
ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశంలో వడ్డీ రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. వచ్చే నెలలో జరిగే ఎంపీసీ కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని ప్రచారం సాగుతోంది. గత మూడు సమావేశాల్లోనూ ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచలేదు. వడ్డీ రేట్లను యాథాతధంగా ఉంచుతూ వస్తోంది. అయితే వచ్చే నెలలో జరిగే సమావేశంలో వడ్డీ రేట్లను పెంచే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే లోన్లు తీసుకున్నవారికి ఈఎంఐలు పెరగడంతో పాటు కొత్తగా లోన్లు తీసుకునేవారికి అధిక వడ్డీ పడనుంది. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేవారికి మాత్రం అధిక వడ్డీ వల్ల లబ్ది చేకూరనుంది.
మొన్నటివరకు అమెరికా-ఇరాన్ మధ్య యుద్దం, గల్ప్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు, ముడి చమురు ధరలు పెరగడం వంటి కారణాల వల్ల ద్రవ్యోల్బణం పెరిగింది. దీంతో వడ్డీ రేట్లను పెంచడంపై ఆర్బీఐ వెనక్కి తగ్గింది. కానీ ప్రస్తుతం యుద్దం ముగిసిపోవడం, అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై సంతకాలు పెట్టడం, ముడి చమురు ధరలు తగ్గిన క్రమంలో అంతర్జాతీయంగా పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఈ సానుకూల పరిస్థితుల క్రమంలో వడ్డీ రేట్లను పెంచే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. వడ్డీ రేట్ల పెంపు గురించి ఇప్పుడు మాట్లాడటం తొందరపాటు చర్య అవుతుందని అన్నారు. వడ్డీ రేట్ల పెంపుకు సిద్దమైతే తమ విధాన వైఖరిని ఇప్పటికే మార్చుకునేవాళ్లమంటూ వ్యాఖ్యానించారు. వచ్చే సమీక్ష సమావేశంలో వడ్డీ రేట్ల పెంపునకు సిద్దమైతే తమ వైఖరిని తటస్థం నుంచి నియంత్రణ స్థాయికి మార్చుకునేవాళ్లమని అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం విషయంలో అప్రమత్తంగా ఉన్నామని, అది గరిష్ట పరిమితికి చేరిందని వ్యాఖ్యానించారు.
భవిష్యత్తులో గణాంకాల ఆధారంగానే వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని సంజయ్ మల్హోత్రా వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే రాబోయే సమావేశంలో వడ్డీ రేట్ల పెంపు ఉండదని అర్థమవుతోంది. అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తతలు తగ్గడం, పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకోవడం శుభపరిణామమని అన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థకు కూడా సానుూల అంశమని అన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు దిగి రావడం, యూరియా ధరలు తగ్గడం మంచి పరిణామమన్నారు. ఇదే జరిగే లోన్లు తీసుకునేవారికి, ఈఎంఐలు కట్టేవారికి ఊరటగా చెప్పవచ్చు. కాగా జూన్‌లో జరిగిన సమావేశంలో ఆర్బీఐ రెపో రేటును 5.25 శాతం వద్ద ఉంచింది.