
జాయింట్ మ్యూచువల్ ఫండ్ ఖాతాలు కలిగిన వారికి సెబీ శుభవార్త చెప్పింది. వారి ఖాతాలకు సంబంధించి నామినీలను తప్పనిసరిగా నామినేట్ చేయాలనే విషయంపై కొత్త నిర్ణయం తీసుకుంది. నామినీ నిర్ణయం ఖాతాదారుల ఇష్టమని తెలిపింది. తప్పనిసరిగా నామినేట్ చేయాలనే నిబంధనలను తొలగించింది. సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ మ్యూచువల్ ఫండ్ నిబంధనలను సమీక్షించింది. వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ప్రోత్సహించే చర్యలను సిఫారసు చేసింది. వాటిని అనుసరించి ఉమ్మడి మ్యూచువల్ ఫండ్ ఖాతా నామినేషన్లను ఆప్షనల్ (తప్పనిసరి కాదు) చేసింది. అలాగే ఫండ్ హౌస్‌లు కమోడిటీ, విదేశీ పెట్టుబడులను పర్యవేక్షించడానికి ఒకే ఫండ్ మేనేజర్‌ని కలిగి ఉండటానికి అనుమతించింది. ఇది ఫండ్ నిర్వహణ ఖర్చును తగ్గిస్తుంది. అంటే మ్యూచువల్ ఫండ్ ఫోలియోలకు నామినేషన్ అనేది వారి ఇష్టప్రకారం చేసుకోవచ్చని తెలిపింది.
జాయింట్ హోల్డర్లకు నామినేషన్ విషయంలో సడలింపు ఇవ్వడం ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. జీవించి ఉన్న సభ్యుడిని నామినీగా అనుమతించడం ద్వారా నామినేషన్ ప్రక్రియ సులభతరం అవుతుంది. దీని ద్వారా ఖాతాల నిర్వహణ సులభమవుతుంది. అనుకోకుండా కలిగే అవాంతరాలను తొలగిస్తుంది. జీవించి ఉన్న చివరి సభ్యుడు నామినీని కేటాయించవచ్చు
ప్రస్తుత వ్యక్తిగత మ్యూచువల్ ఫండ్ హోల్డర్లందరికీ నామినేట్ చేసుకోవడానికి లేదా, నామినేషన్ నుంచి వైదొలగడానికి జూన్ 30 వతేదీ వరకూ అవకాశం ఉంది. అప్పటిలోగా చేసుకోకపోతే ఖాతాలు స్తంభించిపోతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..