ఉపయోగించేందుకు మాత్రమే. కళాశాల ఫీజులు, అడ్మిషన్ ఖర్చులు వంటి అవసరాల కోసం ఈ మొత్తాన్ని తీసుకోవచ్చు. ఈ సందర్భంలో విద్యాసంస్థ అడ్మిషన్ పత్రాలు లేదా ఫీజు వివరాలు సమర్పించాల్సి రావచ్చు. ఇక కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఖాతాను ముందుగానే మూసివేయడానికి కూడా అనుమతి ఉంది. బాలికకు 18 ఏళ్ల తర్వాత వివాహం జరిగితే ఖాతాను మూసివేయవచ్చు. అలాగే ఖాతాదారురాలి మరణం లేదా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వంటి అసాధారణ పరిస్థితుల్లో కూడా ముందస్తు ముగింపుకు అనుమతి లభించవచ్చు.

అయితే 18 ఏళ్లు రాకముందు సాధారణ అవసరాల కోసం డబ్బు విత్‌డ్రా చేసుకోవడం సాధ్యం కాదు. బ్యాంకులు, పోస్టాఫీసులు ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తాయి. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం SSYను ఒక దీర్ఘకాలిక లక్ష్య పెట్టుబడిగా మాత్రమే చూడాలి. పిల్లల ఉన్నత విద్య లేదా వివాహం వంటి భవిష్యత్ అవసరాల కోసం దీనిని ఉపయోగించడం ఉత్తమం. రోజువారీ అవసరాలు లేదా అత్యవసరాల కోసం అయితే ఇతర లిక్విడ్ పెట్టుబడి మార్గాలను కూడా కలిపి ఉంచడం మంచిదని వారు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us