
ఏటీఎం విత్ డ్రాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) తాజాగా ఓ సర్క్యూలర్ జారీ చేసింది. ఏటీఎం లావాదేవీల పరిమితులపై క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఒక ప్రత్యేక సర్క్యూలర్ విడుదల చేసింది. ఇందులో ఏటీఎంలలో ఉచిత లావాదేవీల పరిమితి, ఉచిత లావాదేవీల లిమిట్ పూర్తయిన తర్వాత అదనపు ఛార్జీలు వంటి అంశాలను పొందుపర్చింది. బ్యాంక్ ఖాతాదారులందరూ ఈ ఏటీఎం లావాదేవీల నిబంధనల గురించి తెలుసుకోవాల్సిన అవసరముంది.

ఖాతాదారుడు తన సొంత బ్యాంక్ ఏటీఎంలలో ఆర్ధిక, ఆర్థికేతర లావాదేవీలు కలిపి నెలకు ఐదు ఉచిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంల విషయానికొస్తే.. మెట్రో సిటీలలో మూడు లావాదేవీలు, మెట్రోయేతర కేంద్రాల్లో ఐదు ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు. ఉచిత పరిమితి ముగిసిన తర్వాత విధించబడే ఛార్జీలపై కూడా ఆర్బీఐ ప్రకటన జారీ చేసింది. ఎంత ఛార్జీలు విధించాలనే దానిపై వివరాలు వెల్లడించింది.

ఉచిత లావాదేవీల పరిమితి ముగిసిన తర్వాత ఒక్కొ లావాదేవీకి గరిష్టంగా రూ.23 మాత్రమే ఛార్జీ విధిస్తారు. పన్ను, ఛార్జీలు అన్నీ కలిపి ఈ పరిమితిలోపే ఉండాలి. అలాగే ఇతర బ్యాంకు ఏటీఎంలో ఒక్కొ లావాదేవీకి గరిష్టంగా రూ.10 వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. టెక్నికల్ సమస్యల వల్ల లావాదేవీ ఫెయిల్ అయినప్పుడు లేదా ఏటీఎంలలో నగదు అందుబాటులో లేక డబ్బులు అందుకోలేని పక్షంలో ఉచిత లావాదేవీల పరిమితిలో దానిని చేర్చరు. అలాగే అలాంటి ట్రాన్సాక్షన్లకు ఎలాంటి ఛార్జీలు విధించకూడదు.

పాయింట్ ఆఫ్ సేల్స్ టెర్మినల్ వద్ద కేవైసీ ప్రీపెయిడ్ చెల్లింపులు, యూపీఐ ద్వారా నగదు విత్ డ్రా, డెబిట్ కార్డుల వద్ద డబ్బులు విత్ డ్రాలకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. ఒక్కొ లావాదేవీలో గరిష్టంగా రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు పరిమితి విధించింది. ఇలాంటి లావాదేవీలకు ఛార్జీలు విధిస్తే ఒక్కొ ట్రాన్సాక్షన్‌కు ఒక శాతం మించకూడదు.

అలాగే ఇంటర్ఆపరేబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్స్ (ICCW)సేవలను అందించడానికి వైట్-లేబుల్ ATM ఆపరేటర్లకు కూడా ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. ఇటువంటి లావాదేవీల సెటిల్మెంట్ నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ లేదా ATM నెట్‌వర్క్‌ల ద్వారా జరపాలని సూచించింది. ఏటీఎంల ఏర్పాటులో గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. బ్యాంకింగ్ యేతర సంస్థల ఆధ్వర్యంలో నడిచే ఏటీఎంలను వైట్ లేబుల్గా పిలుస్తారు. ఇలాంటి ఏటీఎం ఆపరేటర్లు తమ స్పాన్సర్డ్ బ్యాంకుల ద్వారానే కాకుండా ఇతర రుణదాత నుంచి కూడా నగదు సేకరించేందుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది.